Suryaa.co.in

Editorial

ఇంతకూ షర్మిల ఆంధ్రానా? తెలంగాణ నా?

-తెలంగాణ కోడలినని ప్రచారం చేసుకున్న షర్మిల
– తెలంగాణలోనే ప్రచారం చేస్తానని స్పష్టీకరణ
– పాలేరు, సికింద్రాబాద్‌ సీటు అడిగిన షర్మిల
– ఆమెను ప్రచారంలో తీసుకురావద్దన్న రేవంత్‌
– వస్తే కేసీఆర్‌ కాంగ్రెస్‌పై ఆంధ్రా కార్డు వాడతారని నాయకత్వానికి హెచ్చరిక
– ఆంధ్రాలో ఆమె సేవలను వాడుకోమని సలహా
– ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
– ఏపీసీసీ చీఫ్‌ ఇస్తారన్న ఊహాగానాలు
– ఆమె కూడా అదే కోరిందంటున్న పార్టీ వర్గాలు
– అయితే ఆమె రాకపై అప్పుడే సీనియర్ల వ్యతిరేకత
– తెలంగాణ షర్మిలకు ఆంధ్రాలో ఏం పనంటున్న హర్షకుమార్‌
– తెలంగాణ కోడలికి ఆంధ్రా అధ్యక్ష పదవి వద్దని సూచన
– షర్మిలకు ఏపీలో మరో రేవంత్‌
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘నాపేరు షర్మిల. నేను జగనన్న విడిచిన బాణాన్ని. మీ రాజన్న బిడ’’్డను అంటూ.. దీర్ఘాలు తీసి తానెవరో పరిచయం చేసుకున్న షర్మిల, ఇప్పుడు ప్రాంతీయ చిక్కుల్లో పడింది. అన్న విడిచిన బాణం.. తిరిగి అన్నకే తగిలేలోపు ఎదురైన చిక్కుముడి, ఆమెను సంకటంలో పడేసింది. తెలంగాణలో నిర్వహించిన పాదయాత్రలో, తాను తెలంగాణ కోడలిని అని సగర్వంగా ప్రకటించుకున్న షర్మిల.. ఇప్పుడు ‘ఆంధ్రా ఆడబిడ్డ’ ముద్రతో కాంగ్రెస్‌లోకి ఎంట్రీ కావడం వివాదంగా మారుతోంది.

షర్మిల కాంగ్రెస్‌లో చేరిన ముహుర్తం బాగాలేనట్లుంది. తెలంగాణను పూర్తిగా విడిచిపెట్టి, ఏపీలో రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్న షర్మిలకు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత-మాజీ ఎంపి హర్షకుమార్‌ బ్రేకులు వేశారు. తెలంగాణ కోడలయిన షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలు ఇవ్వడం మంచిదికాదు. ఆమె తెలంగాణకు చెందిన వారు. కాబట్టి ఆమెకు ఇక్కడ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం కరెక్టుకాదు. అయినా ఇక్కడ దళితులు జగన్‌ను గద్దెదింపేందుకు సిద్ధంగా ఉన్నార’ని హర్షకుమార్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ఇది కూడా చదవండి: క్రైస్తవ ఓట్లపై బ్రదర్‌ అనిల్‌ కన్ను

కాంగ్రెస్‌ తీర్థం తీసుకున్న షర్మిలకు, పార్టీ ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆమె కోరిక మేరకు, పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని కొందరు., ఏఐసిసిలో కీలక బాధ్యత అప్పగిస్తారని మరికొందరు చెబుతున్నారు. ఈలోగా మాణిక్యం ఠాకూర్‌ను ఏపీ ఇన్చార్జిగా ప్రకటించారు.

ఈలోగా మాజీ ఎంపి హర్షకుమార్‌ చేసిన వ్యాఖ్యలతో, షర్మిల ఏ ప్రాంతానికి చెందిన వారన్న ప్రశ్నలు తెరపైకొచ్చాయి. నిజానికి షర్మిలకు ఏపీలో ఇలాంటి సంకట పరిస్థితి వస్తుందని, ఆమెతో సహా ఎవరూ ఊహించి ఉండరు. దీనితో తాను ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిననే విషయాన్ని, షర్మిల మరోసారి చెప్పుకోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

నిజానికి వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ముందు.. షర్మిల తనకు పాలే రు, సికింద్రాబాద్‌ సీటు అడిగారు. అయితే షర్మిల తెలంగాణలో తిరిగితే.. కేసీఆర్‌ కాంగ్రెస్‌పై ఆంధ్రాపార్టీముద్ర వేస్తారని రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని హెచ్చరించారు. ఆమె సేవలను ఏపీలో వాడుకుంటేనే పార్టీకి ప్రయోజనమని సూచించారు. దానితో సందిగ్ధంలో పడిన నాయకత్వం… షర్మిల చేరికకు బ్రేకులు వేసింది. దానితో రెంటికీ చెడ్డ షర్మిల.. జరగబోయే ప్రమాదం గుర్తించి, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇటలీకి చెందిన సోనియాగాంధీకే, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు లేని అభ్యంతరం.. ఉమ్మడి రాష్ట్రంలోనే పుట్టిన షర్మిల విషయంలో ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే షర్మిల భవిష్యత్తును నాన్చకుండా, నాయకత్వం ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకుంటే మంచిదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

‘ మాణిక్యం ఠాకూర్‌ మా ఇన్చార్జిగా చార్జి తీసుకున్నారు. ఎన్నికల్లో మా పార్టీ లక్ష్యమేమిటన్నదానిపై స్పష్టతతో ఉన్నాం. మేం ఇప్పటికే ప్రజల్లో ఉన్నాం. కాంగ్రెస్‌ వ్యూహమేమిటో ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఆ ప్రకారంగా మా కార్యాచరణ అమలుచేస్తాం. మాకు సమర్థులైన ఎంపీ అభ్యర్ధులున్నారు. షర్మిలకు ఏ బాధ్యతలు ఇవ్వాలన్నది ఖర్గే నిర్ణయిస్తారు. షర్మిలకు ఏ బాధ్యత ఇచ్చినా సీనియర్‌గా నేను సహకరిస్తా. ఎంతోమంది పదవులు అనుభవించి వెళ్లిపోయినా మేం మాత్రం ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నామంటే. పార్టీపై మా చిత్తశుద్ధి ఏమిటో ఊహించుకోండి. మాకు వ్యక్తులు కాదు. పార్టీ ముఖ్యం. అంతా కలసి పనిచేసి, కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకువస్తాం’ అని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE