– పారదర్శకత, నిబంధనల మేరకు ఆర్జీలను పరిష్కరించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్‌ఎస్ ) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ రజనీ కుమారి లతో కలిసి అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్థేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. నిబంధనలను పాటిస్తూ సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడువుతీరిన ఆర్జీలు ఏ స్థాయిలోను పెండింగ్ ఉండరాదన్నారు. సంతృప్తి కరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయం నేరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఆర్జీదారులు వినతులను సమర్పిస్తారని, ఆయా ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాల్సిన భాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జి. సృజన అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 111 అర్జీలు అందగా.. వీటిలో రెవెన్యూ- 38, పోలీస్- 20,యంఎయుడి`16, డీఆర్‌డీఏ- 5, పంచాయతీరాజ్- 11, కోపరేటివ్ `1, హెల్త్`2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం`1, ఉపాధి హామి `3, పౌర సరఫరాలు-2, హౌసింగ్ `1, విద్య `6, బిసి వెల్ఫేర్ `1, మత్స్య శాఖ `1, ఏపిసిపిడిసిఎల్ `1, మైన్స్ అండ్ జియాలజీ `1 ఆర్‌అండ్ బి `1 అర్జీలు స్వీకరించడం జరిగింది.