– రాజ్యసభలో హోం మంత్రిని ప్రశ్నించిన విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 2 : తరచుగా తుపాన్ల బారిన పడుతున్న కోస్తా రాష్ట్రాలకు సాయపడే విధంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే ఆలోచన ఏదైనా ఉందా…తుపాన్ల వలన సంభవించే విపత్తును ఎదుర్కొనే ప్రణాళికలను కాలానుగుణంగా సవరిస్తున్నారా… విపత్తు సహాయక ప్రణాళికలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, సహాయం పంపిణీలో, సకాలంలో బాధితులకు వైద్య సాయం అందించడంలో, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం చేసుకుంటూ పనులను సమర్ధంగా నిర్వహించే విధంగా రూపొందుతున్నాయా అంటూ బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
దీనికి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మౌఖికంగా జవాబిస్తూ ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు 2021-26 కాలంలో వినియోగించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు 1,60,153 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. గత కేటాయిపులతో పోల్చుకుంటే ఇది రెండున్నర రెట్లు అధికం.
ఇది కాకుండా మరో 68 వేల కోట్ల రూపాయలల తక్షణ సహాయ నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. కోస్తా రాష్ట్రాలలో తుపాన్లు సంభవించినపుడు ఎన్‌డిఆర్‌ఎఫ్ భారత వాతావరణ విభాగం (ఐఎండి), కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి)తోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ విపత్తు సహాయ చర్యలను చేపడుతుందని చెప్పారు.
అలాగే కోస్తా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలకు చెందిన ఎస్‌డిఆర్‌ఎఫ్‌ల ద్వారా సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవచ్చని చెప్పారు.