– సిట్ తో విచారణ జరిపించాలని ఎన్‌హెచ్చార్సీ చైర్మన్‌కి విజ్ఞప్తి
– అరకు ఎంపీ తనూజా రాణి నేతృత్వంలో చైర్మన్ ని కలిసిన వైయస్సార్సీపీ ప్రతినిధుల బృందం
– సానుకూలంగా స్పందించారన్న వైయస్సార్సీపీ నేతలు
– మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో హెపటైటిస్- ఏ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ తనూజా రాణి నేతృత్వంలో వైయస్సార్సీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది.
ఎన్‌హెచ్చార్సీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించాలని వారు కమిషన్ చైర్మన్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు అనంతరం వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందం మీడియాకు వెల్లడించింది.
ఎంపీ తనూజ రాణి ఆధ్వర్యంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్ప శ్రీవాణి, రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుభద్ర, ఇచ్ఛాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీ దివ్య, మన్యం-పార్వతీపురం జిల్లా వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు తదితరులు మానవ హక్కుల సంఘం చైర్మన్‌ని వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందంగా వెళ్ళి కలిశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గురుకుల పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.