Suryaa.co.in

National

డాల్ఫిన్ నోస్ దగ్గర ఎందుకలా వాలుతున్నాయి?

(బాబు భూమా)

ఒకదానిని చూసి మరొకటి, ఫాలో ఫాలో అని పొలోమని వస్తున్నాయి.

బంగాళాఖాతం తీరంలో ఉన్న ఒక సహజసిద్ధమైన, లోతైన ఓడరేవు ఉంది. “డాల్ఫిన్ నోస్” అనే కొండ సముద్రపు అలల తాకిడిని తగ్గించి, నౌకాశ్రయానికి సహజసిద్ధమైన రక్షణ కల్పిస్తుంది. ఇది పెద్ద ఓడలు కూడా సులభంగా రాకపోకలు సాగించడానికి వీలు కల్పిస్తోంది.

హుద్ హుద్ వచ్చినా అది చలించదు. ఎప్పుడూ మేము నమ్మే చంద్రుడు మాకు వున్నాడనే గుండెనిబ్బరం దానిది. అది నమ్మిన దార్శనికునితో పాటు, ఆయన తనయుడు కూడా దాని కోసం నిత్యం తపన పడుతూ వుంటారు.

టీసీఎస్, గూగుల్, కాగ్నిజంట్ వంటి ప్రముఖ సంస్థలు ఇంకా చాలా రాబోతున్నాయి.

ఇది క్లౌడ్ డేటా సెంటర్ హబ్‌గా, డేటా సిటీగా రూపురేఖలు మార్చుకోనుంది. ఎంతలా అంటే వెనుకబడిన ఉత్తరాంధ్రాను, ఆదాయ ఆంధ్రాగా మార్చనున్నది.

అణుశక్తితో నడిచే జలాంతర్గాములతో, దేశానికి తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధాన కార్యాలయంతో తూరుపు నుండి ఇది సగం దేశానికి పైగా పహారా కాస్తోంది. భద్రతకు, వ్యూహాత్మక కార్యకలాపాలకు ఈ తూరుపు తీరం దేశానికి తురుపు ముక్క.

తూర్పు మరియు ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యానికి ఒక ముఖ్యమైన ద్వారం. ఇక్కడి పోర్టు బొగ్గు, పెట్రోలియం, కంటైనర్లు వంటి పెద్ద మొత్తంలో సరుకును నిర్వహిస్తుంది. లాజిస్టిక్స్ మరియు వేర్‌హౌసింగ్ పరిశ్రమకు కూడా ఇది అనుకూలమైన ప్రదేశం. అతిపెద్ద మరియు అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులలో ఇది ఒకటి. దేశానికి అవసమైన మెడికల్ డివైజెస్ దిగుమతులు తగ్గించి, మెడికల్ టెస్టుల ధరలు కూడా గణనీయంగా తగ్గించడానికి ఉత్పత్తులను మొదలెట్టిన దేశ దిగ్గజ మెడ్‌టెక్ జోన్ ఇక్కడే వుంది.

కొత్తగా అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయం కనెక్టివిటీతో పాటు, స్టీల్ ప్లాంట్, పెట్రోలియం పరిశ్రమలతో.. జాతీయ రహదారులతో.. రైలు మార్గంతో.. అన్ని హంగులతో.. సహజసిద్దమైన సౌందర్యంతో.. మంచి మనసులున్న మనుషులతో.. “సిటీ ఆఫ్ డెస్టినీ”, “తూర్పు తీరానికి ఆభరణం” అని పిలువబడే ఈ నగరం అభివృద్ధి చెందే సమయం ఆసన్నమయ్యింది. దేశం విస్మయం చెందేలా దాని సహజ సిద్దమైన అందం, అదృష్టం, నమ్మకంతో.. కొత్త పుంతలు తొక్కనుంది.

దశ దిశా మార్చుకొని దేశ డాటా వ్యాలీగా ఆవిర్భవించడానికి అంకురార్పణ జరిగింది. అక్కడి నుండి సముద్రపు కేబుళ్ల కనెక్టివిటీతో.. శాటిలైట్ నెట్వర్కులతో దేశానికి తూర్పున డాటా నగరంగా మన డాల్ఫిన్ నోస్ నగరం మారనుంది.

LEAVE A RESPONSE