కర్ణుడికి పుట్టుకతోనే వచ్చిన కవచ కుండలాల్లా…. ప్రభుత్వాలకు ‘నిఘా’ విభాగం అని ఒకటి ఎల్లప్పుడూ నీడ లాగా ఉంటుంది. పాలక పక్షాలు…. అయిన దానికి, కాని దానికీ వీటిపై భారీగా ఆధార పడుతుంటాయి. నిజానికి, తమ పాలనా తీరు పైనో, వ్యవహార శైలి పైనో…., తమ మంత్రుల నడక తీరు పైనో ప్రజలు ఏమనుకుంటూన్నారో తెలుసుకోడానికి పాలకులు ఈ నిఘా వ్యవస్థలను అసలు వాడుకోరు.
తమ ప్రత్యర్థులరాజకీయ ఆలోచనలు, రోజువారీ కార్యకలాపాలు, వారి ఆర్ధిక మూలాల గుట్టుమట్టులు మొదలైనవాటిని తెలుసుకోడానికే ఈ ‘ ”నిఘా’ వ్యవస్థను అధికారం లో ఉన్న వారు ఎక్కువగా (దుర్)వినియోగం చేస్తుంటారు.
ఇందుకోసం, పోలీసు శాఖలోనే ఒక విభాగం పనిచేస్తుంది. ఈ విభాగం లో పని చేసేవారందరూ పోలీసులే.కానీ, ఈ విభాగం హోమ్ మంత్రిత్వ శాఖ మంత్రి అజమాయిషీ లో ఉండదు.
నేరుగా ముఖ్యమంత్రి/ ఆయన కార్యాలయం కనుసన్నలలో పని చేస్తుంది. ప్రతిరోజు ముఖ్యమంత్రిని ముందుగా కలిసి ; ఆ కిందటి రోజు రాష్ట్రం లో జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సమస్త విశేషాల ముఖ్యాంశాలతో నివేదించడం నిఘా విభాగం ముఖ్యమైన దినచర్య.
అందువల్ల, ఒక అదనపు డీజీ హోదా కలిగిన ఐపీఎస్ అధికారిని నిఘా విభాగం అధిపతి గా నియమిస్తారు. ఆయన కింద ఓ అర డజను ఐపీఎస్ లతో కూడిన దిగువ స్థాయి సిబ్బంది కూడా భారీగానే ఉంటారు.
ఈ వ్యవస్థ…. రెండు పక్కలా పదునున్న చాకులాటిది. అధికారం లో ఉన్నవారు ఇంటలిజెన్స్ విభాగాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే విషయం…. ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వ్యక్తి మానసిక స్థితి, స్థాయి, ధృక్పథం, వ్యక్తిగత సంస్కారం, వ్యవహార శైలి పై ఆధారపడి ఉంటుంది.
2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహనరెడ్డి రాజకీయ దృక్పధం, మానసిక పరిణతి, స్థాయి,వ్యవహార శైలి కి అనుగుణం గానే అప్పటి నిఘా విభాగం అధిపతి అయిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు వ్యవహరించారని పలువురు ఐపీఎస్ అధికారులు ప్రైవేటు సంభాషణల్లో వ్యాఖ్యానిస్తుంటారు. ఆ శ్రీరాముడు ఆంజనేయుడిని లంకకు వెళ్లి చూసి రావయ్యా అంటే…. లంక అంతా తగలబెట్టేసి వచ్చినట్టుగా ; ఈ ఐపీఎస్ ఆంజనేయుడు మొత్తం వ్యవస్థలన్నింటినీ నిలువునా తగలబెట్టారని ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు.
పోలీసు వ్యవస్థకు నిఘా విభాగం దాదాపుగా ఒక సమానాంతర వ్యవస్థ గా పని చేస్తుంటుంది . ప్రతి (ఉమ్మడి)జిల్లా లోనూ ఒక అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో స్వంత పరివారం ఉంటుంది. ఈ అదనపు ఎస్పీ ని “ఆర్ ఐ ఓ” అంటారు. అంటే – రీజినల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ – అని.
ఇంత ‘బిల్డ్ అప్ ‘ ఉన్నప్పటికీ ; ముఖ్యమంత్రి పట్ల ప్రజలలో “పబ్లిక్ పర్సెప్షన్” ఎలా ఉన్నది అనే విషయాన్ని మాత్రం…. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి సూటిగా చెప్పడానికి నిఘా విభాగం సాహసించదు.
ఒకవేళ అది బలహీనం గా ఉంటే, ఆ “పబ్లిక్ పెర్సెప్షన్ ” ను మెరుగు పరుచుకునే సలహాలు ఇచ్చే ధైర్యం చేయలేదు. ఖర్మ జాలక ఏదైనా సలహా ఇస్తే, ‘ నాకు తెలియదా!? ” అని అంటారేమోనని భయం.
అందువల్లనే,క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చే “సాహసం ” నిఘా విభాగాధికారులు సాధారణంగా చేయలేరు.
అందులోనూ, నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న చంద్రబాబుకు ” పబ్లిక్ పెర్సెప్షన్ ” గురించి చెప్పడం అంటే…., తాతకు దగ్గులు నేర్పడమే కదా! అందువల్ల, నిఘా విభాగం వీలైనంత జాగ్రత్త గా ఉంటుంది.
ప్రభుత్వాధినేత కోరిన సమాచారాన్ని మాత్రమే సేకరించి, ముఖ్యమంత్రి, లేక ఆయన కార్యాలయం, లేక ఆయన అనుమతి పొందిన వారికి సమర్పించడానికే నిఘా విభాగం దాదాపు పరిమితం అవుతుంది.
