తెలంగాణ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా పోలవరం పూర్తి చేస్తాం: జీవీఎల్

పోలవరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల పంటతో పాటు, భద్రాచలం, పర్ణశాల వంటి ప్రదేశాలు నీట మునుగుతాయని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో తెలంగాణ ఒప్పుకుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కేంద్ర చట్టంలో ఉందని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుతో భద్రాచలంకు ముప్పు ఉందనే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలను తాము రాజకీయ అభ్యంతరాలుగానే చూస్తామని అన్నారు. తెలంగాణ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. వరద నష్టం అంశాన్ని పార్లమెంటు సమావేశాల జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ సమావేశాలు జరగకుండా నిలువరించి, రాజకీయ లబ్ధి పొందాలని యత్నిస్తున్నాయని మండిపడ్డారు.