Suryaa.co.in

Andhra Pradesh

జగన్ చెప్పేది అబద్ధాలు, చేసేది మోసాలు

-జగన్ 5 ఏళ్ల పాలనకు సున్నా మార్కులు
-గుంటూరు సిద్ధం సభ అట్టర్ ప్లాప్
-నేను సేఫ్ డ్రైవర్ ని రాష్ట్రాన్ని సురక్షితంగా నడిపిస్తా
-కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి, రాష్ట్ర అభివృద్ధి కి నాదీ భరోసా
– ప్రత్తిపాడు ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

జగన్ చెప్పేది అబద్ధాలు, చేసేది మోసాలని, ఎన్నికల ముందు మీ బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు గుద్దుతున్నాడని ప్రజలనుద్దేశించి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ…….సభలో ఆడబిడ్డలు ఉత్సహంగా ఉన్నారు. చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదేనని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రత్తిపాడు ప్రజాగళం సభను చూస్తే కూటమి గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు.రోజువారి కూలీలకు కూలీ పనులు లేక వలస వెళ్లే పరిస్థితి నెలకొంది. కార్మికులకు ఉపాధి లేక పూటగడవని పరిస్థితి నెలకొంది. ఉద్యోగస్తులకు సమయానికి జీతాలు రావడం లేదు. పేదలు రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు.

రాష్ట్రంలో అన్ని వర్గాల్లో అశాంతి, అభద్రత, సంక్షోభం నెలకొంది. ప్రజల్లో నెలకొన్న తీవ్రమైన అసంతృప్తి అగ్నిజ్వాలగా మారి ఎన్నికల్లో తిరగని ఫ్యాన్‍ని చిత్తుచిత్తుగా ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేంసేందుకు సిద్ధమా అని అడుగుతున్నా? మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, అందుకు నా బాధ్యతగా పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే రావివెంకటరమణ పార్టీలో చేరారు. జగన్ రెడ్డి ఒక్కఛాన్స్ అంటూ, తండ్రిలేని బిడ్డనంటూ ముద్దులు పెట్టి, తలపై చెయ్యి పెట్టి, బుగ్గలు నిమిరి అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా ? 99 శాతం సమస్యలు పరిష్కరించానని జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ముఖ్యమంత్రిగా పనికి రాని ఫెయిల్యుర్ సీఎం జగన్ రెడ్డి. వైసీపీ పాలనకు 99 కాదు ప్రజలిచ్చే మార్కులు సున్నా. ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పి తానే కేంద్రం దగ్గర మెడలు వంచే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మోసగించారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, డీఎస్సీ ప్రకటించకుండా, పరిశ్రమలు, ఐటీ ఉద్యోగాలు రాష్ట్రానికి రానీకుండా రాష్ట్రంలోని యువతను మోసం చేశారు. అమరావతిని సర్వనాశనం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది.

జాబ్ రావాలంటే బాబే రావాలి. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మూడుముక్కలాటతో ప్రజల చెవిలో పూలుపెడుతున్నాడు. అధ్వానమైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టలేనివాడు మూడు రాజధానులు ఎలా కడతాడు. ఉద్యోగస్తులకు వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి విశ్వసనీయతకు తూట్లు పొడిచాడు. మాటతప్పను మడమ తిప్పనూ అంటూనే మోసాలు, అబద్ధాలతో కాలం వెళ్లదీశాడు. రూ.20 కోట్లు చేసి 1500 బస్సులు, మద్యం, బిర్యాని డబ్బులు ఇచ్చి గుంటూరులో జగన్ రెడ్డి నిర్వహించిన మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రజలకు సీఎంపైనే ఉన్న కోపంతోనే మీటింగ్‍కు వెళ్లడం లేదు. ప్రజాగళం మీటింగ్‍లు ప్రజలతో కళకళలాడుతున్నాయి.

