Home » పవిత్ర క్షేత్రం అభయప్రదాత శ్రీ మద్ది ఆంజనేయస్వామి

పవిత్ర క్షేత్రం అభయప్రదాత శ్రీ మద్ది ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామి అనగానే అందరికీ భయాలు పోయి ఎక్కడలేని ధైర్యమూ వస్తుంది కదా. భయం వేసే సమయంలో ఆయనని తలుచుకోని వారుండ రంటే అతిశయోక్తి కాదు.ముఖ్యంగా చిన్న పిల్లలకి ఆయన ఆరాధ్య దైవము. భక్తులకీ భగవంతునికీ అవినాభావ సంబంధం వుంటుంది. కొందరు భక్తులు భగవంతునికి సేవచేసి తరిస్తే, భగవంతుడు కొందరి భక్తులకు సేవ చేసి వారిని తరింపచేస్తాడు.

ఆ రెండో కోవకి చెందిన భగవంతుడు, భక్తుడు, వారు వెలసిన క్షేత్రం తెలుసుకుందాం..
పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం మండలం, గురవాయి గూడెం ఊళ్ళో వున్నది ఈ ఆంజనేయస్వామి ఆలయం. ప్రతి నిత్యం భక్త జన సమూహాలతో కళ కళలాడే ఈ సుప్రసిధ్ధ క్షేత్రం ఎఱ్ఱకాలవ ఒడ్డున వున్నది. తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువుడై వెలసిన స్వామి చరిత్ర గర్గ సంహిత, పద్మ పురాణము, శ్రీ రామాయణముల లో చెప్పబడింది

ఆ కధేమిటంటే …
త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడనే రాక్షసుడు వుండేవాడు. ఆయన జన్మతో రాక్షసుడైనా రాక్షస ప్రవృత్తిలేక ఆధ్యాత్మకి చింతనతో వుండేవాడుట. రామ రావణ యుధ్ధంలో శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమంతుణ్ణి చూసి భక్తి పారవశ్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమా, హనుమా అంటూ తనువు చాలించాడు.

తర్వాత ద్వాపరయుగంలో మధ్వికుడుగా జన్మించాడు. అప్పుడుకూడా సదాచార సంపన్నుడై, సద్భక్తితో జీవితం గడిపేవాడు. ఆ సమయంలో వచ్చిన కురు పాండవ యుధ్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతూ, అర్జనుని జెండాపైన వున్న పవనసుతుని చూసి, పూర్వజన్మ స్మృతితో ప్రాణ త్యాగం చేశాడు.

తర్వాత కలియుగంలో మధ్వుడిగా జన్మించాడు. ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలువ ఒడ్డుకు వచ్చి అక్కడ తపస్సు చేసుకోవటానికి నివాసం ఏర్పరచుకున్నాడు.

ప్రతి నిత్యం ఎర్ర కాలువలో స్నానం చేసి శ్రీ ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. వయోభారం మీదపడ్డా మధ్వ మహర్షి తన నిత్యకృత్యాలైన ఎర్ర కాలువ స్నానం, ఆంజనేయస్వామి గురించి తపస్సు విడువలేదు.

ఒక రోజు కాలువలో స్నానం చేసి ఒడ్డుకు చేరబోయిన వృధ్ధ మధ్వ మహర్షి అడుగులు తడబడటంతో పడబోయాడు. వెంటనే ఎవరో ఆయనను పట్టుకున్నట్లు పడకుండా ఆగాడు. చూస్తే ఒక కోతి ఆయన చెయ్యి పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యలు చేసి, ఒక పండు ఆహారంగా ఇచ్చింది. దాని గురించి పట్టించు కోని మహర్షి తన నిత్యకృత్యం కొనసాగిస్తున్నాడు.

అలాగే ఆ కోతి కూడా అను నిత్యం ఆయన స్నానంతరం ఒడ్డుకు చేర్చి, సపర్యలు చేసి, పండు ఆహారంగా ఇచ్చేది. ఇలా కొంతకాలం సాగిన తర్వాత తనకు సపర్యలు చేస్తున్న ఆ వానరాన్ని తదేకంగా చూసిన మధ్వ మహర్శి ఆయనని ఆంజనేయస్వామిగా గుర్తించి, “స్వామీ, ఇంతకాలం మీతో సపర్యలు చేయించుకున్నానా!!? సాక్షాత్తూ స్వామి చేత సపర్యలు చేయించుకున్న మూర్ఖుడను నేను. ఇంక బతుకకూడదు..” అని విలపిస్తూండగా స్వామి ప్రత్యక్షమై మధ్వా ఇందులో నీ తప్పేమీ లేదు. నీ భక్తికి మెచ్చి స్వయంగా వచ్చి నీ సేవలు చేశాను. కాబట్టి విచారించకుండా ఏదైనా వరం కోరుకోమన్నాడు.

అప్పుడు మధ్వ మహర్షి స్వామీ మీరెప్పుడూ నా చెంతనే వుండేలా వరం ప్రసాదించండి అని కోరాడు
మధ్వ మహర్షి భక్తికి మెచ్చిన ఆంజనేయస్వామి మధ్వకా, నీవు మద్ది చెట్టుగా జన్మిస్తావు. నేను నీ సమీపంలో శిలా రూపంలో ఎక్కడా లేని విధంగా ఒక చేతిలో గదతో, ఇంకొక చేతిలో పండుతో వెలుస్తాను.

భక్తులు నన్ను నీ పేరుతో కలిపి మద్ది ఆంజనేయస్వామిగా కొలుస్తారు అని అభయమీయగా మధ్వ మహర్షి సంతోషించాడు. తర్వాత కాలంలో స్వామికి ఆలయం నిర్మించారు. అయితే ఆలయానికి కప్పు, విమానం నిర్మించటానికి వీలు కాలేదు.

ఆ రోజులలో జంగారెడ్డి గూడెం ఫారెస్టురేంజ్ ఆఫీసరుగా పనిచేసిన మంతెన వరహాలరాజుగారి మాతృమూర్తి శ్రీమతి భానుమతి గారు స్వామి చెంతకు తరచూ వస్తూవుండేవారు. ఒకసారి ఆవిడ ఒంటిమీదకు స్వామివారు వచ్చి కట్టిన ఆలయాన్ని అలాగే వుంచి, మద్ది చెట్టు శిఖరముగా వుండేటట్లు, వేరే శిఖరము లేకుండా గర్భాలయ నిర్మాణము చేయమని ఆజ్ఞ ఇచ్చారు. స్వామి ఆజ్ఞ పాటించి శిఖరము లేని గర్భాలయాన్ని నిర్మించారు. శిఖరము లేని గర్భాలయాలు చాలా అరుదు. ఇది ఇక్కడి విశేషం.

స్వామి మహత్యం
ఇక్కడ స్వామి చాలా మహిమ కలవాడుగా కొనియాడబడతాడు. వివాహం కానివారుగానీ, కుటుంబ సమస్యలు, ఆర్ధిక సమస్యలతో బాధపడేవారు, ఏ పని చేసినా కలసిరానివారూ, ఇక్కడ ఏడు మంగళవారాలు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి సమస్యలు తొలగిపోతాయి. చాలాకాలం క్రితమే ఇక్కడ హనుమత్ దీక్షలు కూడా ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం హనుమత్ వ్రతం, పూర్ణాహుతి జరుపబడుతున్నాయి. ఈ ఆలయానికి పశ్చిమ ముఖంగా పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయం వున్నది.ఇది ఆంజనేయ స్వామి ఆలయం ప్రసిధ్ధి చెందకముందునుంచే వున్నది

రవాణా సౌకర్యం
ఏలూరు, జంగారెడ్డిగూడెం నుంచి బస్సులు వున్నాయి. జంగారెడ్డి గూడెం నుంచి షేర్డ్ ఆటోలు కూడా లభిస్తాయి. ఆలయ ఫోన్ నెంబర్లు 08821 226494 08821 223286

సమీప పుణ్యక్షేత్రాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖమైన ద్వారకా తిరుమల ఇక్కడికి సుమారు 10 కి.మీల దూరంలో వున్నది. ఆటోలో వెళ్ళవచ్చు .

Leave a Reply