Suryaa.co.in

Editorial

క్రైస్తవ ఓట్లపై బ్రదర్ అనిల్ కన్ను

– క్రైస్తవ-దళిత క్రైస్తవుల్లో అనిల్‌కు క్రేజ్
– ఆ ఇమేజ్‌తోనే గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించిన వైనం
– ఆ ఎన్నికల్లో చాపకింద నీరులా పనిచేసిన అనిల్
– బావను గెలిపించిన బావమరిది బ్రదర్ అనిల్
– నాడు లోటస్‌పాండ్ వేదికగా క్రైస్తవ పెద్దలతో భేటీలు
– ఇప్పుడు భార్య షర్మిల కోసం మళ్లీ అదే వ్యూహం అమలు
– మామ, బావమరిది, భార్య కోసం బ్రదర్ అనిల్ శ్రమదానం
– త్వరలో విస్తృతంగా క్రైస్తవ కూటములు
– తొలుత పాస్టర్లు, ఫాదర్లతో భేటీలు
– ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో స్వస్థత సభలు
– 31 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
– ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో సభలు
– క్రైస్తవ ఆస్తుల కబ్జాలపై గళం విప్పనున్న బ్రదర్ అనిల్
– ఇక ఏపీలో బావ జగన్ వర్సెస్ బామ్మర్ది బ్రదర్ అనిల్
– యుద్ధానికి సిద్ధమవుతున్న అనిల్
– జగన్ ఓటమే అనిల్ అభి‘మతం’
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ వేదికగా ఇక బావ-బావమరిది ప్రత్యక్ష రాజకీయ యుద్ధానికి తెరలేవనుంది. గత ఎన్నికల్లో బావమరిది గెలుపు కోసం తన ఇమేజ్‌ను పణంగా పెట్టి, గద్దెనెక్కించిన బావ.. ఇప్పుడు అదే బావమరిదిని గద్దెదించేందుకు, తన ఇమేజ్‌ని రెండోసారి పణంగా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గద్దెనెక్కిన తర్వాత కుటుంబాన్ని పక్కనపెట్టిన బావమరిదిపై.. తన భార్యను బాణంగా సంధించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బావకి అదే ఏకైక అభి‘మతం’! ఇంతకూ ఆ బావమరిది ఎవరంటే.. ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్. ఇక బావ ఎవరో ఈపాటికి అర్దమయ్యే ఉండాలి. క్రైస్తవ సమాజంలో తిరుగులేని ఇమేజ్ ఉన్న బ్రదర్ అనిల్!

ఏపీసీసీ చీఫ్‌గా కొత్త పాత్రతో తెరపైకి రానున్న షర్మిలకు, తెరవెనుక ఆమె భర్త బ్రదర్ అనిల్ అండగా నిలవనున్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు జీవం పోసేందుకు రానున్న షర్మిల రంగ ప్రవేశంతో.. వైసీపీ కూసాలు కదిలించాలన్న కాంగ్రెస్ ఆశయానికి, అనిల్ ఆయుధంగా మారనున్నారు. అంటే ‘అనిల్ సంధించిన బాణం’లా షర్మిల దూసుకురానున్నారన్నమాట!

గత ఎన్నికల ముందు క్రైస్తవులు-దళిత క్రైస్తవులు-ఎస్టీలో మతం మారిన వారిని ఏకతాటిపైకి తెచ్చి, చంద్రబాబు సర్కారును కూల్చేందుకు ప్రధాన ఆయుధంగా పనిచేసిన సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్, ఇప్పుడు మళ్లీ అదే పాత్రను… జగన్‌కు వ్యతిరేకంగా పోషించేందుకు సిద్ధం కావడం, క్రైస్తవ సమాజంలో ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ముందు బావమరిది జగన్ కోసం.. హైదరాబాద్ లోటస్‌పాండ్ వేదికగా, క్రైస్తవ మత పెద్దలతో అనిల్ సమావేశాలు నిర్వహించిన విషయం బహిరంగ రహస్యమే. ఆ భేటీలకు ఏపీకి చెందిన చర్చి పాస్టర్లు, ఫాదర్లు, రెవంరెండ్లను పిలిపించి.. జగన్ గెలుపు అవసరాన్ని వివరించారు.

వైఎస్ భార్య విజయమ్మ, బంధువు విమలమ్మ, బ్రదర్ అనిల్ ముగ్గురూ ఆ భేటీలకు హాజరయ్యారు. జగన్ విజయం సాధించిన తర్వాత క్రైస్తవులు ఆయన వద్దకు వెళ్లే అవసరం లేదని, తామే మీకు అందుబాటులో ఉండి, సమస్యలు పరిష్కరిస్తామని అప్పట్లో వారంతా హామీలిచ్చారు. ప్రధానంగా విమలమ్మ-విజయమ్మలు వారికి భరోసా ఇచ్చిన వార్తలు, అప్పట్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ భేటీలకు జగ్గయ్యపేటకు చెందిన, అనిల్ ప్రధాన అనుచరుడు కొండలరావు సమన్వయకర్తగా వ్యహరించారు.

దానితోవారి ఉపన్యాసాలకు ప్రభావితమైన చర్చి ఫాదర్లు-పాస్టర్లు, తమ పరిథిలోని క్రైస్తవ-దళిత క్రైస్తవులతోపాటు.. తరచూ చర్చికి వచ్చే ఇతర కులాల వారికి హితబోధ చేసి, జగన్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. జగన్ పాదయాత్రకు జనసమీకరణ లో కీలకపాత్ర పోషించారు. అంటే జగన్ విజయంలో పాస్టర్లు-ఫాస్టర్లు కూడా సమిధలయ్యారని క్రైస్త నేతలు గుర్తు చేస్తున్నారు.

అయితే జగన్ గెలిచిన తర్వాత క్రైస్తవ పెద్దలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడం, లోటస్‌పాండ్‌లో తమకు హామీలిచ్చిన పెద్దలు కూడా స్పందించకపోవడంతో, కొంత అసంతృప్తికి లోనయ్యారు. తర్వాత జగన్ కుటుంబ పరిస్థితులను చూసి, అనిల్ కుటుంబానికి వారంతా సానుభూతిపరులయ్యారు. క్రైస్తవులను కూడగట్టి, ఏకతాటిపైకి తీసుకువచ్చిన బ్రదర్ అనిల్‌ను కూడా జగన్ పక్కనపెట్టడం వైసీపీకి ఓట్లు వేసిన క్రైస్తవులకూ రుచించలేదన్నది క్రైస్తవ సమాజంలో తరచూ వినిపించే మాట.

కాగా తాజాగా అనిల్.. పీసీసీ చీఫ్‌గా రానున్న తన భార్య షర్మిల కోసం, మళ్లీ అదే వ్యూహాన్ని అమలుచేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆయన హైదరాబాద్ వేదికగానే ఏపీకి చెందిన పాస్టర్లు-ఫాదర్లతో భేటీకి రంగం సిద్ధం చేస్తున్నారు. తాను గత ఎన్నికల ముందు ఏ పరిస్థితిలో తెరపైకి రావలసి వచ్చింది? గెలిచిన తర్వాత జగన్, తమను ఏవిధంగా పక్కనపెట్టిన వైనాన్ని వారికి వివరించనున్నారు. మన ఓట్లతో గెలిచిన జగన్‌ను, మళ్లీ ఓట్లతోనే గద్దె దింపాల్సిన అవసరం ఉందని.. తన భావోద్వేగమైన ఉపన్యాసం ద్వారా వారికి వివరించేందుకు సిద్ధమవుతున్నారు.

తర్వాత గత నాలుగున్నరేళ్లలో చర్చి ఆస్తులను, జగన్ సన్నిహితులు ఏవిధంగా ఆక్రమించుకున్నదీ వెల్లడించడం ద్వారా.. బావపై తొలి బహిరంగ యుద్ధానికి సిద్ధం కానున్నారు. ఆమేరకు ఆయన ఈపాటికే వాటి వివరాలను తీసుకున్నారు. జగన్ చివరకు చర్చి ఆస్తులను-మిషనరీ స్కూళ్లను కూడా వదలటం లేదని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పట్లో విమర్శించిన విషయం తెలిసిందే. తాము అధికారంలో ఉండగా, క్రిస్మస్ పండుగకు కానుకలు ఇస్తే.. క్రైస్తవుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్, వాటిని వారికి దూరం చేశారన్న టీడీపీ దళిత-క్రైస్తవ నేతల ఆరోపణలను కూడా, అనిల్ ఉటంకించనున్నారు.

కాగా ఎన్నికల సమయం అతి తక్కువగా ఉన్నందున.. ఏపీలోని 31 ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాలపై, కాంగ్రెస్ ప్రధాన దృష్టి సారించనుంది. ఆమేరకు కనీసం 5 సీట్లే గెలుపు లక్ష్యంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. అన్ని నియోజకవర్గాలపై దృష్టి సారించడం వల్ల సమయం వృధా అని, అదే ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకులైన.. ఆ 31 నియోజకవర్గాలపై దృష్టి సారించడం ద్వారా, సానుకూల ఫలితాలు సాధించవచ్చన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.

షర్మిల కూడా ఆయా నియోజకవర్గాల్లో విస్తృత స్థాయిలో పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లో భార్య షర్మిల పర్యటనలు విజయవంతం చేయడంతోపాటు.. తాను కూడా అక్కడ క్రైస్తవ సువార్త కూటములు నిర్వహించేందుకు బ్రదర్ అనిల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో జగన్ పాదయాత్రలకు చర్చి పాదర్లు-పాస్టర్లు ఏవిధంగా సహకరించారో.. రేపు షర్మిల పర్యటనలు-సభల విజయవంతానికి కూడా, వారి సేవలనే వినియోగించుకునేలా అనిల్ ప్రణాళిక రూపొందించారంటున్నారు. జగన్ పాదయాత్రల ఏర్పాట్లు, జనసమీకరణ అంతా పాస్టర్లు-ఫాదర్ల ద్వారా అనిల్ ఏర్పాటుచేయించారన్న కథనాలు అప్పట్లోనే వెలువడ్డాయి. ఇప్పుడు షర్మిల సభలు, కాంగ్రెస్ ప్రచారానికి సైతం అనిల్ అదే వ్యూహం అమలుచేయనున్నారట.

నిజానికి ఏపీలో క్రైస్తవులు-దళిత క్రైస్తవులతోపాటు.. వివిధ కులాల నుంచి బాప్టిజం తీసుకున్న వారి సంఖ్య, సుమారు 30 శాతం వరకూ ఉండవచ్చన్నది ఒక అంచనా. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఏపీలో మతం మారని దళిత క్త్రైస్తవులు తక్కువ. హిందూ మాల-హిందూ మాదిగల సంఖ్య అత్యల్పం. ఎస్టీల్లో కూడా ఎక్కువ శాతం బాప్టిజం తీసుకున్న వారే ఉన్నారు. ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కాపులు కూడా చాలామంది బాప్టిజం తీసుకున్నారు.

కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కమ్మ-కాపులు, రాయలసీమలో రెడ్లు పెద్ద సంఖ్యలోనే బాప్టిజం తీసుకున్నారు. వీరు ఒకవైపు హిందూ సంప్రదాయాలు పాటిస్తూనే బాప్టిజంలో కొనసాగుతున్నారు. అంటే ఈ తరహా వ్యక్తులంతా చర్చిలకూ వెళుతుంటారన్నమాట. నర్సరావుపేటలోని రావిపాడు అనే గ్రామంలో సింహభాగం కమ్మ సామాజికవర్గం బాప్టిజం తీసుకున్నారు. ఈ గ్రామం నుంచి ఇటలీకి ఎక్కువమంది వెళుతుంటారు.

ఆరకంగా ఇటలీలో స్థిరపడ్డ వారు నివసించే ప్రాంతానికి, రావిపాటు స్ట్రీట్ పేరు ఉండటం విశేషం. ఆ గ్రామం నుంచి చాలామంది యువకులు పాస్టర్ల శిక్షణకు ఇటలీ వెళ్లడం మరో విశేషం. ఇక గుంటూరు సమీపంలోని ఫిరంగిపురం గ్రామంలో.. అన్ని కులాలకు చెందిన సుమారు 90 శాతం మంది, బాప్టిజం తీసుకోవడం ఇంకో పెద్ద విశేషం. ఇక్కడ ప్రతి ఏటా మేరీమాత ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి.

వీరందరికీ బ్రదర్ అనిల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ఉపన్యాసాల ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్రదర్ అనిల్ నిర్వహించే క్రైస్తవ స్వస్థత కూటములకు, మిగిలిన ఉపన్యాసకులంటే ఎక్కువమంది హాజరవుతుంటారు. ఆయన సభలు దైవజనులతో కిటకిటలాడుతుంటాయన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

దీన్నిబట్టి అనిల్‌కు, క్రైస్తవ సమాజంలో ఎంత క్రేజ్-ఇమేజ్ ఉందో స్పష్టమవుతుంది. అదే ఇప్పుడు చావుదెబ్బ తిన్నకాంగ్రెస్‌కు జీవం పోయనుంది. నిజానికి బ్రదర్ అనిల్ ఆ ఇమేజ్-క్రేజ్‌ను తమ మామ దివంగత వైఎస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఒకసారి.. తన బావమరిది జగన్ కోసం ఇంకోసారి వినియోగించారు. ఇప్పుడు తన భార్య షర్మిల కోసం మరోసారి వినియోగించనున్నారు.

అంటే ఇప్పుడు బ్రదర్ అనిల్ లక్ష్యానికి, మళ్లీ అవే స్వస్థత కూటమలు వేదికలు కానున్నాయి. ఉభయ గోదావరి, విశాఖ, ప్రకాశం-నెల్లూరు జిల్లాల్లో అనిల్ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా కడప-కర్నూలులో ఒక్కో సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ జిల్లాల్లోనే ఎస్టీ, ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉండటం ప్రస్తావనార్హం. దీన్నిబట్టి బ్రదర్ అనిల్, తన వ్యూహాన్ని ఎంత పకడ్బందీగా అమలుచేస్తున్నారో స్పష్టమవుతుంది.

నిజానికి పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాట్లు చేసినా.. అగ్రనేతలు వరసగా వెళ్లిపోతున్నా.. వైసీపీ గెలిచితీరుతుందని జగన్ ధీమాతో ఉన్నారు. ఎస్సీ-ఎస్టీ-దళిత క్రైస్తవులు తన వెంట ఉన్నారన్న ధీమానే, దానికి కారణంగా కనిపిస్తోంది. ఇటీవల నెల్లూరుకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధితో.. ‘మనకు కమ్మ-కాపు-బ్రాహ్మణ-వైశ్య వర్గాలు ఓట్లు వేయకపోయినా, 80 శాతం మంది ఎస్సీ-ఎస్టీ-క్రైస్తవుల ఓటు బ్యాంకు ఉంది. బీసీలు కూడా మనతోనే ఉన్నారు. మన పార్టీకి 58 శాతం ఓట్లు ఉన్నాయి. ఇదిగో సర్వే రిపోర్టు. కాబట్టి మళ్లీ మనమే గెలుస్తున్నాం. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది’ అని అత్యంత ఆత్మవిశ్వాసంతో చె ప్పారట. తన వాదనకు మద్దతుగా టేబుల్‌పై ఉన్న సర్వే రిపోర్టును కూడా చూపించారట.

తెలంగాణలో షర్మిల పాదయాత్రకు ఆర్ధిక సాయం చేస్తానని ఆ కీలక ప్రజాప్రతినిధి విజయమ్మకు హామీ ఇచ్చారట. ఆ విషయం తెలిసిన జగన్ సదరు ప్రజాప్రతినిధిని పిలిచి, షర్మిల పాదయాత్రకు ఆర్ధిక సాయం చేయవద్దని హెచ్చరించిన వైనం మీడియాలో గుప్పుమంది. అది వేరే విషయం! అంటే పార్టీ నుంచి ఎంతమంది వెళ్లిపోయినా.. ఎస్సీ-ఎస్టీ-క్రైస్తవులు మాత్రం తనతోనే ఉంటారన్నది జగన్ ధైర్యానికి కారణంగా కనిపిస్తోంది.

ఇప్పుడు రాష్ట్రంలోని అదే క్రైస్తవులు-దళిత క్రైస్తవుల ఓట్లను, కాంగ్రెస్‌కు గంపగుత్తగా మళ్లించడం ద్వారా జగన్ పార్టీని చావుదెబ్బ తీయాలన్నది, బ్రదర్ అనిల్ లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ కొల్లగొట్టిన ఆ వర్గాల ఓటు బ్యాంకును.. తిరిగి కాంగ్రెస్ పార్టీకి మళ్లించాలన్నదే అనిల్ లక్ష్యమంటున్నారు. ఆ ప్రకారంగా, తన భార్య షర్మిల నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీని.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టించాలన్న బ్రదర్ పట్టుదల..అదే సమయంలో బావమరిది జగన్‌ను గద్దెదింపాలన్న, బావ అనిల్ కసి ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

1 COMMENTS

LEAVE A RESPONSE