అవనిలో సగమైన మహిళా లోకానికి అన్నిట్లో సగం అవకాశాలు కల్పించాల్సిన పురుష సమాజం, పాలకవర్గం ఉద్దేశపూర్వకంగానే మహిళా సమాజాన్ని వెనక్కి నెడుతూ అణచివేస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడమే కాకుండా ఆనాటి విజయాన్ని వెలుగెత్తి చాటి చెప్పుకుంటూ నేటి మహిళ సమానత్వం గూర్చి, హక్కుల గురించి నినదించడమే కాకుండా అణచివేతపై హత్యాచారాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంటారు.
ప్రపంచ దేశాల్లో మహిళల అణచివేతపై, వివక్షపై, అత్యాచారాలపై ఎన్నో పోరాటాలు జరిగి ఎన్నో హక్కులను సాధించగా ఇండియాలో మాత్రం ఆ హక్కులు, అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. వర్గ అసమానతలతో పాటు కుల అసమానతలు కలిగిన ఇండియా సమాజంలో లింగ వివక్ష కూడా ఎక్కువే. ప్రపంచంలో ఎక్కువగా పరాయి పాలనకు గురైన ఇండియాలో ఆయా పాలకుల అణచివేతలో ఎక్కువగా బలిపశువులుగా మారింది మహిళలే.
స్వాతంత్ర పూర్వము నుండి అణచివేయబడిన మహిళలు స్వాతంత్రం సిద్ధించి 75 ఏండ్లు దాటినా, ఎన్నో చట్టాలను రూపొందించుకున్నా నేటికి సాంఘీక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం లభించలేదు. గత రెండు వేల ఏండ్ల క్రితం నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా అమలవుతున్న మనుధర్మ శాస్త్రం వల్లనే ఇండియాలో మహిళలు నేటికి అణచివేయబడుతూ ఇంటా, బయట ఎన్నో హింసలకు గురవుతున్నారు.
ప్రపంచ దేశాల్లో మహిళలు హక్కులు సాధించి విముక్తి పొందడానికి వారికి విద్య ఒక ఆయుధంగా మారింది. అదే ఇండియాలో వేల సంవత్సరాలు స్త్రీలకు విద్య నిషేధించబడింది. మనుధర్మ శాస్త్ర ప్రకారం దేశ మూలవాసులకు, స్త్రీలకు విద్య, ఆస్తి, అధికారం నిషేధించబడింది. బ్రిటిష్ వారు ఇండియాకు వచ్చేంతవరకు స్త్రీలకు విద్య నిషేధించబడింది. బ్రిటిష్ వారి మద్దతు, మహాత్మా జ్యోతిరావు పూలే చొరవతో కింది కులాలకు విద్యతో పాటు అన్ని వర్గాల స్త్రీలకు విద్య బోధన జరిగింది.
స్త్రీలకు ప్రత్యేక పాఠశాలలు నిర్వహించి విద్య నేర్పించడంలో, వారిని చైతన్యం చేయడంలో సావిత్రి బాయి పూలే సేవలు చాలా గొప్పవి. స్త్రీలకు విద్య లేకపోవడంతో బాల్య వివాహాలు జరగడం, వంటింటికి పరిమితమవడం, బాలింత మరణాలు ఇండియాలో ఎక్కువగానే జరిగాయి. వరకట్న దురాచారం వల్ల గృహ హింసతో పాటు మహిళల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
పురుషాధిక్య సమాజం వల్ల ఇండియాలో స్త్రీలు ఎంత పెద్ద చదువులు చదివిన నేటికి విద్య, ఉద్యోగంతో పాటు వంటింటి వెట్టిచాకిరి తప్పడం లేదు. ఉన్నత విద్యావంతులై వివాహాలు చేసుకున్న తర్వాత సమానత్వం, సరైన గౌరవం లభించకపోవడంతో నేడు ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులకు గురికావడమే కాకుండా కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.
అన్ని రకాలుగా స్త్రీ బలిపశువు
దేశంలో జరిగిన ఎన్నో పోరాటాల్లో స్త్రీలు బలిపశువులుగా మారారు. పోరాటాల్లో కొడుకులను కోల్పోయిన తల్లులు, భర్తలను కోల్పోయిన భార్యలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు వారి జీవన స్థితిగతులు హృదయ విధారకరం. ప్రమాదాల్లో కుటుంబ యజమాని మరించినా ఆ కుటుంబ బాధ్యతల్లో స్త్రీ పడే యాతన వర్ణనాతీతం.
దేశ రక్షణ కోసం, పాలకుల రక్షణ కోసం పనిచేస్తున్న రక్షకబటుల మరణాల వల్ల కూడా ఆ కుటుంబాల స్త్రీలు ఎన్నో బాధలకు గురవుతున్నారు. దేశంలో అసమానతలు, పేదరికం వల్ల రోజురోజుకు పెరిగిపోతున్న టెర్రరిజం వల్ల కూడా స్త్రీలు బలిపశువులుగా మారుతున్నారు.
ఈ మధ్యకాలంలో పాలకులు మద్యం ద్వారా ఆదాయాన్ని రాబట్టడం కోసం విచ్చలవిడి అమ్మకాలను ప్రోత్సహించడం వల్ల మద్యం మరణాలు సంభవించి ఎంతో మంది మహిళలు వారి పిల్లలను సాధలేక ఎన్నో బాధలకు గురవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్బంలో నేడు ఎక్కువగా హింసకు గురవుతుంది మహిళనే. వర్గ అసమానతలు పెరిగి, విద్య, వైద్య ఖర్చులు పెరిగి, వ్యవసాయంలో నష్టాలు, అప్పులతో వలసలు, ఆత్మహత్యలు ఎక్కువ కావడం వల్ల కూడా స్త్రీలు ఎక్కువగా హింసకు గురవుతున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి 110 ఏండ్లు
ఐక్యరాజ్యసమితి చే గుర్తించబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మొట్టమొదట 1908 లో బీజం పడింది. పని గంటలు తగ్గించాలని, శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, మహిళలకు ఓటు హక్కు కావాలనే డిమాండ్ తో 15 వేల మంది మహిళలతో న్యూయార్క్ వీధుల్లో చేసిన కవాతుతో మహిళా ఉద్యమానికి బీజం పడింది.
మహిళా ఉద్యమ ఫలితంగా అమెరికా సోషలిస్ట్ పార్టీ మొట్టమొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించిది. మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1911 లో జరుగగా ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో ఈ ఉత్సవాలు జరిగాయి. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా చేసే ర్యాలీలు, ధర్నాలు, ఉత్సవాలు మహిళల సామాజిక, ఆర్ధిక, రాజకీయ ఎదుగల కోసం, సమానత్వం కోసం చేసేదానికి దోహధపడుతున్నాయి. గత శతాబ్దంగా జరుగుతున్న మహిళా దినోత్సవాలను చాలా మంది స్త్రీవాద ఉద్యమాలుగా చూస్తున్నారు కానీ మహిళ ఉద్యమలో కార్మిక ఉద్యమ మూలాలు ఉన్నాయి.
మహిళా ఉద్యమానికి నాంది క్లారా జెట్కిన్
జర్మనీ దేశంలో 1857 లో జన్మించిన మార్క్సిస్టు ఉద్యమకారిని క్లారా జెటికిన్ 1880 లో జర్మనీ పాలకులు తీసుకొచ్చిన సోషలిస్టు వ్యతిరేక చట్టాలపై రచనలు చేసిన కార్లా జెట్కిన్ ను జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో ప్రవాస స్వీయ నిర్బంధానికి గురైనారు. పాలకుల నిర్బంధాన్ని లెక్కచేయని కార్లా ఇతర సోషలిస్టు ఉద్యమాలతో కలిసి నడిచి అంతర్జాతీయ సోషలిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర వహించారు.
1892 నుండి 1917 వరకు సోషల్ దేమోక్రాటిక్ పార్టీకి చెందిన ఈక్వాలిటీ పత్రికకు సంపాదకురాలిగా పనిచేసి ఎన్నో చైతన్య రచనలు చేశారు. 1910 లో అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా కాంగ్రెస్ కు కో ఫౌండర్ గా నియామకమైన కార్లా అంతర్జాతీయ స్థాయిలో మహిళా హక్కుల కోసం, మహిళా చైతన్యం కోసం ఎంతో కృషి చేశారు.
ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఫిబ్రవరి 28 న మహిళా దినోత్సవం జరపాలని మొట్టమొదటగా కార్లా జెట్కిన్ ప్రతిపాదించగా 20 వ శతాబ్దం మొదట్లో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1911 ఫిబ్రవరి 28 న జరిగింది. మొట్టమొదటి మహిళ దినోత్సవ సదస్సుకు 17 దేశాల నుండి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రష్యా కు చెందిన మహిళా ఉద్యమకారులు బ్రెడ్ అండ్ పీస్ (రొట్టె, శాంతి) కోసం, వోట్ హక్కు కోసం నాలుగు రోజుల సమ్మె చేయగా అక్కడి ప్రభుత్వం మహిళలకు హక్కులు కల్పించారు.
సమ్మె మొదలైన మార్చి 8 వ తేదీని 1993 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని నిర్ణయించి ఆనాటి నుండి నేటివరకు ప్రతి సంవత్సరం మార్చి 8 న ప్రపంచ దేశాల్లో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
మహిళల పోరాటాలతో మహిళలు హక్కులు సాధించడానికి సూచికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళ తన సృజనాత్మకతతో ఇంటి నుండి పని ప్రదేశాలు, సమావేశాల వరకు అన్ని స్థాయిల్లో ఎంతో క్లిష్టమైన సేవలు అందించడాన్ని కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎత్తిపడుతుంది. అంతర్జాతీయ మహిళా దినాన్ని ప్రపంచ ఉత్సవ రోజుగా, మహిళల సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక, రాజకీయ లక్ష్యాలను సాధించిన రోజుగా, లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడం కోసం, మహిళ చైతన్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వర్గాలు సంఘటితమై ర్యాలీలు నిర్వహించే ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమంగా అంతర్జాతీయ మహిళా దినోత్సావాన్ని సాక్షంగా చెప్పవచ్చును.
మహిళా దినోత్సవానికి మూడు రంగుల సూచిక కూడా ఉంది. ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులను మహిళల విజయానికి గుర్తింపు రంగులుగా నిర్ణయించారు. ఊదా రంగును న్యాయం, హోదా కు గుర్తింపుగా, ఆకుపచ్చ రంగును విశ్వాసానికి, తెలుపు రంగును స్వచ్ఛతకు గుర్తుగా భావించి అంతర్జాతీయ మహిళా దినం రోజున రంగులతో ఉత్సవాలను జరుపుకుంటారు.
ఎన్నో త్యాగపూరిత పోరాటాల ద్వారా ఎన్నో హక్కులు సాధించిన మహిళ ఉద్యమ ఫలాలు ఇంకా మెజారిటీ మహిళలకు దక్కడం లేదు. వంద ఏండ్ల క్రింది పోరాట స్ఫూర్తిని నెమరువేసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పోరాట రూపాలతో మహిళ హక్కల కోసం, లింగ సమానత్వం కోసం పోరాటం చేస్తూనే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎదురించాల్సిన అవసరముంది.
– సాయిని నరేందర్
సామాజిక విశ్లేషకులు
9701916091