Suryaa.co.in

Andhra Pradesh

ఒంగోలు పుష్పాకు మీరు ఓటు వేస్తారా?

రూ.13 లక్షల కోట్ల అప్పు సాక్షి పేపర్, భారతీ కడుతుందా?

టీడీపీకి ఏకపక్ష ఓటుతో వైసీపీని ఇంటికి సాగనంపాలి
మన కులపోడు అని ఓటు వేస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా మానేశాడా?
మన మతం వాడు అని ఓటేస్తే వాళ్లకు మాత్రం లిక్కర్, నిత్యావసర ధరలు తగ్గించారా?
అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా చేస్తా
పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్ ను ఏమనాలి.?
వెలుగొండకు పునాది వేసింది నేనే.. పూర్తి చేసి నీరందించేదీ నేనే
గోదావరి నీళ్లు సాగర్ కాల్వకు మళ్లిస్తే కరవే ఉండదు
గల్లాలో డబ్బులు లేక పెన్షన్ ఇవ్వలేదు…నెపం మాపై నెడతావా.?
ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా నిలబెట్టారు..చిత్తుగా ఓడించండి
ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేగా కందుల నారాయణరెడ్డిని గెలిపించండి
-మార్కాపురం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు

మార్కాపురం : బటన్ నొక్కా అని జగన్ రెడ్డి ప్రతి రోజూ రాగం పాడుతున్నారు. బటన్ నొక్కింది ఎంత? జనం దగ్గర బొక్కింది ఎంత? జగన్ నొక్కింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఒంగోలులో కొండేపి తప్పా అన్నింటిలోను జగన్ ను గెలిపించినా ఒక్క పని అయినా చేశారా? ఈ ప్రాంతంలో నీళ్లుంటే బంగారం పండించే రైతులున్నారు? నాడు సమైక్యాంధ్రలో నీళ్లు కావాలని మీరు నన్ను అడిగితే వెలుగొండకు శంకుస్థాపన చేశాను. మళ్లీ దానిని నిర్వీర్యం చేశారు, కోర్టు లిటిగేషన్ లో పెట్టారు. నేను అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నింటిని పరిస్కారం చేసి పనులు ముమ్మరం చేశాను.

టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికే నీళ్లు వచ్చి ఉండేవి. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కు తెచ్చి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే 15 లక్షల మందికి తాగు నీరు, 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందే ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే డబ్బులకి కక్కుర్తితో కాంట్రాక్టర్ ను మార్చి నాశనం చేశారు. 80 శాతం టీడీపీ పూర్తి చేస్తే 20 శాతం పూర్తి చేయలేని దద్దమ్మ మూడు రాజధానులు కడతానంటున్నాడు.

వెలిగొండను పూర్తి చేశాకే ఓట్లు అడుగుతానన్నాడు. రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. మొన్న పరదాల చాటున వచ్చి రిబ్బన్ కట్ చేసి పారిపోయాడు. పూర్తి చేయని ప్రాజెక్టుకు బుద్దున్నోడు ఎవడైనా ప్రారంభోత్సవం చేస్తారా? కాని జగన్ చేశాడు. దేవుడి స్క్రిప్ట్ వెలిగొండను ప్రారంభించింది, పూర్తిచేసింది, నీళ్లు ఇవ్వబోయేది నేనే. పోలవరం 72 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి గుత్తేదారుడిని మార్చి నాశనం చేశారు.

మార్కాపురాన్ని కొత్త జిల్లాగా తీసుకువస్తాను. రామాయపట్నం పోర్టు కోసం అన్ని పనులు పూర్తి చేశాను. జగన్ రెడ్డి వచ్చాక టెండర్లు రద్దు చేసి డబ్బుల కోసం లాలూచీ పడి రివర్స్ టెండర్ కు పాల్పడ్డారు. ఇండోనేషియా నుంచి ఏషియా పల్స్ ఫ్యాక్టిరీని రూ.25వేల కోట్ల పెట్టుబడితో తెస్తే పారిపోయేలా చేశారు.

రూ.13 లక్షల కోట్ల అప్పు సాక్షి పేపర్, భారతీ కడుతుందా? రూ.60 మద్యం నేడు రూ.200 కి పెరిగింది. ఒక క్వార్టర్ కు రూ.140 అంటే రెండు క్వార్టర్లు రూ. 280 ఎవరి జేబులోకి వెళుతున్నాయి? హూ కిల్డ్ బాబాయ్? జగన్ రెడ్డికి తెలియదందటా? నిందితులను పక్కన పెట్టుకొని బాధితులపై కేసులు పెడుతున్నారు. సొంత చెల్లిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు రావడమే కలియుగం. బాబాయ్ ని చంపేవాళ్లు మనకి కావాలా? కోడి కత్తి నాటకం ఆడేవాళ్లు కావాలా? కంటైనరల్లలో డబ్బులు పంపే వాళ్లు కావాలా? సైకిల్ మీద పువ్వు పెట్టుకొని, జనసేన గ్లాస్ పట్టుకొని తొక్కుకుంటూ ముందుకు పోదాం.

బీజేపీతో పొత్తుపెట్టుకున్నందుకు ముస్లింలను రెచ్చగొడుతున్నారు. పార్లమెంట్ లో ముస్లింల బిల్లులు కేంద్రం ప్రవేశపెడితే అక్కడ మద్ధతు ఇచ్చి ఇక్కడ నాటకాలాడుతున్నారు. అబ్దులు సలాన్ని వేధించడంతో నలుగురు కుటుంబం సభ్యులు ఆత్మహత్య చేసుకునేలా చేశారు.

కూటమి మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం, ప్రజలు గెలవాలంటే ఈ కూటమి గెలవాలి. రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు. పిల్లల్ని చదివించుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, ప్రాజెక్టులు కట్టాలి, తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం మా బాధ్యత. మనకు కావాల్సింది కులం, మతం, ప్రాంతం కాదు. మన కులపోడు అని ఓటు వేస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా మానేశాడా. మన మతం వాడు అని ఓటేస్తే వాళ్లకు మాత్రం లిక్కర్, నిత్యావసర ధరలు తగ్గించారా? సమర్ధుడు రావాలి, ప్రజలను ముందుకు తీసుకువెళ్లే నాయకత్వం కావాలి.

తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ ను ఇక్కడ పోటీ చేసేందుకు వైసీపీ తీసుకువచ్చింది. ఒంగోలు పుష్పాకు మీరు ఓటు వేస్తారా? చిత్తూరులోను మరో రెడ్ శాండిల్ స్మగ్లర్ ను పెట్టాడు. నేడు గళ్లాలో డబ్బులు లేకుండా పించన్ ఇవ్వలేదు. ఖజానా ఖాళీ అయ్యింది. ఆ నెపం మన మీద వేస్తున్నాడు. ఇంటి దగ్గర ఉన్న వాళ్లకే పించన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

 

LEAVE A RESPONSE