– చాగంటి వారితో టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు నైతిక విలువలు నేర్పించండి
– బిసి వై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ లో వైసిపి, టిడిపిలు కలిసికట్టుగా మద్యం మాఫియాను నడుపుతున్నాయని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని బిసివై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఐక్యరాజ్య సమితికి వెళ్లే ఎంపిల బృందంతో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని పంపడం వెనుక చంద్రబాబు సహకారం ఉందని రామచంద్రయాదవ్ విమర్శించారు. స్కామ్ లో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని ఐక్యరాజ్యసమితికి వెళ్లేందుకు ఎలా అనుమతిస్తారన్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబే మిధున్ రెడ్డిని పంపడంలో కీలకపాత్ర పోషించారన్నారు.
నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే మిధున్ రెడ్డి యుఎన్ కు వెళ్లకుండా ఆపాలని సవాల్ విసిరారు. మిధున్ రెడ్డిని తప్పని సరి పరిస్థితిల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని, లేకపోతే ఆ అరెస్ట్ కూడా జరిగేది కాదన్నారు. అరెస్ట్ చేసినందుకు ప్రతిఫలంగా మిధున్ రెడ్డిని ఎంపిల బృందంతో కలిపి ఐక్యరాజ్యసమితికి పంపడానికి చంద్రబాబు సహకరించారని దుయ్యబట్టారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చంద్రబాబు నాయుడికి రహస్య మిత్రత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏదో ఒక రూపంలో తన మిత్రుడు పెద్దిరెడ్డికి మేలు చేస్తూనే ఉంటాడన్నారు.
పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుడు, సోదరుడు తంబళ్లపల్లిలో గెలవడం కోసమే పెద్దిరెడ్డి బినామీ అయిన జయచంద్రారెడ్డికి చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డికి విదేశాల్లో లిక్కర్ వ్యాపారాలకు బినామీగా ఉన్న జయచంద్రారెడ్డికి టిక్కెట్టు ఇవ్వవద్దని టిడిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేసినా చంద్రబాబు నాయుడు ఆయనకే టిక్కెట్టు ఇచ్చారన్నారు. పెద్దిరెడ్డి తమ్ముడి గెలుపు కోసమే ఆయనకు సీటు ఇచ్చి చంద్రబాబు పెద్దిరెడ్డికి సహకరించారన్నారు.
విద్యార్ధుల్లో నైతిక విలువలను పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించారని, విద్యార్ధుల కంటే ముందు టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు నైతిక విలువలు నేర్పించాలని రామచంద్రయాదవ్ సూచించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు నైతిక విలువలను మరిచి ప్రవర్తిస్తున్నారని వారికి చాగంటి వారి చేత నైతిక విలువల పాఠాలు చెప్పించాలన్నారు.