Suryaa.co.in

Devotional

నందికేశ్వర వ్రత కథ

ఒక నాడు పార్వతి శివుని పాదములు పట్టుచుండగా ఆతడామె చేతులుకఠినంబుగ నున్నందున తనపాదములనుపట్టవలదనెను. పార్వతి తన చేతులెందుకు కఠినముగానున్నవో తెలపవలసినదని అడుగగా హరుడామె ’పరోపకారము’ చేయలేకపోవుటచే నట్టి కాఠిన్యపుహస్తములు వచ్చెననియు నవి మృదుత్వము నొందుటకు నీళ్ళాటిరేవున వేడి నీళ్ళతో వచ్చుపోవువారికి తలంటి నీళ్ళు పోయించమని చెప్పెను.

పార్వతి భర్త ఆజ్ఞతో అట్లు చేయుచుండగా నొక పేదరాలువచ్చి ఆమెతో తలంటి నీళ్ళు పోయించుకుని వెళ్ళుచుండగా నామెపై దయదలచి పార్వతి సంపద నిచ్చెను. నాటినుండి ఆ పేదరాలు ధనవంతురాలై గుమ్మములోనికి వచ్చినవారికి పని చెప్పుచుండెను.

ఆ సంగతి పార్వతికి తెలిసి గర్విష్టురాలగు నామె భాగ్యము తీసివేయుటకు విఘ్నేశ్వరుని బంపగా అంత నామె వుండ్రాళ్ళు నైవేద్యము పెట్టెను. వాటిని తిని అతడు మరింత ఐశ్వర్యమామెకిచ్చి వెళ్ళిపోయెను. తరువాత పార్వతి నందిని బంపగా నతని కామె సెనగలు వాయనమిచ్చుటచే అతడుగూడా నామె భాగ్యములను తీయలేకపొయెను.

పిమ్మట పార్వతి భైరవుని బంపగా నతని కామె గారెలు వండిపెట్టుటచే నాతడుకూడా నామె భాగ్యములను తీయలేక పోయెను. పిమ్మట పార్వతి చంద్రుని పంపగా నతని కామె చలిమిడి చేసి పెట్టుటచే నాతడనుభాగ్యమును హరింపలేకపోయెను. అటుపిమ్మట పార్వతి సూర్యుని పంపగా నతని కామె క్షీరాన్నము వండిపెట్టెను. అందుచేతనడునుగూడభాగ్యము హరింపలేకపోయెను. పిమ్మట అర్జునుని పంపగా ,ఆమె అతనికి అప్పాలు నైవేద్యము పెట్టుటచేత అతడు భాగ్యము హరింపలేకపోయెను. పిమ్మట శివునిపంపగా నతనికామె చిమ్మిలిపెట్టగా నాతడును కూడా భాగ్యములను హరింపలేకపోయెను. తుదకు పార్వతి వెళ్ళగా, ఆమెకు పులగము నైవేద్యముపెట్టెను.

అంత పార్వతి ఆమె భక్తికి మెచ్చి ” నీవు మాకందరకును బెట్టిన తొమ్మిది పదార్ధములను ఉద్యాపన చేసికొన్న యెడల మానవులకు సకలసంపదలు కలుగును” అని చెప్పి వెడలిపోయెను. ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపన:
బిందెతో ఐదు మానికలు అత్తెసరువేసి దానికి ఐదుమూళ్ళ అంగవస్త్రమును చుట్టి, బంగారు నందికి నైవేద్యముగ పెట్టి బంధువులకు వడ్డించవలెను.

సేకరణ :
– వరలేఖరి.నరసింహశర్మ.

LEAVE A RESPONSE