-అనుమానాల నుంచి అభ్యర్థుల ప్రకటన వరకూ
-తక్కువ సీట్లలో పోటీపై పవన్ వివరణ
-సాఫీగా సాగుతున్న ఉమ్మడి పయనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగుదేశం – జనసేన మధ్య అసలు పొత్తు కుదురుతుందా ? దమ్ముంటే జనసేన 175 స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించే ధైర్యం ఉందా? పవన్ కల్యాణ్ సీఎం కావాలి. చెరో రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాల్సిందే. టీడీపీని గెలిపించడానికి కాదు జనసేన పొత్తు. టీడీపీ పల్లకీ మోయడమే పవన్ అజెండా.. ఇలాంటి వ్యాఖ్యలు, సవాళ్లు, డిమాండ్లు కలసి వెరసి.. అసలు టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? మధ్యలోనే పుటుక్కుమంటుందా ? అన్న అనుమానపు మేఘాలు నిన్నటివరకూ కమ్ముకున్నాయి.
ఆ అనుమానాలు చీల్చుకుంటూ ఇరు పార్టీ అభ్యర్థుల జాబితా వెల్లడయింది. అటు టీడీపీ అధినేత-ఇటు జనసేనాని కలసి ఉమ్మడి జాబితా విడుదల చేసి, అనుమానాలకు శాశ్వతంగా తెరదించారు. ఇది ఒకరకంగా ఇద్దరి పొత్తు పెటాకులు కావాలని, కనిపించని దేవుళ్లకు మొక్కుకున్న వైసీపీకి అశనిపాతమే.
అవును.. తొలి నుంచి రెండు పార్టీల పొత్తును విడదీసేందుకు, వైసీపీ చేయని ప్రయత్నాలు లేవు. చేయని ప్రకటనలు లేవు. విసరని సవాళ్లు లేవు. అంతా రెచ్చగొట్టే వ్యవహారమే. దానితో ఎక్కడో ఇరుపార్టీ శ్రేణులలో చిన్న అలజడి. దానికితోడు హరిరామ జోగయ్య చేసిన రెచ్చగొట్టే ప్రకటనలు.. వైసీపీ సోషల్ మీడియాకు తాత్కాలిక బ్రహ్మాస్త్రమయ్యాయి.
అయితే అధికార పార్టీ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
అనుమానాలను అధిగమించి, పుకార్లను వెక్కిరిస్తూ చంద్రబాబు-పవన్ ఒకే వేదికపై ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా విడుదల చేయడం, కచ్చితంగా వైసీపీకి నిరాశ కలిగించే అంశమే. ఈ విషయంలో ఆవేశపరుడిగా పేరున్న పవన్ కల్యాణ్ చాలా సంయమనం పాటించి, వైసీపీ వ్యూహకర్తల ఆశలను అడియాశలు చేశారు. కాబట్టి ఈ క్రెడిట్ ఖచ్చితంగా జనసేనానిదే.
అదొక్కటే కాదు. తాను తక్కువ సీట్లు తీసుకున్న కారణాన్ని విశ్లేషించిన తీరు, పవన్ ని పరిణతి చెందిన నాయకుడిని ఆవిష్కరించింది. ఎక్కువ సీట్లు తీసుకుని తర్వాత నిరాశ పడేకంటే.. తక్కువ సీట్లలో పోటీ చేసి అన్నీ గెలవాలన్నదే తన లక్ష్యమన్న పవన్ వ్యాఖ్య, క్షేత్రస్థాయిలోని జనసైనికులను మెప్పించింది. అంతకుమించి.. వైసీపీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనం కలగకూడదన్నదే తన భావన అన్న పవన్ విశ్లేషణ, టీడీపీ – జనసేన అధికారంలోకి రావాలని ఆకాంక్షించే జనసైనికులను మెప్పించింది.
