Suryaa.co.in

Andhra Pradesh

ధాన్యం కొనుగోళ్ల సొమ్మునుకూడా రైతుల సాయంలో చూపుతారా?

-అసెంబ్లీ సాక్షిగా రైతులను మోసగించిన జగన్ క్షమాపణ చెప్పాలి!
-రైతులు, మహిళలకోసం ఖర్చుచేశామని చెబుతున్న డబ్బు ఎక్కడిది?
-దమ్ముంటే చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయండి
-మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజం

అమరావతి: రాష్ట్ర శాసనసభ సాక్షిగా రైతులకోసం ఖర్చుచేసినట్లుగా చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిన తప్పుడు గణాంకాలకు రాష్ట్రప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అబద్ధాలు చెప్పేందుకు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసన సభ సాక్షి గా జగన్ రెడ్డి చేసిన వక్రీకరణలను పత్రికల్లో ప్రచురించడానికి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించడం దుర్మార్గం. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… శాసనసభ చివరి రోజున జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగిస్తూ మూడేళ్ళ 40నెలల్లో రైతులకు రూ.1,27,823 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. అదే విషయాన్ని పత్రికల్లో పుల్ పేజీ యాడ్ ఇచ్చి ప్రచురించుకున్నారు. వై ఎస్ ఆర్ చేయూతలో మహిళల కోసం రూ.2.39లక్షలకోట్లు ఖర్చు చేశామని రాసుకున్నారు. రెండింటికి కలిపి మూడున్నరేళ్ళలో రైతులకు, మహిళలకు రూ.3, 66,836కోట్లు ఖర్చు చేశామని తప్పుడు లెక్కలు చెప్పారని దుయ్యబట్టారు. విలేకరుల సమావేశంలో చంద్రమోహన్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే…!

ధాన్యం కొనుగోళ్లను రైతుల సాయంలో చూపుతారా?
ధాన్యం, ఇతర పంటల కొనుగోలు కోసం రూ.51,747కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఉచితంగా ఇచ్చినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లను కూడా ఖర్చుగా చూపించడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. కొన్న పంటను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. అందుకుగాను కేంద్రం డబ్బుని రీఎంబర్స్ మెంట్ చేస్తుంది. లేదా మార్కెట్లో అమ్ముకొంటారు. ధాన్యం కొనుగోళ్ల సొమ్మును రైతులకు చేసిన సాయంతో కలిపి రూ.1,27, 823 కోట్లు ఖర్చు చేశామని తప్పుడు లెక్కలు చెబుతున్నారు.

వాస్తవంగా మూడున్నరేళ్లలో రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.18,605 కోట్లు మాత్రమే. రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని చెబుతున్నారు. ఉచిత విద్యుత్ సబ్సిడీ పథకాన్ని నాడు మొదటగా తీసుకొచ్చింది ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ రోజుకు 18 గంటలు ఉచిత కరెంటు ఇస్తే వైసీపీ ప్రభుత్వం 7 గంటలు మాత్రమే ఇస్తోంది. 18 గంటలు విద్యుత్ ఇచ్చి హార్స్ పవర్ కి ఏడాదికి రూ.50 మాత్రమే వసూల్ చేశారు. 5 గంటల హార్స్ పవర్ కి 250లు కడితే 18 గంటలు ఇచ్చారు. దీనికి వైసీపీ ప్రభుత్వం రూ.29,664 కోట్లు ఖర్చు చేశామని నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారు. 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఎక్కడ ఇచ్చారో చెప్పాలి.

ఇన్సూరెన్స్ సొమ్ములోనూ తప్పుడు లెక్కలే!
ఉచిత పంటల బీమాకి రూ. 6800 కోట్లు ఖర్చు చేశామని చెప్పుతున్నారు. ఒక రైతు ఖరీఫ్ సాగుకు 2శాతం బీమా సొమ్ము కడతాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 4.5శాతం కడతారు. మిగతా 90శాతం ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ప్రీమియం కడితే ఇన్యూరెన్స్ కంపెనీలు పరిహారం ఇస్తాయి. ఇన్యూరెన్స్ కంపెనీలను తీసేసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఇన్యూరెన్స్ స్కీమ్ కి వైసీపీ ప్రభుత్వం కట్టాల్సిన డబ్బు కేవలం రూ.30.98 కోట్లు మాత్రమే.
ప్రకృతి వైపరీత్యాల నష్టానికి రూ.1,612 కోట్లు వెచ్చించామని చూపించారు. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం కేంద్రమే చెల్లిస్తుంది. వాటిని కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేదు. నిబంధనల ప్రకారం ఎందుకు వెళ్లలేదు. రూ. 1,612 కోట్లు ఎందుకు చూపిస్తున్నారు? రాష్ట్రప్రభుత్వం వాటాగా కట్టాల్సింది వాస్తవానికి రూ.200 కోట్లే. కానీ వైసీపీ ప్రభుత్వం రూ.1,612 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? రూ.1,264 కోట్లు డ్రిప్ ఇరిగేషన్ లో చూపించారు. దాన్ని మూసేసి మూడేళ్ళ అయింది. చంద్రబాబు నాయుడు 2001లో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. మీరు మూడేళ్ళు ఎందుకు మూసేశారు? నేడు ఎందుకు గొప్పలు చెబుతున్నారు.

బడ్జెట్ లో చూపుతున్నవి తప్పుడు లెక్కలు!
2021లో రూ.1,264 కోట్లు బడ్జెట్ లో పెట్టి రెండేళ్ళలో ఖర్చు పెట్టింది శూన్యం. నేడు రూ.1,264 కోట్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలి? ఈ అంకెలు వాస్తవం కాదు. మేము 2017-18 ఒక్క సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ లో 1250 కోట్లు ఖర్చుచేసి దేశంలో మొదటి స్థానం సాధించాం. యంత్ర సేవ పథకం సబ్సిడీ కోసం రూ. 240 కోట్లు ఖర్చు చేశామని అంటున్నారు. ఫామ్ మెకనైజేషన్ అనే కాన్సెప్ట్ నే వైసీపీ ప్రభుత్వం చంపేసింది. తెలుగుదేశం ప్రభుత్వం 2017-18 ఒక్క సంవత్సరంలోనే 450 కోట్లు ఖర్చుచేసింది. రెండేళ్ళలో రైతు రథం కింద 23వేల ట్రాక్టర్లుఇచ్చాం. మీరు ఇప్పటివరకు 3,800 ట్రాక్టర్లు ఇస్తున్నట్టు భారీ ఊరిగింపు పెట్టుకుని చెప్పడం సబబేనా? వ్యవసాయ శాఖని అంతమొంచింది వైసీపీనే.
మెగాసీడ్ పార్కు ఎందుకు నిలిపివేశారు?

తంగడెంచిలో అయోవా యూనివర్సిటీ స్పాన్సర్ చేసిన మెగా సీడ్ పార్క్ కోసం రూ. 650 కోట్లు విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడతామని వస్తే దాన్ని నిలిపివేశారు., భూసార పరీక్షలు చేసి సూక్ష్మ పోషక పదార్ధాలు ఇవ్వడం ఆపేశారు. భూసార పరీక్షలు చేసి మట్టిలో జింక్, బోరాన్, జిప్సన్ లాంటి పోషకాల లోపం ఉంటే వాటిని తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చాం. రైతులు పి.ఎస్.సియస్ గోదాములో రూ.1,80,000 వరకు ధాన్యం నిల్వచేసుకునేందుకు ఆరు నెలలకు వరకు వడ్డీ లేకుండా ఉచిత గోదాము సౌకర్యం టిడిపి కల్పించింది. ఆరు నెలలకు మించి ధాన్యం అమ్ముకోకపోతే 6శాతం వడ్డీతో కొనసాగింపు అవకాశం కల్పించాం. దాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది.

పురుగుమందుల డబ్బు కూడా బకాయి పెడతారా?
ఆర్ బికెల ద్వారా నేషనల్ ఫుడ్ సేఫ్టీ మిషన్ కింద 16కోట్ల రూపాయల పురుగుమందులు ఇచ్చారు. పాత బకాయిలు చెల్లిస్తేనే మళ్ళీ సరఫరా చేస్తామని పెస్టిసైడ్స్ కంపెనీలు చెప్పాయి. పెస్టిసైడ్స్ కు రెండేళ్ళ నుంచి ఆ 16కోట్లు చెల్లించలేదని పత్రికలలో ప్రచురితమయ్యే పరిస్ధితి వచ్చింది. నేడు విత్తనాలుకూడా సరఫరా చేయలేని పరిస్థితికి వచ్చారు. నేషనల్ ట్రాక్టర్ కంపెనీ అసోసిషేయన్ ఏపీకి సరఫరా చేయకూడదని నిర్ణయించింది. డబ్బు కడితేనే సరఫరా చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కొంతమందికి కోర్టులకు వెళ్లి డబ్బులు తెచ్చుకొనే పరిస్ధితి. మహిళలకు చేయూత, రైతన్నలకు ఖర్చు చేసినట్లు మీరు చూపిస్తున్న డబ్బంతా ఎక్కడ నుంచి వచ్చింది? ప్రభుత్వం డబ్బుని వృధా చేసి ఎందుకు తప్పుడు ప్రకటనలు ప్రచురిస్తున్నారు. జగన్ రెడ్డి రైతులకి క్షమాపణ చెప్పాలి. రైతులు పండించిన ధాన్యాన్ని వాస్తవానికి మధ్యవర్తులు కొనుగోలు చేశారు. ఎంఎస్ పి రేటు కంటే క్వింటాలుకు రూ.213లు తక్కువ రేటు దక్కిందని సిఎసిపి నివేదిక ఇచ్చింది. ఇదే విషయాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వాస్తవానికి క్వింటాలకి రూ.400 లు రైతులు నష్టపోయారు. మేం ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు వారంరోజుల్లో ఇస్తే… మీరు ఆరునెలలకు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ మూడవ రోజే డబ్బుని చెల్లిస్తుంది.

ఆత్మహత్యల్లో అగ్రస్థానానికి ఎందుకు చేరింది?
రైతుల సగటు అప్పు జాతీయ స్థాయిలో రూ. 74,121 ఉంటే నేడు ఏపి రైతు తలసరి అప్పు 2లక్షల 45వేల రూపాయలు ఉంది. మీరు పెట్టామన్న ధరల స్థిరీకరణ 3వేలకోట్లు, ప్రకృతి వైపరీత్యాలకు 4వేల కోట్లు ఎక్కడ పెట్టారో చెప్పాలి. మీరు చెప్పేవన్నీ నిజమైతే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యలలో మూడవ స్ధానంలో ఎందుకు ఉంది? కౌలు రైతుల ఆత్మహత్యలలో రెండవ స్ధానానికి ఎందుకు చేరింది? మీరు రైతులకు ఏ పథకం కింద ఎంత ఖర్చు పెట్టారనేది శ్వేతం పత్రం విడుదల చేయాలి. ముఖ్యమంత్రి అవాస్తవాలను చెప్పింనందుకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలి. రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా తెలుగుదేశం సభ్యుల గొంతునొక్కుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

LEAVE A RESPONSE