-పారిశ్రామికవేత్తలకు రూ. 12 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన కేంద్రం
-రైతు రుణాలను ఎన్పీఏ కింద చేర్చిన బ్యాంకర్లు
-అమలు కానీ రుణమాఫీతో కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకర్లు
-34 శాతమే పూర్తయిన ఖరీఫ్ రుణాల పంపిణీ లక్ష్యం
-100% రుణమాఫీ అమలు చేసి కొత్త రుణాలు రైతులకు ఇప్పించాలి
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
అంబానీ, ఆదాని, బహుళ జాతి కంపెనీల పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను ఎన్పీఏ కింద రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణాలను రద్దు చేయడానికి ఎందుకు వెనకాడుతుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు చేయాల్సిన కర్మ ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ డబ్బులను బ్యాంకర్లకు చెల్లించకపోవడంతో రైతులు తీసుకున్న రుణాలను ఎన్పీఏ కింద బ్యాంకర్లు డిక్లేర్ చేసి కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు తీసుకున్న రుణాలు రూ.12 లక్షల కోట్ల రుణాలను బ్యాంకర్లు ఎన్పీఏ కింద డిక్లేర్ చేస్తే… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ ఎనిమిది సంవత్సరాల్లో వాటిని రద్దు చేసిందన్నారు. కానీ రైతుల రుణాలను రద్దు చేయలేదని విమర్శించారు.
కేంద్రంలోని బిజెపి రైతు ప్రభుత్వమా? లేక కార్పొరేట్ల ప్రభుత్వమో? దీనిని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రైతు రుణమాఫీ గురించి చొరవ చూపితే బాగుండేదని అన్నారు. పెండింగ్ ఫామ్ లోన్స్ గురించి బ్యాంకర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించి రుణాలు ఇప్పించి ఉంటే రైతులకు మేలు జరిగి ఉండేది అన్నారు. కానీ కేంద్ర మంత్రి పర్యటన ఉపన్యాసాలకు పరిమితం కావడం విచారకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ. 40, 700 కోట్లకు గాను, బ్యాంకర్లు కేవలం రూ. 14,018 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్టు తెలుస్తుందని చెప్పారు. 34. 13 శాతం మాత్రమే బ్యాంకర్లు ఈ ఖరీఫ్ సీజన్లో రుణాలను పంపిణీ చేశారని మిగతా రుణ లక్ష్యాన్ని విస్మరించారని పేర్కొన్నారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించి ప్రాయార్టీ సెక్టార్స్ లెండింగ్ కింద వ్యవసాయానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి వారితో చర్చించి సరైన సమయంలో రుణం అందే విధంగా గత ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయని వివరించారు. ఈ వ్యవసాయ సీజన్ గడువు ముగిసే దశ వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించ లేదన్నారు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం కారణంగా రైతులు బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్న స్పందించడం లేదని వెల్లడించారు. రైతులు తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడంతో ఇర్రెగ్యులర్ అకౌంటుగా మారి కొత్త రుణాలను రైతులు పొందలేకపోతున్నారని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక ప్రైవేటు వ్యాపారుల వద్ద తీసుకువచ్చిన అప్పులు తీర్చలేని పరిస్థితిలోకి రైతులు నెట్టీ వేయబడుతున్నారని వెల్లడించారు. ఈ దుస్థితే రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శించకుండా త్రో ఫార్మర్ పాలసీతో నిర్ణయాలు చేశారని గుర్తు చేశారు. 100% రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల ప్రస్తుతం రైతులు ఆశాంతి, ఆందోళనతో ఉన్నందున వెంటనే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయడంతో పాటు బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.