అయితే ఇది కరుడుగట్టిన కొందరు పాతకాలపు కాపు ఛాందసవాదులకు మింగుడుపడకపోవచ్చు. హరిరామజోగయ్య లాంటి వారి నుంచి దీనికి సంబంధించి లేఖలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. నిజానికి వారి బలం శూన్యం. వారంతా పేపర్ టైగర్లే. క్షేత్రస్థాయిలో నిలబడి పనిచేసేది కార్యకర్తలు మాత్రమే.
పొత్తును విచ్ఛిన్నం చేసే అంశంలో, వైసీపీ తొలి నుంచి రెండంచెల వ్యూహం అనుసరించింది. ఒకవైపు ఇద్దరూ విడివిడిగా పోటీ చేసే దమ్ముందా ? అని సవాల్ చేస్తూనే.. మరోవైపు జగన్ సహా ‘వాళ్లంతా ఒకవైపు మనం ఒకవైపు’ అని చెప్పేవారు. అటు వైసీపీ అధికార ప్రతినిధులు – మంత్రులు ఎవరెంతమంది కలసి పోటీ చేసినా, సింహాన్ని ఏమీ చేయలేరు. సింహం సింగిల్గా వస్తుంది అంటూ భారీ డైలాగులు కొట్టేవారు.
ఇవన్నీ అధికార పార్టీ అంతరంగంలో గూడుకట్టుకున్న భయాలేనని, మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్థమయి తీరాలి. అసలు టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఏ సంబంధం ? ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తే అధికారపార్టీకి ఎందుకు ? సీఎం సీటు ఎవరు పంచుకోవాలో ఆరెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారమే తప్ప, అందులో వైసీపీకి సంబంధం ఏమిటి ? అంటే తమ రెచ్చగొట్టే సవాళ్లకు రెండు పార్టీలు ప్రభావితం కావాలన్నదే, వైసీపీ వ్యూహకర్తల అసలు లక్ష్యమన్నది అర్ధమవుతూనే ఉంది.
నిజానికి జగన్ పాలనపై ప్రజల్లో 90 శాతం సంతృప్తస్థాయి ఉందని ప్రభుత్వ పెద్దలే చాలాసార్లు ప్రకటించారు. ‘మన పార్టీకి 58 శాతం ఓటింగ్ ఉంది. కమ్మ-కాపు-బ్రాహ్మణ-వైశ్య మినహా అన్ని వర్గాలు మనతోనే ఉన్నాయ’ని జగన్, తన వద్దకు వచ్చే సీనియర్ల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కాచెల్లెమ్మలు-అవ్వాతాతలు-మేనల్లుళ్లంతా తనతోనే ఉన్నారని, స్వయంగా జగన్ వేదికలపై దీర్ఘాలు తీస్తూ ధీమాగా మాట్లాడుతున్నారు.
మరి మళ్లీ గెలుపుపై అంత ధీమా ఉన్నప్పుడు.. ఎవరు ఎవరితో కలిస్తే వైసీపీకి వచ్చిన నష్టమేమిటి ? టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే వచ్చిన భయమేమిటి ? వై నాట్ 175.. వైనాట్ కుప్పం ? అని మహా ధీమాతో ప్రకటించిన అధికారపార్టీ అధినేత.. చివరాఖరకు నా ఆశలు మీరే.. మీరే నా స్టార్ క్యాంపెయినర్లు.. నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీదే అన్న బేల మాటలు చూస్తే.. అధికారపార్టీకి ఫలితాల తర్వాతి దృశ్యాలేమిటో అడ్వాన్సుగా కనిపిస్తుట్లున్నాయి. లేకపోతే పొత్తును విమర్శింకుండానే ప్రచారబరిలో దిగేవారు.
ఏదేమైనా పొత్తు బంధాన్ని విడగొట్టేందుకు, వైసీపీ వ్యూహకర్తల పన్నాగాలేవీ వర్కవుట్ కాకపోవడం ఆ పార్టీకి సంబంధించినంత వరకూ విషాదమే. అటు అధికార పార్టీ అనుబంధ సోషల్ మీడియాకు అస్త్రాలు ఖాళీ అయినట్లున్నాయి.