• రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 34 పంచాయతీ, 234 వార్డు ఉపఎన్నికల్లో పోలీసులు, వాలంటీర్లు, డబ్బు, మద్యాన్నే నమ్ముకున్న అధికారాపార్టీ
• వైసీపీ దుశ్చర్యలు, పోలీసులు, వాలంటీర్ల ఓవరాక్షన్ పై ఎన్నికల కమిషన్ స్పందించదా?
-మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతున్న స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా అధికారపార్టీ నిస్సిగ్గుగా అధికార దుర్వినియో గానికి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యంలో ఎన్నిక లను అవహేళనగా, ఫార్స్ గా మార్చిన ప్రభుత్వతీరుతో పాలకులకు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని స్పష్టమైందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ రాష్ట్రవ్యాప్తంగా నేడు 34 పంచాయతీలు, 234 వార్డుల్లో ఉపఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికతోగానీ, వెలువడే ఫలితాలతో గానీ ఎవరికీ ఏమీ వచ్చేది లేదని తెలిసీకూడా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో, వైసీపీనేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో పోలీస్ వ్యవస్థను, వాలంటీర్లను వైసీపీ ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తోంది. ఈ చిన్నపాటి ఎన్నికలకే అధికారపార్టీ ఇలా వ్యవహరిస్తే, 7, 8 నెలల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
దెందులూరు నియోజకవర్గంలో వీరమ్మకుంట పంచాయతీ ఉపఎన్నిక జరుగుతుంటే, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లో కూర్చొని మరీ దగ్గరుండి తనపార్టీ వాళ్లతో రిగ్గింగ్ చేయిస్తున్నాడు. స్థానిక డీఎస్పీ తానే ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని స్వయంగా పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లడాన్ని ఏమనాలి? దెందులూరు టీడీపీ ఇన్ ఛార్జ్ చింతమ నేని ప్రభాకర్, మాపార్టీ కార్యకర్తల్ని ఆ దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు, ఎమ్మెల్యేని బూత్ లోకి అనుమతించడం ప్రజాస్వామ్య విరుద్ధంకాదా?
టీడీపీ ఎమ్మెల్యేని గృహనిర్బంధం చేసిన పోలీసులు, వైసీపీ ఎమ్మెల్యేని పోలింగ్ బూత్ లోకి ఎలా అనుమతించారు?
ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని పాకాల పంచాయతీ ఉపఎన్నిక జరుగుతుం టే, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిని గృహ నిర్బంధంలో పెట్టిన పోలీసులు అబ్బయ్యచౌదరిని పోలింగ్ బూత్ దగ్గర ఎలా కూర్చోబెట్టారు? టీడీపీ ఎమ్మె ల్యేని గ్రామంలోకి అడుగుపెట్టనివ్వని పోలీసులు, వైసీపీ ఎమ్మెల్యేని మాత్రం పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లడం సిగ్గుచేటు కాదా?
సాదాసీదా స్థానిక సంస్థల ఉపఎన్నికలో వైసీపీ ఇంతగా దిగజారితే రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ ఏంచేస్తున్నారు ? రిటైరయ్యాక తమకు రాజకీయ పునరావాసం కల్పిస్తున్నార న్న కారణంతో అఖిల భారత సర్వీసు రూల్స్ ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు, నిస్సిగ్గుగా జగన్ రెడ్డి ప్రాపకం కోసం పనిచేయడం బాధాకరం.
వాలంటీర్లు ఓటర్లను ప్రలోభపెడుతుంటే ఎన్నికల కమిషన్ స్పందించదా?
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో వాలంటీర్లు నేరుగా ఓటర్లను ప్రలోభపె డుతున్నారు. వారి నిర్వాకానికి సంబంధించిన ఫొటోలు ప్రసారమాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. (శ్వేత అనే వాలంటీర్ ఓటర్ తో మాట్లాడుతున్న ఫోటోను, కదిని నియోజ కవర్గంలోని భావనచెరువులో హరి అనే వాలంటీర్, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కోట కందుకూరులో ఫకృద్దీన్ అనే వాలంటీర్, పంచాయతీ ఓటర్లను ప్రలోభపెడుతున్న చిత్రాలను ఆనంద్ బాబు విలేకరులకు చూపించారు.)
ఈ విధంగా వాలంటీర్లు ఎన్నిక ల విధుల్లో పాల్గొని, అధికారపార్టీకి పనిచేస్తుంటే ఎన్నికల కమిషన్ స్పందించదా? వాలంటీర్లు ఎన్నికలవిధుల్లో పాల్గొనడానికి వీల్లేదని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పినా రాష్ట్ర ఎన్నికలసంఘం ఎందుకు చర్యలు తీసుకోదు? పోలీసులు, వాలంటీర్లతో డబ్బు, మద్యంతో పంచాయతీ ఓటర్లను ప్రలోభపెట్టి, మొక్కుబడిగా ఈ ఉపఎన్నికలు నిర్వ హించి గెలిచామని చెప్పుకోవడమే అధికారపార్టీ కుట్ర. ప్రజలు ఛీకొడుతున్నా కూడా తమపతనం కళ్లముందు కనిపిస్తున్నాకూడా, వైసీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ తో గెలుపు కోసం వెంపర్లాడుతోంది.
రెండేళ్లక్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లోకూడా ఇంతకంటే దారుణంగా వ్యవహరించి, తామే ఎక్కువస్థానాలు గెలిచామని వైసీపీ చంకలు గుద్దు కుంది. అధికారపార్టీ, జగన్ రెడ్డి పని అయిపోయిందని తెలిసీ పోలీస్ వ్యవస్థ ఇంకా ఊడిగం చేయడం బాధాకరం. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని నిర్ణయించుకున్నా పోలీస్ వ్యవస్థలో మార్పురాదా?
జరిగే ఉపఎన్నికల్లో కూడా చాలావరకు తామే గెలిచినట్టు వైసీపీ ప్రకటించేసుకుంది. అధికారమదంతో వ్యవస్థల్ని నొక్కిపెట్టి, త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలవచ్చని కలలు కంటున్న అధికారపార్టీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధిచెబుతారు.” అని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.