హిందూ రాజు విగ్రహం కోసం పాకిస్తాన్‌లో ఉద్యమం

వినడానికి వింతగా ఉండొచ్చు. ముస్లిం దేశమైన పాకిస్తాన్ లో ఒక హిందూ రాజు విగ్రహం పెట్టాలంటూ రెండేళ్లుగా ఉద్యమం నడుస్తున్నది. పాకిస్తాన్ పాలకులకు ఆ రాజు పేరు చెబితే కంపరం. ఎందుకంటే పాకిస్తాన్ ఆవిర్భావానికి స్ఫూర్తిదాతగా వారు నెత్తిన పెట్టుకుని కొలిచే మహమ్మద్ బిన్ కాసిం కు ఆ ప్రభువు బద్ధశత్రువు.

ఆ మహారాజు పేరు దాహిర్ సేన్. దురదృష్టం ఏమిటంటే భారత ఉపఖండంలో ఇస్లామిక్ దురాక్రమణను కొండలా అడ్డుకుని, ఊపిరి ఉన్నంతవరకూ అద్భుతంగా పోరాడిన ఆ రాజు పేరే హిందూ దేశంలో ఈ కాలపు వారు చాలామంది ఎరుగరు. అజ్మీర్ లో మినహా ఆయన విగ్రహం దేశంలో మరెక్కడా లేదు. తుగ్లక్ లకూ ఔరంగజేబులకే తప్ప మహారాజా దాహిర్ సేన్ లాంటి జాతీయ వీరుల పేరు దేశ రాజదానిలో ఏ వీధికీ సర్కారు వారు పెట్టలేదు.

మహమ్మద్ కాసింతో భీకర యుద్ధానికి ముందు మీరు గెలవలేరు.. పారిపోరాదా..? వేరే రాజుల సహాయం అడగరాదా.. అని ఎవరో ఉచిత సలహా ఇవ్వబోతే వారిని వారించి దాహిర్ రాజు క్రింది విధంగా అన్నాడు..
“అరబ్బులను బహిరంగ యుద్ధంలోనే ఎదుర్కొని శాయశక్తులా పోరాడతాను. గెలిచానా.. వారిని తొక్కి చంపి నా రాజ్యాన్ని సుస్థిరం చేస్తాను. గౌరవప్రదంగా చనిపోతానా.. ఆ సంగతి హిందూస్తాన్, అరేబియా పుస్తకాలలో రికార్డు అవుతుంది. దాని గురించి గొప్పవాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రపంచంలోని రాజులూ వింటారు. ఫలానా రాజు దేశం కోసం శత్రువుతో పోరాడుతూ విలువైన ప్రాణం అర్పించాడని చెప్పుకుంటారు..”
[The Chachnama , Translated from Persian by Mirza Kalichbeg Fredunbeg, (1900), P 81]
అదీ హైందవ యోధుని ధీరత్వం.

– కె వి రమణారెడ్డి