గోదావరి జిల్లాల్లో ప్రజాగళం గర్జించింది. రెండు గోదావరి జిల్లాలో ఎన్డీయే కూటమికి వన్‍సైడ్‍గా ఓటర్లు పట్టంకట్టబోతున్నారు. గుంటూరు ప్రజలు సైతం మేమేమి తక్కువ కాదు అన్ని సీట్లు గెలిపిస్తామని దృడ నిశ్చయంతో ఉన్నారు. జగన్ పాలనలో విసుగెత్తి రావివెంకటరమణ, క్రిష్టినా, మురళి టీడీపీలో చేరారు. పుట్టినగడ్డమీద ప్రేమంటే వైసీపీ నాయకులు సైతం ఎన్డీఏ కూటమిని గెలిపించండి.మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాం.

కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చి రూ.200 ఉన్న కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి రూ.2000 చేసి ప్రజలను మోసగించారు. ఇక్కడే ఇళ్లు కట్టా అమరావతే రాజధానిగా ఉంటుంది అంటూనే మూడుముక్కలాటతో ప్రజలను మోసగించడం న్యాయమా? 20 ఏళ్ల భవిష్యత్‍పై విజన్‍తో ప్రణాళికలు చేసే వక్తిత్వం నాది. నా అనుభవం అంత వయస్సు లేని సీఎం జగన్ రెడ్డికి నా వయస్సు గురించి మాట్లాడే అర్హత లేదు. నేను రోజుకి 20 గంటలు కష్టపడతా.. ఎక్కిన బస్సు దిగలేని ముఖ్యమంత్రి జగన్. సీఎం వస్తున్నారని చెట్లను నరికేస్తూ ప్రజలకు నిలువనీడ లేకుండా చేస్తున్నాడు.

ప్రజలపై కక్ష్యను తీర్చుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు
ప్రజావేధికను కూల్చినప్పుడే ఈ ముఖ్యమంత్రి సైకో అని చెప్పా.. ప్రజలపై కక్ష్యను తీర్చుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర భవిత మార్చే నిర్మాణాలు ప్రారంభించి పరిపాలన టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తే ప్రజావేధికను కూల్చి విధ్వంసంతో పాలన ప్రారంభించిన వ్యక్తి జగన్. నేను ముఖ్యమంత్రి అయిన మొదటిరోజే ప్రజావేధికను మళ్లీ పునర్నిర్మిస్తా.. రాష్ట్రానికి పూర్వ వైభవం తీస్తుకొస్తా. అధికారమంటే దోపిడీ, పెత్తనం కాదు బాధ్యత.. మీ జీవితాల్లో వెలుగుతీసుకొచ్చేది సీఎం పదవి.

హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందిందంటే టీడీపీ ఘనతే. ఐటీ అభివృద్ధికి కృషి చేసి ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీదే. పేదకుటుంబంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ మాతృభూమి మీద ఉన్న ప్రేమతోనే గుంటూరును నెంబర్ వన్‍గా తయారు చేసి మీ రుణం తీర్చుకునేందుకు వచ్చారు. అమరావతి నిర్మాణమైతే ప్రత్తిపాడు అందులో భాగమయ్యేది యువతకు ఉద్యోగాలు వచ్చేవి. హైదరాబాద్‍లో ఔటర్ రింగ్‍రోడ్డును టీడీపీ హయాంలోనే నిర్మించాం. మరోసారి టీడీపీ ప్రభుత్వం వచ్చిచుంటే అమరావతి చుట్టూ సైతం తెనాలి, హనుమాన్ జంక్షన్, సత్తెనపల్లిని కలుపుతూ ఔటర్‍ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి రాజధానిలో భాగస్వాములయ్యేలా చేసేవాళ్లం..

