Suryaa.co.in

Editorial

పాలకుల మాట వింటే పరువుపోతుంది బాసూ..

– మార్గదర్శి  కేసులో సీఐడీకి అవమానం
– శైలజకు సారీ చెప్పారా అని ప్రశ్నించిన హైకోర్టు
– సీఐడీ ‘మార్గదర్శి’కి సారీ చెబుతుందా?
– లుక్‌అవుట్ నోటీసుపై ఇరుక్కున్న సీఐడీ
– సారీ చెప్పాలన్న హైకోర్టు ఆదేశాలు పాటిస్తుందా?
– పోలీసు-మీడియా అత్యుత్సాంపై ఇప్పటికే లోకేష్ నజర్
– వైసీపీ సర్కారుకు భజన చేసే వారిపై ఇప్పటికే నివేదికలు
– వైసీపీ అనుకూల మీడియాకు ప్రకటనలపై లోకేష్ దృష్టి
( మార్తి సుబ్రహ్మణ్యం)

దర్యాప్తు సంస్థల చేతులు కట్టేస్తే న్యాయస్థానాల్లో ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాలో ఏపీ సీఐడీకి అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. ఈనాడు అధినేత రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శిపై అత్యుత్సాహం ప్రదర్శించిన ఏపీ సీఐడీ .. ఇప్పుడు అదే సంస్ధకు క్షమాపణ చెప్పి, తన తొందరపాటుకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి.

మార్గదర్శి ఎండీ శైలజ ఈనాడు అధినేత రామోజీరావు కోడలు. ఆమెపై లుక్ అవుట్ నోటీసు జారీ చేయాలంటూ ఏపీ సీఐడీ కేంద్రానికి లేఖ రాసింది. అయితే అప్పటికే ఆమెపై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు, సీఐడీని ఆదేశించింది. అయినా సరే పాలకుల ఒత్తిళ్ల మేరకు, ఆమెకు లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దానిపై ఆమె కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేశారు.

ఫలితంగా ఏపీ సీఐడీ డీఎస్పీ, హైకోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితి. కేంద్రానికి తాము రాసిన లేఖ ఉపసంహరించుకున్నామని సదరు డీఎస్పీ హైకోర్టుకు చెప్పిన వైనం. అసలు మీరు కేంద్రానికి లుక్ అవుట్ నోటీసు ఎందుకు జారీ చేశారు? అలా జారీ చేసినందుకు ఆమెకు మీరు క్షమాపణ కోరారా? అని హైకోర్టు న్యాయమూర్తి సదరు డీఎస్పీని ప్రశ్నించారు.

అయితే తాము ఆమేరకు లేఖలు రాసినా శైలజ స్పందించలేదని, అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సదరు డీఎస్పీ.. అలాగే అడ్డంగా దొరికిపోయారు. సీఐడీ పంపిన ప్రతి మెయిల్‌కూ తాము స్పందించామంటూ శైలజ తరఫు న్యాయవాదులు, హైకోర్టు జడ్జికి దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. దానితో సీఐడీ డీఎస్పీ చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టమయింది. కష్టాల్లో కూరుకుపోతే ఎవరూ సాయం చేయరన్న విషయం సీఐడీ అధికారులకు ఈ కేసుతో స్పష్టమయి ఉండాలి.

ఇప్పుడు సీఐడీకి ఒకటే దారి. శైలజకు క్షమాపణ చెప్పడమా? కోర్టును పక్కదారి పట్టించినందుకు క్షమాపణ చెప్పడమా? ఇప్పుడు అదే సీఐడీ ముందున్న ప్రశ్న. పాలకుల అధికారం ఐదేళ్లే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అలా కాదు. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. పోతుంటాయి. కానీ అధికారులు శాశ్వతం. ఆ స్పృహ లేని అధికారులు ..పాలక పార్టీలిచ్చే పోస్టింగులకు ఆశపడితే, ఫలితాలు ఇంతకు భిన్నంగా ఏమీ ఉండవు.

గతంలో కూడా సీఐడీ అధికారుల అత్యుత్సాహంపై, కోర్టులు లెక్కలేనన్ని సార్లు అక్షింతలు వేశాయి. దారుణ మైన వ్యాఖ్యలు చేశాయి. అయినా తీరు మార్చుకోకుండా, పాలకుల పల్లకీ మోసే నిర్ణయాలు, సీఐడీ పరువు తీస్తున్నాయన్నది బుద్ధిజీవుల ఆవేదన. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులను, అధికార మార్పిడి తర్వాత ఎవరూ రక్షించరని స్పష్టం చేస్తున్నారు. రేపు అధికార మార్పిడి జరిగినప్పుడు, సదరు సీఐడీ అధికారుల పరిస్థితి ఏమిటన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని, సీనియర్ ఏపిఎస్ అధికారులు.. డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పరిస్థితిని గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిఘా దళపతిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును, వైసీపీ సర్కారు వేధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆయనకు ఇప్పటివరకూ పోస్టింగ్ ఇవ్వని వైనాన్ని పలువురు సీనియర్ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆయన వద్ద పనిచేసిన అధికారులు సైతం, ఇప్పుడు ఏబీతో మాట్లాడేందుకు భయపడుతున్న వైనాన్ని ఉదహరిస్తున్నారు. చివరకు ఏబీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు సైతం రాలేని ఆయన సహచరులు, జూనియర్ల ఇబ్బందిని గుర్తు చేస్తున్నారు. ఒక డీజీపీ స్థాయి అధికారే అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే.. ఇక ఎస్పీ, డీఎస్పీ, సీఐ స్థాయి అధికారుల పరిస్థితి ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదంటున్నారు.

పైగా ఈసారి పరిస్థితి గతంలో మాదిరిగా ఉండదన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడుతో కులం-ప్రాంతం కోణంలో, ఎవరినైనా పట్టుకుంటే పనులయ్యేవన్న ప్రచారం గతంలో ఉండేది. కానీ ఈసారి లోకేష్ పోలీసుల తీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసు-మీడియా జాబితాను రూపొందిస్తున్నారు. బాబుకు భిన్నమైన లోకేష్ దగ్గర ఎవరి ఆటలూ సాగవన్న ప్రచారం ఉంది.

లోకేష్ ఇప్పుడు పోలీసు-మీడియా వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. ఏ మీడియా ఏ కారణంతో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది? ఎవరి ఒత్తిళ్లతో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది? ఎవరి పెట్టుబడులు ఏ మీడియాలో ఉన్నాయి? జగన్ సర్కారు ఎందుకు సదరు మీడియాకు ప్రకటనలు ఇస్తోంది? అన్న కోణంపై దృష్టి సారిస్తున్నారు. దానికోసం ఆయన ప్రత్యేకంగా ఒక వ్యవస్థనే ఏర్పాటుచేయడం విశేషం.

అధికారంలోకి వచ్చిన త ర్వాత ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి? విపక్షంలో ఉన్న టీడీపీకి ఎవరు ఎంత గౌరవం ఇచ్చారు? వైసీపీ ప్రోద్బలంతో ఎవరెంత రెచ్చిపోయారు? వారిలో అధికారులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని మీడియా సంస్థలున్నాయన్న దానిపై లోకేష్ ఇప్పటికే ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. ప్రధానంగా మీడియాలో వైసీపీకి అనుకూలంగా ఏం వస్తున్నాయి? టీడీపీకి అనుకూలంగా ఎలాంటి వార్తలు ప్రసారవుతున్నాయన్న దానిపై లోకేష్ ఏకంగా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై ఎలాంటి వైఖరి అనుసరించాలన్నదానిపై ఆయన ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారంటున్నారు. ఇదే నిజమైతే..టీడీపీని వేధించే పోలీసు అధికారులు, వైసీపీ ప్రేరేపిత కథనాలు వండి వార్చే మీడియాకు.. టీడీపీ అధికారంలోకి వస్తే కష్టాలు ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE