Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వారి అనుచరులే మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు

-పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దళితులపై దాడులను ప్రస్తావిస్తూ లేఖ రాసిన చంద్రబాబు నాయుడు
-తమ భూముల్లో అక్రమ తవ్వకాలపై పోరాటం చేస్తున్న దళితులపై దాడి చేసిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు
-ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ

లేఖలో పేర్కొన్న అంశాలు:-
• యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన దళితులు ఏనుగువానిలంక గ్రామంలో తమకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు.
• వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ తమ అనుచరుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు.
• ఈ తవ్వకాలను నిరసిస్తూ 6వ తేదీన చించినాడ దళితులు నిరసనలకు దిగితే పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు.
శాంతియుత నిరసనలకు దిగిన వారిపై పోలీసులు బలప్రయోగం చేసి గాయాల పాలుచేశారు.
• ఈ లాఠీ చార్జ్ లో గాయపడిన వారికి సత్వర వైద్యం అందిoచకపోగా పోలీసులు బాధితులను కులంపేరుతో దారుణంగా దూషించారు.
• తీవ్ర గాయాలు అయిన వారిని పోలీసులు సమీపంలోని పాలకొల్లు ఆసుపత్రికి తరలించకుండా, దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
• మెడికో లీగల్ కేసు గా వైద్యులు పోలీసులకు సమాచారం అందించినప్పటికీ, తీవ్ర గాయాలతో రక్తస్రావం అయిన బాధితుల నుండి పోలీసులు ఎటువంటి వాంగ్మూలం తీసుకోలేదు.
• రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఘటనపై మీరు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది
• శాంతియుతంగా ఆందోళన చేస్తున్న దళితులపై పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన అవసరం ఏంటి?
• నిరసన తెలుపుతున్న దళితులను పోలీసులు అక్రమంగా నిర్బంధించాల్సిన అవసరం ఏమిటి?
• సమీపంలో ఆసుపత్రులు అందుబాటులో ఉన్నప్పటికీ, గాయపడిన బాధితులను సంఘటన స్థలం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసువెళ్లాల్సిన అవసరం ఏమిటి?
• గాయపడిన బాధితుల నుంచి నిబంధనల ప్రకారం వాంగ్మూలం తీసుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారు?
• అక్రమ తవ్వకాలను ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోంది?
• ఈ ఘటనలో నిందితులను రక్షించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది?
• ఈ సందర్భంలో దళిత మహిళ రాపాక బొజ్జమ్మ ఛాతీపై పోలీసులు కాళ్లతో కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆమె అసుపత్రి పాలయ్యింది.
• పోలీసులు అధికార పార్టీ గూండాల్లా ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది.
• అక్రమ తవ్వకాలను అడ్డుకునే క్రమంలో 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మట్టిని తరలిస్తున్న 9 ట్రక్కులను స్థానికులు పట్టుకున్నారు.
• ఈ అక్రమ రవాణా పై పక్కా ఆధారాలు లభ్యమైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
• పైగా ప్రతి 10 మీటర్ల కు ఒక పోలీసును పెట్టి అక్రమ రవాణాకు సహాయం చేస్తున్నారు.
• పట్టపగలు జరుగుతున్న దోపిడీకి పోలీసులు అందిస్తున్న సహకారం పోలీసుల తీరును చాటి చెపుతోంది.
• నిబంధనలకు విరుద్దంగా గోదావరి నది నుండి 200 మీటర్ల పరిధిలో తవ్వకాలు జరుపుతున్నారు.
• భారీ రవాణా వాహనాలు నది గట్టుపై ప్రయాణించడం వల్ల రివర్ బండ్ దెబ్బతింటుంది.
• మట్టి అక్రమ రవాణా కోసం కొన్ని చోట్ల ఏకంగా గ్రావెల్ రోడ్లను నిర్మించారు. దీనిపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ధిక్కరించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
• పేదల ఇళ్ల నిర్మాణం కోసం మట్టి తరలింపు అని చెపుతున్నా….ఇక్కడ తవ్విన దాంట్లో 80 శాతం మట్టిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.
• గోదావరి నది ఒడ్డున విచక్షణారహితంగా మట్టిని తవ్వడం, భారీ వాహనాలు వెళ్లడం వల్ల నది గట్టు ధ్వంసమైంది.
• గట్టు విధ్వంసం వల్ల ఆకస్మిక వరద ముప్పుకు అవకాశం ఉంది.
• ఈ మొత్తం ఘటనలో దళితులను గాయపరిచి, దుర్భాషలాడిన సంబంధిత పోలీసు అధికారులపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలి
• అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలి.
• అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడాలి.

LEAVE A RESPONSE