ఇందుకు ఓ రోజు అవసరమా
ఆరోగ్యమే మహాభాగ్యం..
నువ్వే నవ్వై..
ఆ నవ్వే వాడని పువ్వై..
నీ ఆలోచనలు స్వఛ్చమై..
మనసు అదుపులో ఉంటే
అదే నీ గెలుపు..
ఇందుకు ఓ రోజును ఎన్నుకోకు..
ప్రతి రోజూ ఇదే
నీ మార్గమైతే
అప్పుడిక ఆరోగ్యమే మహాభాగ్యం
నినాదం మాత్రమే కాదు..
నీ జీవన విధానం..
జగతికి ఆమోదం!
అయితే..
ఈ అవినీతి రాజ్యంలో
కల్తీ లేని భోజ్యం అసాధ్యమేగా..
అందరికీ ఆరోగ్యం మిధ్యేగా?
నాటే విత్తు…పోసే నీరు..
వేసే ఎరువు..
అయితే కల్తీ..లేదంటే నకిలీ..
చేను కోసే అన్నదాత
చేతికి మకిలి..
పొలంలో పండే పంట
నీ దరికి చేరేపాటికి
కడుపుమంట..
ఊర్పు తర్వాత
ఎన్ని మార్పులో..
ఆ విషయమే విషమై..
నీ పరిస్థితి విషమమై..!
పోనీ..ఆ తిండైనా సరిగ్గా
తింటున్నావా..
అమ్మ చేతి ముద్ద చిన్నప్పుడే..
ఇప్పుడంతా బయట ఫుడ్డే..
తిన్న వెంటనే బెడ్డే..
సామాన్యుడి పార్టీ పానీపూరీ
సాఫ్టువేరుకు ఫాస్టు ఫుడ్డు
బర్గరు..పిజ్జా..ఫ్రైడ్ చికెను
దానికో టోకెను!
సరే..తిండికి తిమ్మరాజువి
ఎటూ కావు..
పనికి పోతరాజువే..
అది మరీ ప్రమాదం..
ఇంటికి చేరువలోని
బడ్డీకీ బండే..
బద్ధకం బలిసే సండే..
ఔట్ డోర్ గేమ్స్ ఆడేవారెవరు
క్రికెట్టుకు తొలిమెట్టు గూటీబిళ్ల..
గురి నేర్పే అల్లీకాయ..
కూత పెట్టే కబడ్డీ..
పరుగులు పెట్టించే జ్వారాబాలు..
ఖో..ఖో..
ఇవన్నీ ఇప్పుడెక్కడ…
బతుకు మొబైల్ ఫోన్ల కప్పలతక్కెడ…
పొద్దున లేస్తే ఫోనుతోనే
జీవనం..
ఆ ఫోనుతోనే
అప్పుడప్పుడు
ప్రాణాలతో చెలగాటం..
ఇవన్నీ కలగలిపి
ఇంటిపట్టున నువ్వున్నా
వేళ పట్టున
నో ఫుడ్డు..నో బెడ్డు..
అదే నీ జీవితానికి గడ్డు..
ఇక నీ ఆరోగ్యం సం’గతి’
గాడిద గుడ్డు..!
ఈ కాలం పిల్లలు
ఎండలో ప’డి’ తిరిగేదేలే
ఈ ముచ్చట్లు చాలవన్నట్టు..
దిక్కుమాలిన వ్యసనాలు..
అయితే సిగరెట్టు..
లేదంటే మందు…
చులాగ్గా ఖైనీ…గుట్కా..
తంబాకు..
నాలుగు డబ్బులుంటే
ప్రతివోడు ఓ పోరంబోకు..
ఇంకెక్కడి ఆరోగ్యం..
దానిని అనుసరించి
మహాభాగ్యం..!
నీకు..నాకే కాదు
మొత్తం వ్యవస్థకే పట్టేసింది
నయం కాని మహారోగం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286