Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యాలయం..పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి

– ఆఫీసులోకి దూసుకొచ్చి విధ్వంసకాండ..
– కార్లు, ఫర్నీచర్ ధ్వంసం
– పట్టాభి ఇంటిపై దాడి, బీభత్సం
– హిందుపురంలో బాలయ్య నివాసంపైనా దాడికి యత్నం
– ఏపీలో వైసీపీ శ్రేణుల విశ్వరూపం
అమరావతి: ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు జరుగుతున్నాయి. సీఎం జగన్‌ను తెదేపా నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈదాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపిఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో తెదేపా కార్యాలయంలో ఉన్న కెమెరా మెన్‌ బద్రీకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆపార్టీ శ్రేణులు జాతీయరహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. తెదేపా కార్యాలయంపై దాడి విషయం తెలుసుకన్న తెదేపా శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.
విజయవాడలో పట్టాభి ఇంట్లో ఫర్నిచర్‌ ధ్వంసం
విజయవాడలోని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడిచేసిన వైకాపా శ్రేణులు ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్రవాహనం, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు. వైకాపా మహిళా కార్యకర్తలు విశాఖలోని తెదేపా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వైకాపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపాకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు నినాదాలు చేశారు. తెదేపా నేత లింగారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వైకాపా శ్రేణులు యత్నించారు.

LEAVE A RESPONSE