Suryaa.co.in

Political News

అసందర్భంగా చిలుకూరు బాలాజీని ఈ రచ్చలోకి లాగడం దేనికి రాధాకృష్ణా?!

(శ్రీనివాసరావు మంచాల)

‘దేవుడు ఫలానా చోటే ఎందుకు పవర్‌ఫుల్‌గా ఉంటాడు? దేవుడు సర్వాంతర్యామి అని కదా చెబుతారు? కొన్ని దేవాలయాలు వెలవెలబోతుంటాయి. మరికొన్ని దేవాలయాలు కళకళలాడుతుంటాయి. ఇదంతా మార్కెటింగ్‌ మహత్యమే…’ అని మొదలుపెట్టాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన అని మనం నొసలు ముడేసేలోపు ఇదుగో ఈ అసందర్భ ప్రస్తావన మొదలవుతుంది.

‘చిలుకూరు బాలాజీ దేవాలయాన్నే తీసుకుందాం. అక్కడకు వెళ్లే వారికి అమెరికా వీసాలు లభిస్తాయని ప్రచారం చేశారు. ఇంకేముందీ.. అమెరికాలో చదువుకోవాలనుకునేవారు, అక్కడ ఉద్యోగాలు చేయాలనుకొనేవారు చిలుకూరుకు క్యూ కట్టారు. వీసా దరఖాస్తులు ప్రాసెస్‌ చేయడం చిలుకూరు బాలాజీ టెంపుల్‌ పని కాదు కదా. మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి వాడే ట్రిక్కులు ఇవన్నీ……’ అంటాడు.

1) లడ్డూ వివాదం మీద ఏదేదో రాశాడు సరే, నడుమ చిలుకూరును లాగడం దేనికి? అసందర్భ ప్రస్తావన కాదా? ఆ గుడి బాధ్యులు ఏమైనా ప్రచారం చేశారా వీసాల దేవుడు అని, వచ్చి ప్రదక్షిణలు చేయాలని… ఎవరికో మంచి జరిగింది, ఇంకెవరికో చెప్పారు, వాళ్లూ వచ్చి చేశారు, మౌత్ టాక్… నమ్మకాలు అలాగే ఏర్పడతాయి, కొనసాగుతాయి.
2) మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి వాడే ట్రిక్కులా..? నీకు నమ్మకం లేకపోతే పోనీ, అక్కడికి వెళ్లే లక్షలాది మంది నమ్మకాలపై బురద జల్లడం దేనికి..? ఇంకా ఏమంటాడంటే..?

‘మనలో చాలా మందికి దేవుడిపై నిజంగా నమ్మకం ఉండదు. భయం కారణంగా ఎందుకైనా మంచిదని ఓ దండం పెట్టుకుంటారు. దేవుడి సన్నిధిలో తీర్థ ప్రసాదాలను పెట్టి ఆ తర్వాత వాటిని మనం ఆరగిస్తాం. దేవుడు నిజంగానే తనకు భక్తులు సమర్పించిన తీర్థ ప్రసాదాలను ఆరగిస్తే మనం ఇంత ఉదారంగా వాటిని సమర్పించుకుంటామా? దేవుళ్లు వాటిని తినబోరన్న నమ్మకంతోనే విగ్రహాల ముందు పెడతాం. దేవుడి పేరు చెప్పి మనమే అవన్నీ ఆరగిస్తాం. మనిషి స్వార్థానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి?’…. ఇదీ తను రాసింది.

1) దేవుడిపై నిజంగా నమ్మకం ఉండదట, భయంతో ఓ దండం పెట్టుకుంటామట… ఈమధ్యకాలంలో ఇలాంటి విపరీత బాష్యపైత్యం గమనించినట్టు గుర్తులేదు… దేవుడి సన్నిధిలో తీర్థప్రసాదాలు పెట్టి మనమే తింటాం, దేవుడి ఎలాగూ తినడు కాబట్టే అవన్నీ పెట్టి, మనం ఆరగిస్తాం అట… లేకపోతే ఉదారంగా సమర్పించుకోమట, ఇది స్వార్థమట… అవునా..? హబ్బ, ఏం చెప్పినవ్ స్వామీ… నువ్వు మరో దేవుడివి..? నీ అంత గొప్ప ప్రవచనకారుడు కేవలం అక్షరవ్యాపారంలో మాత్రమే ఉండటం ఈ జాతి చేసుకున్న విషాదం…

సరే, ఇక్కడ నేనూ ఓ అసందర్భ ప్రస్తావన చేస్తాను… నమ్మకాలు అంటే చదువుకున్న దేశాల్లోనూ, మనకన్నా చాలా అడ్వాన్స్‌డ్ దేశాల్లోనూ ఎలా ఉంటాయో… నమ్మకాలు ఎవరూ అతీతులు కారని చెప్పడానికి… నమ్మకాలకు లాజిక్కులు అక్కరలేదు… ఎవరి నమ్మకం వాడిది, వెక్కిరించాల్సిన పనేం ఉంది..?

సీనియర్ పాత్రికేయుడు భండారు శ్రీనివాసరావు అమెరికాలో ఉన్నాడు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ దగ్గరకు వెళ్లాడు… ఇక చదవండి… ‘‘ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను శాసించే న్యూయార్క్ స్టాక్ ఎక్సెంజి దగ్గర ప్రఖ్యాతిగాంచిన భారీ బుల్ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాము. నమ్మకమో, మూఢ నమ్మకమో తెలియదు, వీటికి ఎవరూ అతీతులు కారేమో అనిపించే దృశ్యాన్ని అక్కడ చూసాను.

షేర్ లావాదేవీల్లో కలిసి రావాలని కోరుకుంటూ అనేక మంది ఆ బుల్ విగ్రహం వద్దకు వెడతారు. తప్పేమీ లేదు. ఎవరి నమ్మకాలు వారివి. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే ఆ బుల్ వృషణాలను తాకి మనసులో కోరుకుంటే వారు కోరుకున్నట్టుగా షేర్ ధరలు పెరుగుతాయట. ఈ నమ్మకం అక్కడి వారిలో ఎంతగా వున్నదో తెలియడానికి అక్కడ కనిపించిన క్యూలే సాక్ష్యం…’’

పై ఫోటో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి జరిగిన అపచారానికి చిలుకూరు ఆలయంలో అర్చకగణం చేసిన ప్రాయశ్చిత పూజ, ప్రదక్షిణలు… టైమ్ దొరికింది కదాని హిందూ ఆధ్యాత్మిక విశ్వాసుల మీద, విశ్వాసాల మీద సోషల్ మీడియా చాలా మేధస్సును ప్రదర్శించుకుంటున్నారు చాలామంది… మీకూ వాళ్లకూ తేడా ఏమున్నట్టు..?

LEAVE A RESPONSE