– అన్నదాతలను అగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదు
– తేమ పేరిట జలగలలాగ రైతులను దోచుకుంటున్న మిల్లర్లు,అధికారులు
– ధాన్యం కొనుగోలు ప్రకటనలకే పరిమితం
– వరి,మొక్కజొన్న వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మెరుపు ధర్నా
వనపర్తి : వరి,మొక్కజొన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రాలు తాళ్ళ చెరువు, చినగుంటపల్లి, గోపాల్ పేట మరియు వనపర్తి మార్కెట్ యార్డును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బి.ఆర్.ఎస్ శ్రేణులతో కలసి సందర్శించి, రైతుల గోడు విని మార్కెట్ యార్డులో మెరుపు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నెలల తరబడి వేచి చూస్తున్న రైతులను ముప్పతిప్పలు పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. ప్రతి గింజ కొంటాం అన్న మంత్రుల,అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. రైతుబంధు ఇవ్వకున్న,కరెంటు కోతలు ఉన్నా, సాగునీరు ఇవ్వకున్నా అష్టకష్టాలు పడి పండించిన వరి -మొక్కజొన్న- ధాన్యములను కొనకుండా, రైతులను హరిగోసలు పెడుతున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని హెచ్చరించారు.
ట్రాన్స్పోర్ట్, హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత తీర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. యాసంగి పంటలో ఎటువంటి తరుగు ఉండదని తెలిసి కూడా క్వింటాలుకు 10కిలోల తరుగు తీస్తూ రైతులను జలగల లాగ మిల్లర్లు, అధికారులు కుమ్మకై దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం యాసంగిలో రైతులు 65 లక్షల 45వేల ఎకరాలలో వరి సాగు చేశారని 1కోటి 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం ఉన్నప్పటికీ కేవలం 15,16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.
మొక్కజొన్న పంటను 16లక్షల 46వేల ఎకరాల లో సాగు జరిగిందని, వర్షాభావం వల్ల రైతులు మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇచ్చారని ఎక్కడ చూసినా మొక్కజొన్న కుప్పలు కుప్పలుగా రాశులు కనిపిస్తున్నాయని నేటికి ఒక్క క్వింటాలు మొక్కజొన్న కొనుగోలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. కె.సి.ఆర్ హయాంలో రైతులకు సకాలములో యూరియా ,కరెంట్,సాగునీరు అందించి మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతులు వైభోగంగా గ్రామాలలో బొడ్రాయి,పెద్దమ్మ పండుగలు నిర్వహించుకుని సౌభాగ్యంగా ఉన్నారని కొనియాడారు.
కనీసం యూరియా అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. అన్నదాతలను అగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదు అని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వరి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు లేని పక్షములో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, కె.మాణిక్యం, భాను ప్రకాష్, రఘు వర్ధన్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, గంధంపరంజ్యోతి, కౌన్సిలర్స్ మురళీ సాగర్ శ్రీకర్ గౌడ్, సర్పంచ్ కె. స్వప్న భాస్కర్, బి.బాలరాజు, తిరుపతయ్య,, ధర్మా నాయక్, హేమంత్ ముదిరాజ్, వెంకట్ సాగర్, జోహెబ్ హుస్సేన్, మహేశ్వర్రె డ్డి, చిట్యాల. రాము, పోతులపల్లి.రాజు,నందిమల్ల. రమేష్, కవితా నాయక్, నీల స్వామి, గులాం ఖాదర్ ఖాన్, హరీఫ్, ఏ. కే.పాషా తదితరులు ఉన్నారు.