కొత్తగా పెళ్లైంది.. రేషన్ కార్డులో భార్య పేరు లేదు ‘మహాలక్ష్మి’ పథకం వర్తిస్తుందా..?

కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ దరఖాస్తులకు సంబంధించిన ప్రజలకు చాలా సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తరచుగా వ్యక్తమవుతున్న ప్రశ్నలు.. వాటి సమాధానాలు ఓ సారి చూద్దాం.

ప్రజాపాలన దరఖాస్తులు
ప్రజలకు ఎదురవుతున్న ప్రశ్నలు
వాటికి సమాధానాలు ఇవే..

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీల అమలుకు గాను.. అర్హుల నుంచి డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనవరి 6 వరకు ప్రజల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది.

అయితే చాలా మందికి రేషన్ కార్డులు లేవు. దానికి తోడు ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రేషన్ కార్డు ఓ చోట, ఆధార్ కార్డు అడ్రస్ ఓ చోట, గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మరో చోట ఇలా.. వేరు వేరు అడ్రస్‌లు ఉన్నాయి. దీంతో చాలా మంది అర్హులైన ప్రజలు తమకు పథకం వర్తింస్తుందో లేదో అనే ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గ్యారంటీలపై వ్యక్తమవుతున్న చాలా ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. అవెంటో ఓ సారి చూద్దాం.

ప్రశ్న: మేము ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాము.. మా కుటుంబ సభ్యులు అందరం స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలా?
జవాబు: యజమాని తన కుటుంబ సభ్యులతో కలిసి అందరూ వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబంలో ఎవరో ఒకరు వచ్చి దరఖాస్తుకు అవసరమయ్యే జిరాక్స్‌లు తీసుకొని వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రశ్న: మేం నలుగురం అన్నదమ్ములం. ముగ్గురు అన్నలు వేరే ప్రాంతాలలో ఉంటున్నారు. నేను ఒక్కడినే ఊర్లో ఉంటున్నాను.. నేను మా అన్నదమ్ముల దరఖాస్తు నేను ఇవ్వవచ్చా…?
జవాబు: ఇవ్వవచ్చు..

ప్రశ్న: మాది ఉమ్మడి కుటుంబం.. కానీ అన్నదమ్ములందరము వేరుగా ఉంటున్నాము.. మాకు రేషన్ కార్డులు వేరే సపరేట్‌గా ఉన్నాయి.. మాకందరికీ వేరువేరుగా ఫామ్స్ అందరికీ ఇస్తారా?
జవాబు: ప్రతి కుటుంబం వాళ్లకి ఇస్తారు… వేరువేరుగా అప్లై చేసుకోవచ్చు..(ఒకవేళ అందరూ ఒకే రేషన్ కార్డులు ఉంటే ఒక ఫామ్ సరిపోతుంది)

ప్రశ్న: నాకు ఈ గ్రామంలోనే రేషన్ కార్డు ఉంది.. ఆధార్ కార్డు మాత్రం హైదరాబాద్‌లో ఉంది.. గ్యాస్ కనెక్షన్ కూడా అక్కడే ఉంది.. నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి?
జవాబు: మీ రేషన్ కార్డు ఇక్కడే ఉంది కాబట్టి.. ఇక్కడే అప్లై చేసుకోవాలి.. ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు..(రేషన్ కార్డ్ అడ్రస్ ముఖ్యం)

ప్రశ్న: నాకు రేషన్ కార్డు లేదు నేను ఈ ఆరు పథకాలకి అర్హునేనా.. నేను అప్లై చేసుకోవాలా వద్దా?
జవాబు: ప్రజా పాలన దరఖాస్తు ఫారంలో మొదటి పేజీ 6 నంబర్‌లో రేషన్ కార్డ్ సంఖ్య అన్న దగ్గర నాకు రేషన్ కార్డు లేదు అని వ్రాయాలి. దీనికి వేరుగా దరఖాస్తు ఏమీ లేదు. అర్హులైన అన్నీ కాలమ్స్‌ని నింపి దీనితోపాటు తెల్ల పేపర్ మీద నాకు రేషన్ కార్డు లేదు నా కుటుంబ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయని ప్రజా పాలన అధికారికి వ్రాసి ప్రజా పాలన దరఖాస్తుతో కలిపి ఇవ్వాలి.

