Suryaa.co.in

Andhra Pradesh

‘ప్రపంచానికి ఫ్యాక్టరీగా చైనా’యే ఎందుకు అవతరించింది?

-ప్రజాస్వామ్య దేశాలు వస్తూత్పత్తికి అనుకూలం కాదా?
-ఇప్పుడు గ్లోబలైజేషన్‌ అనుకూల మేధావులను వేధిస్తున్న ప్రశ్నలు ఇవే
-ఎంపి విజయసాయిరెడ్డి

వస్తుసేవలు ప్రధానంగా వస్తువుల తయారీ పారిశ్రామికంగా అభివృద్ధిచెందిన ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు, ఇండియా వంటి ప్రజాతంత్ర దేశాల్లో కన్నా చైనాలోనే ఎందుకు కేంద్రీకృతమౌతోంది? బహుళపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ లేని కమ్యూనిస్టు చైనాయే ‘ప్రపంచానికి ఫ్యాక్టరీ’గా ఎందుకు అవతరించింది? మాన్యుఫ్యాక్చరింగ్‌ (అన్ని రకాల వస్తువులు, సాధనాల తయారీ) కేంద్రంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ప్రాచీన దేశం చైనా ఎందుకు మారుతోంది? అమెరికా, ఇతర పారిశ్రామిక ప్రజాతంత్ర పాశ్చాత్య దేశాలు కూడా తమకు చౌకగా వస్తువులు తయారు చేసి సరఫరా చేసే చైనాను ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి? సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తూ. మంచి ప్రాథమిక సదుపాయాలు సమకూర్చుకుంటున్న ఇండియా వంటి దేశాలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకుండా అమెరికా బడా కంపెనీలు తమ ఉత్పత్తులను చైనాలోనే ఎందుకు తయారు చేయిస్తున్నాయి? నేడు ఈ ప్రశ్నలు ప్రపంచీకరణను ఆహ్వానించిన మేధావులు, ప్రజాతంత్రవాదులను వేధిస్తున్నాయి. ఇండియాకు చెందిన ఒక రాజకీయపార్టీ అగ్రనేత ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో ఇటీవల ప్రసంగిస్తూ ఇదే విషయం ప్రస్తావించారు. బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ లేని చైనాపై వస్తూత్పత్తి విషయంలో పాశ్చాత్య ధనిక, పారిశ్రామిక దేశాలు సహా అత్యధిక దేశాలు ఆధారపడడం అభిలషణీయం కాదనే అభిప్రాయం అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో వ్యక్తమౌతోంది.

చైనాలో తయారీకి అనుకూలాంశాలు ఎన్నో
145 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనాలో ఎలక్ట్రానిక్స్‌ సహా అనేక రకాల వస్తువులు, పరికరాల తయారికి అవసరమైన కనీసం సాంకేతికపరిజ్ఞానం ఉన్న కార్మికులు, ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అదీగాక, కమ్యూనిస్టు పార్టీ నియంత్రిత సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ అందించే సౌకర్యాల కారణంగా చైనాలో సిబ్బంది జీతాలు ఇతర పారిశ్రామిక, వర్ధమాన దేశాలతో పోల్చితే తక్కువ. చైనాలోని ఫ్యాక్టరీ మాన్యుఫ్యాక్చరింగ్‌ వాతావరణం ప్రపంచంలోని అగ్రగామి బడా కంపెనీలకు అత్యంత అనుకూలంగా ఉంది. అక్కడ వస్తూత్పత్తి రంగంలో కీలకమైన ముడిపదార్ధాలు, విడిభాగాల సరఫరా, సకాలంలో అన్నీ అందించే పంపిణీదారులు, చిన్న పరికరాల ఉత్పత్తిదారులు వృత్తిపరమైన ప్రావీణ్యంతో పనిచేస్తారు. కార్మికుల పని ప్రదేశాలు, పని పరిస్థితులకు సంబంధించిన కార్మిక, బీమా చట్టాలు ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో మాదిరిగా ఉండవు. ఈ రంగంలో సరళతరంగా ఉండే చట్టాలు, నియంత్రణ వ్యవస్థలు విదేశీ దిగ్గజ కంపెనీలు చైనాలో భారీ ఎత్తున తమ ఉత్పత్తులను తయారు చేయించుకోవడానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటున్నాయి. సాధారణంగా పాశ్చాత్య, ఇతర ప్రాంతాల ప్రజాతంత్ర దేశాల్లో సిబ్బంది ఆరోగ్యం, భద్రత, ఉపాధి, పర్యావరణ నిబంధనలు కట్టుదిట్టంగా ఉంటాయి. ఇలాంటి బాదరబందీ లేకపోవడంతో గ్లోబల్‌ మెగా కంపెనీలు చైనాలో తయారీకే మొగ్గచూపుతున్నాయి. చైనా తన కరెన్సీ విలువను కృత్తిమంగా తగ్గించి ఉంచడంతో అమెరికాకు చెందిన పోటీ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల ధరల కన్నా తక్కువకు దేశంలో వస్తువులు, సరకులు లభించేలా చేయగలుగుతోంది. ఇంకా చైనాలో తయారు చేసే కంపెనీల ఉత్సత్తుల ఎగుమతులపై ఎగుమతి సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేని పరిస్థితి.

మౌలిక సదుపాయాలు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అధిక పెట్టుబడులే చైనా బలం
చైనా ప్రభుత్వం తనకు అందుబాటులో ఉన్న నిధులను భారీ మొత్తంలో స్వదేశీ మౌలిక సదుపాయాలు, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల అక్కడ ఇంటి అద్దెలు, ఇతర అవసరాలు తక్కువ ఖర్చుతో తీరిపోతున్నాయి. ఈ కారణాల వల్ల పెద్ద గ్లోబల్‌ కంపెనీల ‘ఫ్యాక్టరీ’గా చైనా మారిపోయింది. ఫలితంగా, 2022 ఏప్రిల్‌ ఒకటి నాటికి చైనాకు అగ్రరాజ్యం అమెరికా ట్రిలియన్‌ డాలర్లకు పైగా అప్పు చెల్లించాల్సి ఉందని తేలింది. ప్రపంచానికి అన్నీ తయారు చేసి సమకూర్చే స్థితికి చేరుకున్న చైనా ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవరించింది. వస్తూత్పత్తికి అనువైన ప్రాథమిక సౌకర్యాలు, నిపుణులైన యువతరం, పెట్టుబడులకు అనువైన వాతావరణం, హేతుబద్ధంగా ఉన్న ఉత్పత్తి వ్యయం కారణంగా ఇప్పుడు భారతదేశం కూడా ప్రపంచ కంపెనీలకు మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ కావడానికి చైనాకు గట్టి పోటీ ఇస్తోంది. పరిస్థితులు ఇంకా మెరుగైతే– భారతదేశం 2027–28 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోతుందని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, నీతి ఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా మొన్న ఓ ఇంటర్వ్యూలో జోస్యంచెప్పారు.

LEAVE A RESPONSE