మీ భూములకు భారీగా రేట్లు పెరిగివి. హైదరాబాద్‍లో లక్షల్లో ఉన్న భూముల విలువ రూ.వంద కోట్లకు చేరిందంటే అది టీడీపీ ఘనతే. వైసీపీ ప్రభుత్వంలో భూముల విలువ తగ్గి భూములు కొనే వారే లేకుండా పోయింది. ప్రభుత్వంపై రియల్టర్లకు, ప్రజలకు విశ్వాసం లేదు. అమరావతిని సర్వనాశనం చేసి.. కనీసం ప్రభుత్వ ఆస్తి రూ.4 నుంచి రూ.5 లక్షల కోట్లు నష్టపరిచిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. మే13వ తారీఖున జగనాసుర వధ జరిగి రాష్ట్రానికి మేలు జరుగుతుంది.. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. జూన్ 4వ తేదీనే అమరావతే మన రాజధాని అని ప్రకటిస్తా. విశాఖపట్నం ఆర్థిక రాజధాని, కర్నూలును అభివృద్ధి చెందిన నగరంగా మూడు నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని మీకు హామీ ఇస్తున్నా.

బాదుడే బాదుడు..
టీడీపీ హాయంలో రూ.60 ఉన్న మద్యాన్ని రూ.200లకు పెంచి జేట్యాక్స్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నాడు. పక్క రాష్ట్రాల్లో ఉన్న బ్రాండ్లు ఇక్కడ లేకుండా చేసి నాసిరకమైన మద్యంతో పేదల ప్రాణాలను జగన్ రెడ్డి బలితీసుకుంటున్నాడు. గతంలో ఉచిత ఇసుక ఇస్తే ఇసుక దొరకకుండా చేసి భవననిర్మాణ కార్మికులను రోడ్డునపడేసాడు. భారతి సిమెంట్ ధరలు, స్టీల్ ధరలు, ఇసుక ధరలు పెంచి భవన నిర్మాణ రంగం కుదేలైంది. టీడీపీ వచ్చిన వెంటనే అన్ని ధరలు తగ్గుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్నారు. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్న వ్యక్తి సీఎం జగన్ రెడ్డి. సంత్సరానికి 15 శాతం ఇంటి పన్నులు పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్నాడు.

భూమి మీద సిస్థు తీసేసి ఆస్తి హక్కు కల్పించిన ప్రజానాయకుడు ఎన్టీఆర్. మీ భూమి పట్టాదారు పాసుపుస్తకంపై, సరిహద్దు రాళ్లపై జగన్ రెడ్డి బొమ్మ వేసుకొని సైకోలా ఆనందం పొందుతున్నాడు. 1 బి, అడంగల్ డాక్యుమెంట్లు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి లెక్కలు మార్చి మీ భూములు సైతం దోచుకునేందుకు పథకం రచించారు. ఏపీ భూపరిరక్షణ చట్టంలో అవకతవకలున్నాయి. జగన్ దోపిడీని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఎన్టీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆస్తులు, హక్కులు కాపాడేవిధంగా ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇస్తున్నా.

సంక్షేమానికి మొదట నాంది పలికింది టీడీపీనే

అన్నాక్యాంటీన్
టీటీడీలో అన్నదాన కార్యక్రమం తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. అన్నాక్యాంటీన్ ద్వారా పేదల కడుపు నించి దేశానికే ఆదర్శంగా నిలవాలని కార్యక్రమం తీసువస్తే.. వాటిని రద్దు చేసి పేదల పొట్టకొట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. తమిళనాడులో అమ్మాక్యాంటీన్, కర్నాటకలో ఇంధిరా క్యాంటీన్‍ను కొనసాగిస్తున్నారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్టకొట్టిన వ్యక్తి జగన్ రెడ్డి.

