రణమంటే మరణమే..

యుద్ధం జరిగేటప్పుడు
న్యాయాన్యాయాల విశ్లేషణ
రెండో మాట..
ఇటూ అటూ పోయే ప్రాణాలే
ముఖ్యాంశం…
గుట్టల కొద్ది శవాలు..
మానవతకే సవాలు…!

ఇప్పటిదా..అప్పటిదా
ఈ దమనకాండ…
ఇద్దరు వ్యక్తుల విద్వేషం..
మొత్తం అమానుషం..
కురుక్షేత్రం నుంచి
రెండో ప్రపంచ యుద్ధం దాకా
ఒకటే కధ..
మానవాళికి వ్యధ..!

దుర్యోధనుడి అధికారదాహం
వ్యక్తిగత అహం..
పాంచాలి నవ్విందన్న ఉక్రోషం..
పనికిరాని పౌరుషం
మాయాజూదమై..
భీకర యుద్ధమై
రెండు కోట్ల ప్రాణాలు హరీ
బరిలోకి దిగిన అందరిలో
ఆయుధం పట్టని
కిట్టయ్యతో కలిపి
పదకొండు మందే సజీవం
చెరువులో దాగిన సుయోధనుడూ
చివరకు హతం!

రెండు ప్రపంచ యుద్ధాలు..
పది కోట్ల జనం దుర్మరణం
కొందరి కాంక్ష..
చివరకు స్మశానాలను
ఏలుకున్న నేతలు..
ప్రాణం తృణప్రాయమై
మానవతకు ప్రాయోపవేశమై
ఆక్రందనే అంతటా
కనిపించే సన్నివేశమై!

హిట్లర్..నెపోలియన్.. ముస్సోలిని..
శవాల గుట్టలే సింహాసనం
రుధిరమే పానం..
మరణమృదంగమే
శ్రవణానందం..
ఆర్తనాదాలే వీనుల విందు..
మృత్యువుతోనే పొందు!

ఇలా సాగిన చరిత్రలో
ఆయుధమే కలం..
రక్తమే సిరా..
రుద్రభూమే వేదిక..
హననమే వేడుక..
తరతరాలుగా ఇదే వాడుక..!

అందుకే…అందుకే..
ప్రాణాలు హరించడానికే రణాలు..
చెప్పేవి పనికిరాని కారణాలు..
చేసేవి దారుణాలు..
ప్రపంచశాంతి..
ఆయుధవిరమణ..
రాజీ యత్నాలు…
సమితులు..సమతలు..
ఆప్యాయతల కలబోతలు..
ఐరాస…అలీన..
నాటో..ముప్పు ముంచుకొచ్చే
వేళకు అవన్నీ ఎటో..
ఓ నియంత..లేదా నేత..
ముద్దుపేరు అధినేత
అనుకుంటే తప్పదు యుద్ధం
కాకపోయినా సంబద్దం..
కారణాలు
చాలావరకు అబద్ధం..
ఇది నిజం..
నియంతకు యుద్ధమే
ఇజం..మేనరిజం!

అప్పుడూ..ఇప్పుడూ..
ఎప్పుడూ పోయేవి
అమాయక ప్రాణాలే..
పేరుకు సైనికులైనా
వారూ పోరులో
పోయే పౌరులే…
నీ దేశమైనా..
నా దేశమైనా..
ఏ దేశమైనా..
మనిషి మరణం విషాదమే..
యుద్ధమనే ఆలోచన
ఎప్పుడూ ప్రమాదమే..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply