-సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి ఫైర్
– దర్శి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మద్దిశెట్టి వ్యాఖ్యలు
– తాను ఎవరి పదవినీ లాక్కోలేదన్న వేణుగోపాల్
– అయినా తన సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ అవమానిస్తున్నారని ఆవేదన
– నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలూ తన వెంటే ఉన్నాయని వెల్లడి
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో మరోమారు విభేదాలు భగ్గుమన్నాయి.ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో దర్శి మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఇన్నాళ్లు తనలో దాచుకున్న అసంతృప్తిని ఎమ్మెల్యే మద్దిశెట్టి వెళ్లగక్కారు.ఇన్నాళ్లుగా సొంత పార్టీ నేతలు పెట్టిన ఇబ్బందులను భరిస్తూ వచ్చానని చెప్పిన మద్దిశెట్టి… ఇకపై వాటిని సహించేది లేదని చెప్పారు. పార్టీలో వర్గ పోరు తగదని ఆయన హెచ్చరించారు.
పార్టీ, నియోజకవర్గ ప్రజల కోసం మూడేళ్లుగా అన్నింటినీ భరిస్తూ వచ్చానని ఆయన చెప్పారు.నియోజకవర్గం కోసం ఇంతగా పనిచేస్తున్నా ఎన్నోసార్లు తనను అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రూపు రాజకీయాలు చేస్తూ కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత లబ్ధి కోసం కొందరు తన సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు సహా రెడ్లు కూడా తన వెంటనే ఉన్నారన్నారు. నియోజకవర్గ కేంద్రంలో తాను కట్టుకున్న ఇంటిపైనా కొందరు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరి పదవిని లాక్కోలేదని చెప్పిన మద్దిశెట్టి…అందరూ కోరితేనే ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు.