Suryaa.co.in

Telangana

మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు భారత్ జాగృతి న్యాయపోరాటం

న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అవుతాం
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి
2024 సార్వత్రిక ఎన్నికల నుంచైనా రిజర్వేషన్లను అమలు చేసేలా చర్యలు చేపట్టాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి తరఫున న్యాయపోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో ఈ అంశంపై పెండింగ్ లో ఉన్నపిటిషన్ లో ఇంప్లీడ్ అవుతామని ఆ సంస్థ అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించిన తాము వాటిని తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమయ్యామని స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణ అమలు కోసం పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే పలు పార్టీలు, సంస్థలు కోర్టుకు వెళ్లాయని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో భారత్ జాగృతి తరపున తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపై చర్చలు జరుపుతున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో తాము ఇంప్లీడ్ అవుతామని కవిత ప్రకటించారు.

LEAVE A RESPONSE