Suryaa.co.in

Telangana

ప్రజలకు సేవకుడిగా పని చేస్తా…

-అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తా
-విద్యుత్ ఉత్పత్తి పెంచి వెలుగులు పంచుతా
-తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజా పాలన లక్ష్యం
-ప్రశ్నించే వాడిగా… పాలించే వాడిగా
-ఏ పదవి చేపట్టిన వన్నె తెచ్చాను
-మధిర అంటే నాకు ప్రాణం
-మధిర అభివృద్ధికి నిరంతరం పని చేస్తా
-మధిర ప్రజలు తలెత్తుకునేలా పాలన చేస్తా

ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్ర వీగకుండా వెన్నులో భయం పెట్టుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు సేవకుడిగా పని చేసి అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మధిర నియోజకవర్గ కేంద్రంలోని రెడ్డి గార్డెన్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన సతీమణి నందిని విక్రమార్కతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పక్షాల పార్టీల నాయకులు శాలువాలు కప్పి, పూల దండలు వేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘమైన ప్రసంగం చేశారు.

రాష్ట్ర ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, మధిర ప్రజలు తలెత్తుకునే విధంగా పరిపాలన చేస్తానని హామీ ఇచ్చారు. 10 ఏండ్లు పరిపాలన చేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అధోగతి పాలు చేసిందన్నారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పని చేస్తానని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల 1.10 లక్షల కోట్ల రూపాయల రుణాలతో ఉన్న విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడంతో పాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావలసిన మార్గాలు అన్వేషణ చేస్తున్నట్లు చెప్పారు.

సింగరేణి బొగ్గు గనుల సంస్థను బతికించుకొని వేలాది ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండవ తారీఖున జీతాలు ఇచ్చిన ప్రభుత్వం తమదన్నారు. రాష్ట్ర అప్పుల పాలైనప్పటికీ తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులు, ఇతను వనరులను రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లి సంపద సృష్టించి సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే ఆరు గ్యారంటీల హామీల అమలు లక్ష్యమని వివరించారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నిష్ణాతులతో మాట్లాడడానికి తనకు ఎలాంటి భేషజాలాలు లేవని, రాజ్యాంగం, ఫెడరలిజం స్ఫూర్తితో రాష్ట్రానికి రావలసిన ఆదాయ వనరులను కేంద్రం నుంచి రాబట్టుకోవడానికి ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్ర విభజన చట్టాల హామీలు అమలు కోసం కేంద్రానికి విన్న విస్తామని ఇందులో ఎలాంటి
భేషజాలాలకు పోమన్నారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలు తప్పా.., ఇప్పుడు పాలన, అభివృద్ధి తమకు ముఖ్యమన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం అందరి సమిష్టి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ నా కోసమే ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు అనుకోవాలని, ఆ దిశగా తమ పరిపాలన సాగుతుందని వివరించారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా నిండని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారని బి ఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేయడం అవివేకమన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేని నాటీ అసమర్ధ బిఆర్ఎస్ నాయకుల మాటలు వింటుంటే నవ్వాలా? ఏడ్వాలా? అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా మా పార్టీ కండువాలు వేసుకుంటేనే మా పార్టీ జెండాలు పట్టుకుంటేనే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పమని, ఆరు గ్యారెంటీలను రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇవ్వడమే ఇందిరమ్మ ప్రజాపాలన లక్ష్యం అని వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీలను లబ్ధి పొందే విధంగా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని దిశా నిర్దేశం చేశారు.

మధిర అంటే నాకు ప్రాణం

రాజకీయంగా జన్మనిచ్చినటువంటి మధిర నియోజకవర్గం అంటే నాకు ప్రాణమని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించి పని చేస్తానని భట్టి విక్రమార్క చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట చేసిన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది అంటే మధిర ప్రజలు ఇచ్చిన శక్తి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడింది అన్నారు. బిఆర్ఎస్ పాలనలో ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా, వేదింపులకు, బెదిరింపులకు భయపడకుండా పది సంవత్సరాలు కడుపులో పెట్టుకొని చూసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు.

మధిర అభివృద్ధి కోసం ఓట్లు వేసి ఆశీర్వదించిన పెద్దలకు, మొట్ట మొదటిసారి ఓటు వచ్చి అభివృద్ధికే పట్టం కట్టిన యువతీ యువకులు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కావలసిన ప్రణాళికలు తయారుచేసి నియోజకవర్గం లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. భూమి లేకుండా రెక్కల కష్టం మీద ఆధారపడి బతుకుతున్న పేదల బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవడానికి పునాదులు వేస్తానని వివరించారు. నియోజకవర్గంలో చదువుకున్న బిడ్డలకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలికినట్లు వివరించారు.

ఇప్పటికే నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని పారిశ్రామిక వాడలుగా మార్చుతున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు పరిశ్రమలు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తానని ఇతర ప్రాంతాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మధిర నియోజకవర్గాన్ని హెల్త్ హబ్బుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

ప్రతి మండలంలో ఇంగ్లీష్ మీడియం లో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను నిజం చేయడంతో పాటు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కంకణ బద్ధులమై పనిచేస్తామని హామీ ఇచ్చారు

LEAVE A RESPONSE