Suryaa.co.in

Andhra Pradesh

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బోగస్ ఓట్లతో వైసీపీ అక్రమాలు

-విద్యార్హతలు లేని వారికి, ఇతర ప్రాంతాల వారికి తప్పుడు పత్రాలతో ఓట్లు
-బోగస్ ఓటు నమోదు చేసినా…ఓటు వేసినా శిక్షార్హులే
-పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీనేతలతో టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- రాష్ట్రంలో మూడు స్థానాలకు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు అలవాటు పడిన వైసీపీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా అక్రమాలకు తెరతీసిందని ఆయన అన్నారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వేల సంఖ్యలో బోగస్ ఓట్లను నమోదు చేయడం ద్వారా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసిపి కుట్రలు చేస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు బయట పడ్డాయని….పట్టభద్రులు కాని వారిని ఓటర్లుగా చేర్చడం, ఇతర ప్రాంతాల వారికీ ఈ ప్రాంతాల్లో ఓటు రాయించడం వంటి నీచమైన చర్యలకు వైసిపి పాల్పడుతుందని చంద్రబాబు అన్నారు. ఇలా దొంగ ఓట్లు చేర్పించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు…అర్హత లేకపోయినా తప్పుడు పత్రాలతో ఓట్లు పొంది ఓటు వేసే వాళ్లు కూడా శిక్షార్హులు అవుతారని చంద్రబాబు నాయుడు అన్నారు.

బోగస్ ఓట్లపై స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేయడంతో పాటు…కేంద్ర ఎన్నికల సంఘం వరుకు ఫిర్యాదులు పంపి చర్యలు కోరాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ నెల 13 తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లు, బాధ్యులతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ పక్క బోగస్ ఓట్లు…మరో పక్క ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ….వీటిని సమర్థవంతంగా అడ్డుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నం నీచమైన చర్య అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం ద్వారా తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు గెలిచే చూడాలని చంద్రబాబు నేతలకు సూచించారు. కొన్ని సందర్భాల్లో ఓటర్ల రెండో ప్రాధాన్య ఓటు కీలకంగా మారుతుందని….ఆ ఓటు టీడీపీ అభ్యర్థికే పడేలా చూడాలని చంద్రబాబు అన్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కారణంగా గ్రామ స్థాయి వరకు ప్రచారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.చిరంజీవి రావు, తూర్పు రాయల సీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయల సీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిల గెలపుకోసం పార్టీ నేతలు, ఇంచార్జ్ లు శక్తి వంచన లేకుండా పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

LEAVE A RESPONSE