-పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
-ఏఎన్‌యూలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
గుంటూరు: జగనన్న ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్‌తో మహిళలకు భద్రత, భరోసా వచ్చిందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి మహిళకు దిశ యాప్ అండగా నిలుస్తోందని చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట పురస్కారంతో యూనివర్సిటీ నిర్వహకులు రోజాను సత్కరించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. పక్కరాష్ట్రంలో జరిగిన ఘటనను చూసి.. మన రాష్ట్రంలోని ఆడపడుచుల రక్షణ కోసం దిశ చట్టం చేసిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అని, అంతేకాకుండా ఆపదలో ఉన్నవారిని క్షణాల్లో ఆదుకునేలా దిశ యాప్‌ను కూడా తెచ్చారన్నారు. ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశిష్ట పురస్కారం అందుకోవడం తన అదృష్టమని, ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని మంత్రి రోజా అన్నారు. తాను ఎంచుకున్న రెండు రంగాలు సవాళ్లతో కూడుకున్నవని, పురుషాధిక్యత ఉన్న ఈ రంగాల్లో రాణించేందుకు తన తండ్రి, సోదరులు, భర్త అండగా నిలిచారని చెప్పారు. తన తోడబుట్టకపోయినా నేనున్నానని భరోసా కల్పించిన అన్న సీఎం వైయస్ జగన్ అని గుర్తుచేశారు. కష్టాన్ని నమ్ముకున్నవారు కచ్చితంగా విజయం సాధిస్తారన్నారు.