మైనార్టీల అభివృద్ధి
రంజాన్ తోఫా, దుల్హాన్ పథకం, విదేశీ విద్యను రద్దు చేశారు. మసీదులకు మరమ్మతులు చేపట్టడం లేదు, ఇమామ్‍లు, మౌజన్లకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. నేను ప్రశ్నిస్తే ఈ మద్యనే ఇమామ్‍లు, మౌజన్లకు జీతాలు ఇచ్చారు. మైనార్టీల హక్కులు కాపాడే బాధ్యత టీడీపీదే. ఉర్దూను రెండో భాషాగా చేర్చాం, హౌజ్ హౌస్‍లు కట్టాం, ఉర్దూ యూనివర్సీటీలు పెట్టాం, షాదీఖానాను కట్టాం, మసీదుల మరమ్మతులకు నిధులు విడుదల చేశాం. టీడీపీ ఎల్లప్పుడూ మైనార్టీల కోసం అనేక విధాలుగా కృషిచేశాం.

భవిష్యత్తులో మరింత కృషి చేస్తాం. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు వైసీపీ నేతలు. బీసీలను మోసగించారు. బీసీలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చాం. ఏటా రూ.30 వేలు ఖర్చు చేసి బీసీలను ఆదుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు చేపడతాం. రైతులు, కూలీలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఆటో డ్రైవర్ల ఆదాయం పెంచుతామని హామీ ఇస్తున్నా.

జెండాలు వేరయినా మా అజెండా ఒక్కటే
జెండాలు మూడు.. పార్టీలు మూడు అయినప్పటికీ మా అజెండా ఒక్కటే
అభివృద్ధి-సంక్షేమం-ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ పొత్తులు. ఇది జరగాలంటే సైకో పోవాలి ప్రజాప్రభుత్వం రావాలి. ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే నేను కష్టాల్లో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపిన నాయకుడు పవన్ కల్యాణ్. రాష్ట్ర భవిష్యత్ కోసం ఓట్లు చీలకుండా త్యాగాలు చేద్దామని చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. కేంద్రంలో మరోసారి ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది.. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అందరి భవిష్యత్‍ను దృష్టిలో పెట్టుకొనే పొత్తులతో వస్తున్నాం. అందరూ ఆశీర్వదించి ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. పొత్తులో భాగంగా సీట్లు దక్కని నేతలు కూటమి గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

జగన్ సామాజిక న్యాయం బూటకం
రాష్ట్రాన్ని జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పంచుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసగిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేసేందుకు నిర్ణయించాం.. ఇందుకు కేంద్రం సైతం అంగీకరించింది. ఎన్డీఏ ప్రభుత్వంలో మాదిగలు, మాలలు, రెల్లి అన్ని కులాలకు సమన్యాయం జరుగుంతుందని హామీ ఇస్తున్నా. జగన్ రెడ్డి దమ్ముంటే సామాజిక న్యాయంపై హామీ ఇవ్వాలని సవాల్ చేస్తున్నా. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉందో వైసీపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం సైతం అంతే ఉంది.

సూపర్ సిక్స్
టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ తో జగన్ రెడ్డికి గుండె ఆగే పరిస్థితి వచ్చింది. సంక్షేమానికి నాంది పలికిన మహానాయకుడు ఎన్టీఆర్. టీడీపీ హయాంలో వందకు పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తే నవరత్నాలు అంటూ.. నవ మోసాలతో ప్రజలను మోసగించిన పార్టీ వైసీపీ. మహిళకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత, డ్వాక్రా సంఘాలు, పొదుపు ఉద్యమం, వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ టీడీపీ. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తాం. ఐదేళ్లలో ప్రతి ఆడబిడ్డకు రూ.90 వేలు ఇవ్వబోతున్నాం. తల్లికి వందనం పథకం కింద స్కూల్‍కి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15000 ఇస్తాం. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తాం. దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. నేనే ఒక డ్రైవర్‍ లా మారి మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాం. అన్నధాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20,000 అందజేస్తాం.

