Suryaa.co.in

Andhra Pradesh

ఏ అర్హతలు లేని ధర్మారెడ్డిని ఎందుకు టీటీడీలో అంత అత్యున్నత స్థానంలో పెట్టారో జగన్ సమాధానమివ్వాలి

– కుమారుడు చనిపోయిన పది రోజులకే ఎవరైనా దేవాలయంలోకి అడుగు పెడతారా?
– ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు
– జగన్ జన్మతహా క్రైస్తవుడు, క్రైస్తవ ధర్మాన్నే పాటిస్తాడు
– దేవస్థానం డబ్బులతో స్వాములు ఢిల్లీ వెళ్లి దేవాలయ ధనం దుర్వినియోగం చేస్తున్నారు.
– రోజూ తిరుమల తిరుపతి ప్రసాదాలు ఢిల్లీకి పంపడంలో మతలబేంటో తెలియాలి
– కర్రలపై జగన్ బొమ్మలు వేసుకోవడం.. స్వామివారిని అవమానించడమే
-తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఏ అర్హతలు లేని ధర్మారెడ్డిని ఎందుకు టీటీడీలో అంత అత్యున్నత స్థానం(ఈవో)లో పెట్టారో జగన్ సమాధానమివ్వాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడిన మాటలు…

అత్యున్నతమైన హైందవ తిరుమల తిరుపతి దేవస్థానంపై చూపాల్సినంత ఆసక్తి ముఖ్యమంత్రి జగన్ చూపడంలేదు. తిరుమల విషయాలను ముఖ్యమంత్రి పదే పదే వివాదాస్పదం చేస్తున్నారు. జగన్ జన్మతహా క్రైస్తవుడు, క్రైస్తవ ధర్మాన్నే పాటిస్తాడు.. అయినా హిందుత్వాన్ని కూడా సమానంగా చూడాలి. వైవీ సుబ్బారెడ్డి భార్య చేతిలో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని, టీటీడీ ఛైర్మన్ కు వైవీ సుబ్బారెడ్డి తగడని భక్తులు ఎంత మొత్తుకున్నా జనాల మాటను జగన్ బేఖాతరు చేశారు.

ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, ‘‘నాది ఏ మతం కాద’’న్న అతనిని ఛైర్మన్ గా పెట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి రాడికల్. ఎమర్జెన్సీ లో అరెస్టైన అతన్ని ఛైర్మన్ గా చేసి భక్తులకు ఏం మెసేజ్ ఇవ్వదలచుకున్నారు?. హిందువుల ఆచారాల గురించి ధర్మారెడ్డికి పూర్తిగా తెలియవు. కుమారుడు చనిపోయిన పది రోజులకే ఎవరైనా దేవాలయంలోకి అడుగు పెడతారా? యేడాది వరకు ఆలయంలో అడుగు పెట్టరే! అయినా ధర్మారెడ్డి ఆలయంలోకి అడుగు పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ కు టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఉన్న అవినాభావ సంబంధమేంటో ప్రజలకు తెలియాలి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఆ కుటుంబ సేవల్లో పునీతుడవడంవల్లనే ధర్మారెడ్డికి ఆ పదవి దక్కిందనడంలో సందేహంలేదు. ధర్మారెడ్డి ప్రత్యేక సేవలు, ఆయన మేనిపులేషన్ నచ్చి ఈవోగా పదవి ఇచ్చారేమో! ముఖ్యమంత్రిగారు!! ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ తరపున ధర్మారెడ్డి పనిచేసేవారు, అందుకే పెద్దలకు తరచుగా టీటీడీ ప్రసాదాలు పంపేవారు. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో స్వాములు ఢిల్లీ వెళ్లి దేవాలయ ధనం దుర్వినియోగం చేస్తున్నారు.

రోజూ తిరుమల తిరుపతి ప్రసాదాలు ఢిల్లీకి పంపడంలో మతలబేంటో తెలియాలి. పీఠాధిపతులు, మత పెద్దలు వాస్తవాలు గ్రహించాలి.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడాలి. తిరుమలలో చిరుతల సంచార విషయంలో ఈఓ ధర్మారెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. భక్తుల భద్రతకు అని చెప్పి తిరుమల భక్తులకు ఇచ్చిన కర్రలపై జగన్ బొమ్మలు వేసుకోవడం.. స్వామివారిని అవమానించడమే. ఎర్రచందనం దొంగల ధాటికి చిరుతలు బయటికి వచ్చి అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. వీటన్నింటికి కారణం తిరుమల భద్రత లోపించడమే.

ఎంపీ రఘురామకృష్ణ రాజు కష్టోడియల్ టార్చర్ విషయంలో సికిందరాబాద్ మిలటరీ హాస్పిటల్ నందు ధర్మారెడ్డి ప్రభావితం చేశారని అంటున్నది నిజంకాదా? వివేకానందరెడ్డి హత్య తరువాత ఆయన కుమార్తె సునీతకు కేంద్ర ఎన్నికల కమిషనర్ వద్దకు, కేంద్ర హోంమంత్రి వద్దకు తీసుకొని వెళ్లింది ఈ ధర్మారెడ్డే. పాలనా పరంగా తగని టీటీడీ ఈవో, ఛైర్మన్ లను వెంటనే ఆ పదవుల నుండి తొలగించాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వివరించారు.

LEAVE A RESPONSE