ప్రశ్న: మా తల్లిదండ్రులకు నాకు.. నా పిల్లలకు ఒకటే రేషన్ కార్డు ఉన్నది.. అందరూ అప్లై చేసుకోవాలా?
జవాబు: ఒకే కార్డు మీద కుటుంబ సభ్యులందరూ ఉంటే వేరే అప్లై చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు సపరేట్ రేషన్ కార్డు ఉంటే.. మీకు సపరేట్ రేషన్ కార్డు ఉంటే.. రెండు దరఖాస్తులు నింపాల్సిన అవసరం ఉంటుంది.

ప్రశ్న: నాకు మా తల్లిదండ్రుల రేషన్ కార్డులో పేరు ఉంది.. నాతోపాటు నా పిల్లలు కూడా ఉన్నారు.. నాకు సపరేట్ రేషన్ కార్డు కావాలి ఏం చేయాలి?
జవాబు: ప్రజాపాలన దరఖాస్తుతో పాటు తెల్ల పేపర్ మీద నాకు రేషన్ కార్డు కావాలని తమ వివరాలు రాసి ప్రజా పాలన అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రశ్న: మహాలక్ష్మి పథకం అంటే ఏమిటి ఎవరెవరు అప్లై చేసుకోవాలి?
జవాబు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రావాలని ఈ పథకం ఉద్దేశం.. ఇంతకుముందు ఏ విధంగానైనా ఏ పెన్షన్ వస్తున్న వారు ఈ పథకానికి అర్హులు కారు.

ప్రశ్న: మహాలక్ష్మి పథకంలో 500 రూపాయల సబ్సిడీ రావాలంటే ఎలా అప్లై చేసుకోవాలి.. నాకు హైదరాబాదులో గ్యాస్ కనెక్షన్ ఉంది నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి?
జవాబు: మీకు రేషన్ కార్డు ఊర్లో ఉంటే ఇక్కడే అప్లై చేసుకోవాలి.. గ్యాస్ కనెక్షన్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు. (రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి.. రేషన్ కార్డు లేని వారు ఆధార్ కార్డుతో అప్లై చేసుకోవాలి.

ప్రశ్న: నాకు పెళ్లయింది మా భార్యకు రేషన్ కార్డులో పేరు లేదు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా…?
జవాబు: వర్తిస్తుంది.. తెల్ల పేపర్ మీద వివరాలు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీ భార్యకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది.

ప్రశ్న: నాకు రేషన్ కార్డు లేదు.. ఆధార్ కార్డు ఊర్లోనే ఉంది.. నాకు గ్యాస్ కనెక్షన్ హైదరాబాదులో ఉంది.. భూమి కూడా వేరే ఊర్లో ఉంది. నేను ఏం చేయాలి?
జవాబు: రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే అప్లై చేసుకోవాలి… గ్యాస్ కనెక్షన్ ఎక్కడ ఉన్నా మీకు భూమి ఎక్కడ ఉన్నా ఇక్కడే అప్లై చేసుకోవాల

ప్రశ్న: ఇందిరమ్మ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది?
జవాబు: సొంత ఇల్లు లేని వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

ప్రశ్న: గృహజ్యోతి పథకం ఎవరికి వర్తిస్తుంది?
జవాబు: ఇంటి మీటర్ ఉన్న ప్రతి వారికి ఈ గృహ జ్యోతి కింద 200యూనిట్ల సబ్సిడీ వర్తిస్తుంది. ఒకే ఇంట్లో ఉంటూ ఇల్లు పంచుకొని వేరువేరుగా సర్వీస్ నంబర్లు ఉన్నచో అందరికీ వర్తిస్తుంది.

ప్రశ్న: చేయూత పథకం ఎవరికి వర్తిస్తుంది?
జవాబు: 57 సంవత్సరాలు నిండి ఏ విధంగా పెన్షన్ రానివారు అప్లై చేసుకోవాలి. దివ్యాంగులు అయితే 6000 పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలి.

ప్రశ్న: రైతు భరోసా అంటే ఏమిటి.. ఎవరెవరికి వర్తిస్తుంది.. నాకు గతంలో రైతు బంధు వస్తుంది నేను అప్లై చేసుకోవాలా వద్దా ?
జవాబు: ఒక రైతుకు ఇంత భూమి ఉన్న వాళ్లకే వర్తిస్తుంది అనే.. అంశం ప్రస్తుతం లేదు. మార్పులు చేర్పులు అయ్యి కొత్త పాసుబుక్కు వచ్చి ఉంటే వారు మాత్రమే రైతు భరోసాకు అప్లై చేసుకోవాలి. గతంలో రైతుబంధు తీసుకున్న రైతులు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.

Leave a Reply