Suryaa.co.in

Telangana

వందరోజుల్లోనే కాంగ్రెస్ పై ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయి

-అతితక్కువ సమయంలోనే అత్యధిక ప్రజావ్యతిరేకత గారడీ మాటలు తప్ప.. చేతలు లేని సర్కారు ఇది
-నాగర్ కర్నూలు లో వందకు వందశాతం గెలుస్తున్నాం
-పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

చరిత్రలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ సర్కారు మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వందరోజుల్లోనే ప్రజానీకానికి ఉన్న అన్ని భ్రమలు తొలగిపోయాయని తెలిపారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతలతో ఇవాళ హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వందకు వందశాతం గెలవబోతున్నారని కుండబద్దలు కొట్టారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి.. అత్యధిక మెజారిటీ సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఈ సందర్భంగా కేటిఆర్ తేల్చిచెప్పారు.

ఇటీవల కొడంగల్ లో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రిలో ఓటమిభయం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని సీఎం అసహనంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పరిపాలన చేతకాకపోవడం వల్లే ప్రజల దృష్టి మరల్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా అమలుచేయని ఈ అసమర్థ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టంచేశారు.

గత పదేళ్ల కాలంలో తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి ఈ రాష్ట్రంలో అసలు స్థానమే లేదని కేటిఆర్ వెల్లడించారు. పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులమంతా సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా ముఖ్యనేతలు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE