తెలంగాణ ప్రజల పైసలతో కేసీఆర్ మహారాష్ట్రలో హంగామా

Spread the love

– అబద్ధాలు మాట్లాడుతున్న కేటీఆర్ ది నోరా – మోరా?
– నడ్డాపై విమర్శలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డిని కడిగిపారేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప
-కొందరు మంత్రులు కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా వ్యవహరిస్తున్నారు
– కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డ విఠల్

600 కార్ల కాన్వాయ్ తో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం పై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దైవదర్శనానికి వెళ్లినట్లుగా లేదని “రాజు వెడలే రవితేజ లదరగా” అన్నట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ 600 కార్ల కాన్వాయ్ తో హైదరాబాద్ నగరం మొదలుకొని రాష్ట్ర బార్డర్ దాకా ట్రాఫిక్ ఇబ్బందితో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని ఆయన అన్నారు.

ముఖ్యంగా ఎన్నో అంబులెన్స్లు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాయని వివరించారు. ప్రభుత్వ కార్లలో ప్రజల సొమ్ముతో డీజిల్ పోసుకొని బీఆర్ఎస్ జండా కట్టుకుని పోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. పైగా కేసీఆర్ క్యాబినెట్ లోని 14 మందిని తీసుకెళ్లితే ఇక్కడ పాలన పరిస్థితి ఏంటని అన్నారు. అయినా మంత్రివర్గంలో ఎవరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని, కొందరైతే కేసిఆర్ కుటుంబ బానిసలుగా వ్యవహరిస్తున్నారని సంగప్ప ఆరోపించారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పై ఒక మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలని సంగప్ప ఖండించారు. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఊడిగం చేస్తు బిజెపి గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని సంగప్ప దుయ్యబట్టారు.తెలంగాణ కోసం 1300 బలయ్యారు అని కేటీఆర్ ఉప్పల్లో పేర్కొనడాన్ని సంగప్ప ప్రస్తావిస్తూ, మరి కేవలం 600 మంది అమరుల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం చేసి మిగతా వాళ్లకు ఎందుకు గుర్తించలేదని సంగప్ప నిలదీశారు.

కేటీఆర్ ది నోరా మోరా అని సంగప్ప ఎద్దేవా చేశారు. 9 ఏళ్ల తెలంగాణలో శాంతిభద్రతలు కరువయ్యా అని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి లాంటి చట్టంతో పల్లెల్లో నిత్యం గొడవలవుతున్నాయని సంగప్ప పేర్కొన్నారు.

ఆడ పిల్లల వైపు చూడాలంటే లాగులు తదవాలి అని కేసీఆర్ వ్యాఖ్యల్ని సంగప్ప గుర్తు చేస్తూ, బీఅరెస్ నాయకులే కీచకులు గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం లో జానకీపురం సర్పంచ్ నవ్య పై వేధింపుల విషయం లో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని సంగప్ప అన్నారు.

మరో అధికార ప్రతినిధి విఠల్ మాట్లాడుతూ కేసీఆర్ బీసీలకు రూ. లక్ష సాయం పేరుతో మోసం చేస్తున్నారని విమర్షించారు. దళిత బంధు కు రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పి బీసీలకు కేవలం రూ. లక్ష మాత్రమే ఎందుకు అని విఠల్ నిలదీశారు. పైగా బీసీల్లో ఎన్నో కులాలుండగా కొన్నింటిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ఆయన నిలదీశారు. ఈ ప్రెస్ మీట్ లో బిజెపి రాష్ట్ర అధికార కట్టా సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply