– అనంతరం అధికారులకు డిమాండ్ పత్రాల అందజేత
– నకిలీ మద్యం దందాపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే
– బాధ్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్
తాడేపల్లి: ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణ చేపట్టిన వైయస్సార్సీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నా నిర్వహించింది.
అనంతరం స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైయస్సార్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని చోట్లా పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పొల్గొన్నారు.
నకిలీ మద్యం గుట్టు తేల్చేందుకు వెంటనే రాష్ట్రంలో వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాప్ల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి, దీని వెనక ఎంత పెద్ద వారున్నా అరెస్టు చేయాలని.. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని.. నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
వైన్‌షాప్‌ల కేటాయింపులో జరిగిన అక్రమాలు గుర్తించి, అనర్హులను తొలగించాలని.. మద్యం షాప్‌లను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలని, మద్యం విక్రయ వేళలు కూడా తగ్గించాలని.. బడులు, గుడులు, పబ్లిక్ ప్లేస్ల్లో ఏర్పాటు చేసిన వైన్‌షాప్‌లు, బార్ల లైసెన్సులు రద్దు చేయమని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేసింది.