Suryaa.co.in

Political News

ఓడిపోయింది తెలుగుదేశం అయినా.. మోసపోయింది ఆంధ్రులే!

భాజపాని, నెమల్రాజుని విమర్శిస్తుంటే నన్ను పచ్చబ్యాచ్ అని పిలవటం మొదలేసాయ్ బత్తాయిలు. నిజానికి, 2002 నుండి నేనూ బత్తాయినే. అందులోను, నెమల్రాజుకి విపరీతమైన అభిమానిని.

ఏదైనా, తనదాకా వస్తేకాని తెలియదంటారు పెద్దలు.నెమల్రాజు అసూయాగ్రస్త విశ్వరూప విన్యాసం 2015-2016 నాటికి అర్ధమయ్యింది. అప్పటితో బత్తాయితనం నుండి బయటపడ్డా. దాదాపు రాజకీయ జీవితపు చరమాంకంలో ఉన్న చంద్రబాబు, కొత్త ఆంధ్ర రాష్ట్ర చరిత్రపుటల్లో నిలిచిపోటానికే ప్రయత్నిస్తాడు కానీ, ప్రజలను ఎందుకు మోసం చేస్తాడు అనే ప్రశ్న తొలిచింది.

నిజంగా తెలుగుదేశం ప్రత్యేకహోదా విషయంలో మోసం చేసిందా అనే విషయం మీద చాలా రీసెర్చ్ చేసా. ఎవరో వ్రాసినవి కాకుండా, పార్లమెంటు రికార్డులు కూడా పరిశీలించా. దేశప్రధానిగా ఉండాల్సిన ప్రధాని సంకుచిత మనస్తత్వంతో ఒక్క గుజరాత్కే ప్రధానిగా మిగిలిపోయాడని అర్ధమయ్యింది. దేశవనరులని కొందరు ప్రైవేట్ వ్యక్తుల పరం చేయటం, వేలకోట్ల అప్పులు తీర్చకుండా వ్యాపారస్తులని బయటి దేశాలకు సాగనంపటంలో తోడ్పడటం, నోట్లరద్దు పేరుతో బ్లాక్ మనీని పార్టీ నిధులుగా మార్చుకోవటం….

ఇవన్నీ చూసాక నెమల్రాజు నిజాయితీ మీద నమ్మకం పోయింది.నిజానికి, తెలుగుదేశం ఏర్పడిన మొదటి ఒకట్రెండేళ్ళు తప్పించి, నాకు తెలుగుదేశం మీద వ్యామోహం లేదు. 2014లో బాబు-మోడీల కూటమి రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావించినవాళ్ళల్లో నేనొకడిని. దేశాన్ని-రాష్ట్రాన్ని మలుపు తిప్పే సంఘటన అని కూడా భావించా.ఇది బత్తాయిలకిచ్చే వివరణ ఎంతమాత్రం కాదు. వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో, చరిత్రను స్మరించుకుంటూ 2024లో వోటరుగా మనం తీసుకునే నిర్ణాయానికి ముందు ఈ విషయాలు ఆలోచించాలని అందరికీ చెప్పే ప్రయత్నం.

రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని విభజించినా, శాస్త్రీయంగా జరగకపోయినా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రుడిగా నేను క్షమించగలను. ముఖ్యకారణాలు ఏమిటంటే, హైద్రాబాదులోనే కేంద్రీకృతమైన అభివృద్ధి ఇప్పుడు ఇరురాష్ట్రాలకు విస్తరించే అవకాశంవచ్చింది. ముఖ్యంగా ఆంధ్రాకు ప్రత్యేకహోదాను ఇచ్చింది కాంగ్రెస్సే. 2014లో కేంద్రంలో కాంగ్రెసే గెలిచుంటే, చేసిన వాగ్దానాలు కచ్చితంగా తీర్చేదే అని నా గట్టినమ్మకం. అశాస్త్రీయంగా చేసిన ఆ విభజన తప్పు అని తెలిసేనాటికి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేతులు కాలిపోయాయి.

ముఖ్యంగా ఆంధ్రాలో, ఇప్పట్లో లేచే అవకాశం ఏమాత్రం లేదు.భాజపా విషయానికి వస్తే, 2014లో ఆంధ్రాకు వాళ్ళు చేస్తామని చెప్పినదానికి, చేసినదానికి పొంతనే లేదు. అయిదేళ్ళు ప్రత్యేకహోదా ఇవ్వాలని పార్లమెంటులో పోరాడిన భాజపాలు, అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేకహోదాని కూడా చెత్తబుట్టలో వేసారు!.అంతకన్నా దారుణం, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రిని, తమ కూటమిలోని భాగస్తుడిని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వేధించారు. రాష్ట్రంలో రాజకీయంగా విస్తరించే కాంక్షతో, కూటమి మర్యాదను అతిక్రమించి ప్రతిపక్షనాయకులతో చీకటి ఒప్పందాలు చేసుకొని రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు.

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి అవసరమైన నిధులని ఇవ్వని కేంద్రం, గుజరాత్కు మాత్రం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ఆంధ్రులని మోసం చేసింది. భారత సైన్యానికి కేటాయించిన నిధులు మీకు ఇవ్వాలా అని అభాండాలు వేసి ఆంధ్రులని దేశద్రోహులనే ముద్రవేసేంది.చంద్రబాబు మీద ఉన్న వ్యక్తిగత వైరంతో అసూయకు మారుపేరైన మోడీ పాములా పగ పెంచుకున్నాడు. నమ్మించి మోసం చేయాలనే కృతనిశ్చయంతో ఆంధ్రుల గురించి మొసలి కన్నీళ్ళు కార్చి, ఢిల్లీని మించిన రాజధానికి తాను హామీ అని చెప్పి మొత్తం రాష్ట్రాన్నే ముంచేసాడు.

2009లో శవయాత్రలతో మొదలైన వైయస్సార్ పార్టీ ప్రస్థానం, ఓదార్పు యాత్రలతో కొనసాగి, అబద్ధపు ప్రచారాలతో 2019 నాటికి అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014 నుండి ప్రత్యేకహోదా గురించి రాష్ట్రంలో ఉద్యమాలు చేపట్టి, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి, ఎట్టకేలకు 2019లో అధికారంలోకి వచ్చింది.

ప్రత్యేకహోదా కోసం కేంద్రం మెడలు వంచుతామన్న ఆ పార్టీ నాయకుడు, మోకాళ్ళు-మడమలు-మెడలు-మెదడు అన్ని వంచి కేంద్రానికి పాదాక్రాంతమయ్యాడు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. అసలు ఏది రాజధానో ప్రభుత్వానికే తెలియని అయోమయం.అయిదుగురు ఉపముఖ్యమంత్రులతో మొదలైన తుగ్లక్లాంటి పరిపాలన, మూడు రాజధానులతో, నూరుగురు సలహాదారులతో కొనసాగుతున్నది. రాజధానిలో ఒక్క కొత్త ఇటుక వేయలేదు. పార్టీ అధినేత పై ఉన్న కేసులే కాకుండా, అవినీతితో, కామక్రీడలతో అపఖ్యాతి పాలైన ప్రభుత్వం దేశంలోనే నవ్వులపాలయ్యింది. ఒక్క అవకాశం అడిగిన వ్యక్తి ఆంధ్రులని అధః పాతాళానికి తొక్కేసాడు. పరిపాలనలో అనుభవంలేక ఇలా జరిగుంటే క్షమించేయొచ్చు.

కానీ, చంద్రబాబుతో తన వ్యక్తిగత కక్షల కారణంగా రాష్ట్రాన్నే భస్మం చేస్తున్నానన్న స్పృహలేని పార్టీ వైయస్సార్ కాంగ్రెస్.అన్నపార్టీలా మఖలో పుట్టి పుబ్బలో మూసివేయకుండా, ప్రస్తుతానికి పార్టీని నడుపుకుంటున్నాడు జనసేనాని. సిద్ధాంతాల గందరగోళం ఉన్నా, ఏదో చేయాలన్న తపనైతే ఉంది. ఒక్కడుగా ఏమీ చేయలేడు. రాజకీయ విచక్షణపరంగా చిరంజీవి చంటబ్బాయ్ అయితే, పవన్కళ్యాణ్ ఆ చంటబ్బాయికి బుల్లితమ్ముడు.భాజపాతో పొత్తులో ఉన్న జనసేనానిని ఎనిమిదేళ్ళ తర్వాత ప్రధానిని కలిసే అవకాశం వచ్చిందంటేనే ఆయనకు భాజపాలు ఇచ్చే గౌరవం అర్ధమౌతుంది. రాజకీయాల్లో, భుజంతడితేనో, ముఖస్తుతిచేస్తేనో పొంగిపోయి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇప్పటిదాకా, భాజపా రోడ్ మ్యాప్ ఇవ్వలేదని తన రాజకీయవ్యూహాలని అటకెక్కించేసాడు.రాష్ట్రంలో 1శాతం వోట్లులేని పార్టీకి దాదాపు 5 శాతం ఉన్న వోట్లతో దాసోహం అనేస్తున్నాదు. ఒకవేళ గెలవగలిగి ఏమైనా చేద్దామనుకున్నా, భాజపాలు ఆయన్ని ఏమీ చేయనీవు. నిజానికి భాజపా-వైయస్సార్లు చీకటిపొత్తులో ఉన్నాయి. అది తెలిసో, తెలియకో ఈయన మిన్నకుండిపోవటం రాజకీయ అజ్ఞానాన్ని సూచిస్తుంది.

ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడితే, బాబు హయాంలో అభివృద్ధికి మరోపేరుగా తలెత్తుకు నిలబడింది. రాష్ట్ర విభజన అనివార్యమైన ఒక రాజకీయ, చారిత్రాత్మక ఘట్టం. దానికి బాబు బాధ్యుడు కాడు.ఆ పరిస్థితుల్లో పాతపేరుతో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అనుభవశాలిగా బాబు అవసరం కలిగింది. గుజరాత్ మారణహోమంతో మతవాదిగా ముద్రపడ్డ మోడీకి, తన కూటమికి లౌకిక ముద్రవేయటానికి బాబు కావాల్సివచ్చాడు. బాబు మీద ప్రేమలేదు.ఎలాగైనా బాబు మీద పగ తీర్చుకోటానికి కాళ్ళు కూడా పట్టుకోటానికి సిద్ధపడ్డ మోడీ, స్వంతబలం రాగానే మొదటి ఏడాదే వెన్నుపోటు పొడిచాడు. బాబును పొడిచాననుకున్నాడు కానీ, ఆంధ్రులని పొడిచానన్న స్పృహ ఇప్పటికీ లేదు.

విచిత్రం ఏమిటంటే, ఎన్నో ఏళ్ళ రాజకీయానుభవం ఉన్న బాబు మోసపోవటం. ఆదాయం లేదు, చుట్టుముట్టిన ప్రకృతి విపత్తులు, మిత్రులే శత్రువులయ్యారు. అన్ని సంక్షోభాలు చుట్టుముట్టినా అమరావతికి పురుడుపోసాడు చంద్రబాబు.భాజపాల నమ్మకద్రోహం కారణంగా ప్రత్యేక హోదాపై తెలుగుదేశం మీద ప్రజల్లో అసంతృప్తి. ఆ అసంతృప్తిని రాజేస్తూ అబద్ధాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షంతో మోడీ చీకటి పొత్తు.

చివరికి ఓడిపోయింది తెలుగుదేశం అయినా, మోసపోయింది ఆంధ్రులే. ఏదేమైనా, కాంగ్రెస్ కనుమరుగైపోయింది. భాజపాలు మోసకారులు. వైయస్సార్లు అవినీతిపరులు. జనసేనకు రాజకీయ విచక్షణ లేదు. కాబట్టి, రాష్ట్రానికి ప్రస్తుత ఆశాదీపం తెలుగుదేశం. 2024లో నా వోటు తెలుగుదేశానికే. మీ వోటెవరికో ఆలోచించుకోండి.

-వెంకటేశ్వర్లు

LEAVE A RESPONSE