పాలనకు, రాజకీయాల నిర్వహణకు సంబంధించి…. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయానికి ఆసక్తి ఉండడానికి అవకాశం గల అంశాలు సవాలక్ష ఉంటాయి.
అయితే, నిఘా విభాగం అందించే ఈ సమాచారం అంతా…. వాస్తవానికి దగ్గరగా ఉన్నదని చెప్పడానికి కూడా వీలు లేదు. ముఖ్యమంత్రి కోరిన సమాచారం సేకరించడానికి నిఘా విభాగాధిపతి…. జిల్లాలలోని ఎస్పీల తో పాటు,తమ స్వంత యంత్రాంగం మీదే ఎక్కువ ఆధార పడడం సహజం.
అయితే ; జిల్లాల్లో పని చేసే ఇంటలిజెన్స్ అధికారులు, ఎస్పీ లలో కుల, మత, ప్రాంత, రాజకీయ భావ రాగద్వేషాలు ఇటీవలి కాలం లో పరిమితులు దాటుతున్నాయా అనే స్థాయిలో ఉంటున్నాయి.వాటికి అనుగుణం గానే వారు తమ నివేదికలు పంపడం సహజం .
ఇలా కేంద్ర నిఘా కార్యాలయానికి జిల్లాల నుంచి వచ్చే ” నివేదిక” లను క్రోడీకరించి , నిఘా విభాగం వారు ముఖ్యమంత్రికి అందిస్తారు.
ప్రభుత్వ / ముఖ్యమంత్రి వ్యవహార శైలి పై ” పబ్లిక్ పెర్సెప్షన్” పై నిజాయతీ/ వాస్తవికత తో కూడిన నివేదికలు నిఘా విభాగం నుంచి సాధారణం గా రాకపోవడానికి కారణాలు లేకపోలేదు.
1. ” పబ్లిక్ పెర్చెప్షన్ ” అంత ఆశాజనకం గా అనిపించక పోతే ; ముఖ్యమంత్రికి ఆ అప్రియమైన సమాచారం తో కూడిన నివేదికలు నిఘా విభాగం ఇవ్వలేదు.
2. జిల్లాల లో నిఘా విభాగాల అధిపతులు కొందరు ….తమ విధులను సీరియస్ గా తీసుకోరు.
3. కొందరు డీఎస్పీలైతే ఆఫీసుల్లో కూర్చుని సర్వే నివేదికలు సైతం రాసి పంపేసి, చేతులు దులిపేసుకుంటారనే అప ప్రథ కూడా లేక పోలేదు .
4. వీటికి తోడు, పోలీస్ శాఖను ప్రభావితం చేసే కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ గోలకు నిఘా విభాగం అతీతం ఏమీ కాదు గదా!
“ఇటువంటి ” ఇంటలిజెన్స్ రిపోర్ట్ లను నమ్ముకుని, ” పబ్లిక్ పెర్సెప్షన్” ఇదీ అని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పరు. అయితే, దానిని గమనం లోకి తీసుకోకుండా; 2029 ఎన్నికలకు తయారవడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశమే. ఏ ఇంటలిజెన్సూ విభాగమూ ఏ అధికార పక్షాన్నీ గతం లో కాపాడలేదు.
2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలకు పిలుపు ఇచ్చారు. అయితే ” పబ్లిక్ పెర్చెప్షన్ ” ను ఆయన గమనం లోకి తీసుకుంటున్నారా అనే సందేహం. చాలామంది తెలుగుదేశం శ్రేయస్సు కోసం రక్తం చిందించడానికి కూడా వెనకడుగు వేయని క్రియాశీలక కార్యకర్తలకు, క్రియాశీలక ద్వితీయ శ్రేణి నాయకులకు, శ్రేయోభిలాషులకు, సానుభూతి పరులకు కలుగుతున్నది. ఎందుకంటె…. ఆయన నిర్వహించిన పార్టీ నేతల సమావేశానికి 53 మంది శాసన సభ్యులు హాజరు కాలేదని ముఖ్యమంత్రి చెప్పారు.
తెలుగుదేశం ( కూటమి ) అధికారం లోకి వచ్చిన మొదటి సంవత్సరానికే 53 మంది మొహం చాటేస్తే ; రెండో సంవత్సరానికి…., మూడో సంవత్సరానికి…., నాలుగో సంవత్సరానికి…. పరిస్థితి ఏమిటి అనేది టీడీపీ కార్యకర్తలకు అర్ధం కావడం లేదు.
అందుకే, తన పాలన, వ్యవహారం శైలి, ప్రభుత్వ నడక తీరు, పార్టీ నడుస్తున్న పధ్ధతి మొదలైన వాటిపై ” పబ్లిక్ పెర్సెప్షన్ ” ను ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి, అవసరమైతే దిద్దుబాటు చర్యలు తీసుకోడానికి ముఖ్యమంత్రి కార్యాలయం లోనే ” ఫీడ్ బ్యాక్ ” ఒకదానిని ఏర్పాటు చేసుకోవాలి.
జుట్టు అంటూ ఒకటి ఉంటే…. ఏ జడ అయినా వేసుకోవచ్చు. వాలు జడ వేసుకోవచ్చు, పూల జడ వేసుకోవచ్చు, రెండు జడలు వేసుకుని ముందుకు వేసుకోవచ్చు, ముచ్చిలిగుంటలో గుండ్రం గా పెద్ద కొప్పు గా అలంకరించుకోవచ్చు. లేదంటే, జుట్టు అలా దువ్వుకుని వదిలేయవచ్చు. అసలు జుట్టు అనేది లేకపోతే!?.
– భోగాది వేంకట రాయుడు