పట్టిసీమ పూర్తి చేసింది టీడీపీనే. గుంటూర్ ఛానల్ పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరిస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మెగా డీఎస్సీ ప్రకటిస్తాం, జాబ్ క్యాలెండర్ తో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ఇంటి దగ్గరే వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తాం. అమరావతి, ప్రత్తిపాడుకు ఐటీ ఇండ్రస్టీస్ తెస్తాం. అమరావతి ప్రాంతంలో ఐటీ కారిడార్ నిర్మించే బాధ్యత తీసుకుంటాం. నైపుణ్య కేంద్రాలతో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నా. రానున్న ముప్పై రోజులు కష్టపడి ఎన్డీఏ కూటమిని గెలిపించే బాధ్యత యువత తీసుకోవాలి. వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తాం. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు రూ.వెయ్యి అదనంగా కలిపి జూలై‍లో రూ.7 వేలు పింఛన్ ఇంటివద్దకే అందజేస్తాం.

వాలంటీర్ల జీతాల పెంచుతాం
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తాం. వైసీపీ నేతల బెదిరింపుపకు భయపడి ఎవరూ రాజీనామా చేయకండి. వాలంటీర్లకు జీతాలు పెంచడంతో పాటు లక్షలు సంపాధించే మార్గం చూపిస్తాం. వాలంటీర్లు తప్పు చేయకుండా, రాజీనామా చేయకుండా తిరుగుబాటు చేయాలి. వాలంటీర్ల నెత్తిన కీరిటం పెట్టామని ధర్మాన మాట్లాడుతున్నారు. మంత్రి ధర్మాన భరతం ఎన్నికల ముందే వాలంటీర్లు పడతారు. వాలంటీర్లకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నా.

ఇక్కడ దోపిడీ చేసిన ఎమ్మెల్యేని తాడికొండ ట్రాన్స్ ఫర్ చేశారు. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుందా. మీకు రామాంజినేయులును అభ్యర్థిగా పెట్టా.. గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా పనిచేశారు. సెక్రటరీగా పనిచేశారు. నీతి, నిజాయితీతో పదిమందిని మెప్పించే చొరవ రామాంజినేయులులో ఉంది. రామాంజియులును భారీ మెజార్టీతో గెలిపించండి.. మీ అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తారు. పెద్దరత్నయ్య, మురళిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినగానే మీలో ఉత్సాహం పెరుగుతోంది.

పెమ్మసానిని మీకేందుకు ఈ కష్టాలు రాజ్యసభకు వెళ్లమని అడిగాను పట్టువదలని విక్రమార్కుని లాగా ఈ ప్రాంతంలో ఎంపీ అయ్యి ప్రజలకు సేవ చేసే అవకాశం కావాలని, ప్రజల్లోకి వెళ్లాలని విజన్‍తో ముందుకొచ్చారు. మీరు సహకరించి భారీ మెజార్టీతో పెమ్మసానిని గెలిపించండి గుంటూరును దేశంలోనే నెం.1 స్థానంగా తీర్చుదిద్దుతాడు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య రోడ్లలో మట్టిని దొంగించే దొంగ, గ్రావెల్ దోపిడీతో వేలకోట్లు దోచుకున్నాడు. పెమ్మసానికి మామూలు గెలుపు కాదు వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కకుండా చేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.

కూటమి అధికారంలోకి రాగానే
గుంటూరు ఛానల్ పొడిగిస్తాం. నల్లమడ ముంపు నివారణ కోసం డ్రైనేజీ నిర్మాణం చేపడుతాం. గుంటూరు రూరల్ మండలంలో విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వట్టిచెరుకూరు మండలం కుర్నాతల నుంచి పెందనందిపాడు వరకు మిగిలిపోయిన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ చేపట్టి పూర్తిచేస్తాం. అప్పాపురం ఛానల్ ద్వారా తాగునీరు ప్రాజెక్ట్ పునరుద్ధరించి.. పెదనందిపాడు, కొమ్మూరు, గార్లపాడు, కాకుమాను, కొండపాటూరు, పెద్దవారిపాలెం, అప్పాపురం గ్రామాలకి మంచినీళ్లిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE