Suryaa.co.in

Political News

సుపరిపాలన కోసం ఆరాటం

“నాయకుడు లేదా రాజు స్థానంలో ఉండేవారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలు తెలుసుకొని; అందరికి నచ్చే,అందరు మెచ్చే నిర్ణయాలు తీసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు సలహాలు,సూచనలను ప్రశాంతంగా వినే అలవాటు అలవర్చుకోవాలి.” – ఆచార్య చాణుక్యుడు

ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలు, అవసరాలు పునాదిగా, ప్రజాస్వామిక విలువలను కాపాడడంతో పాటు ప్రజా సంఘాలు, విపక్షాలు, ప్రశ్నించే గొంతులు, పౌరహక్కుల సంఘాలు మేధావులు బుద్ధి జీవుల సూచనలు మానవీయ కోణంలో పరిశీలించి పాటించ గలగాలి.

పాలకులకు ప్రజాస్వామ్య విలువల పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండాలి. నిర్బంధం, అణచివేత, నియంతృత్వం, నిరంకుశ పద్ధతి లేని, ప్రజాస్వామ్య విలువలను పాటించే విధంగా తాము ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఈ ప్రజాస్వామ్య మూల సూత్రాలను పాటించని ప్రభుత్వం ప్రజల మన్నన పొందదనేది సత్యం. “ఒక్క ఛాన్స్ ” ఇస్తే తన తండ్రి వై ఎస్ రాజశేఖర రెడ్డిని మరపించే అద్భుతమైన పాలన అందిస్తానని నాటి ప్రతిపక్ష నేత, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన రెడ్డి వాగ్దానాలను ప్రజలు నమ్మారు.

2019 ఎన్నికలలో 1,56,88,569 (49.95%) ఓట్లతో 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి, కేవలం ఐదేళ్లలో 11 సీట్లకే పరిమితమై చరిత్రలో మరెవ్వరు ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు. ఎనిమిది ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం లలో వైకాపా ఖాతా తెరవలేదు.

గత ఎన్నికలలో 52 సీట్లకు గాను 49 సీట్లు గెలుచుకున్న రాయలసీమలో ఏడు ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అయ్యారు. ఇరవై ఐదుగురు మంత్రులు ఓడిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు పెంచుకున్న నమ్మకం ఏమైంది? విశ్వాసం ఎందుకు పోయింది? కారణాలు ఏమిటి?

మాట తప్పి – మడుమ తిప్పి
అసలు జగన్ మోహనరెడ్డి ట్రేడ్ మార్క్ ఏంటి? మాట తప్పడు.. మడమ తిప్పడు అని. మాట ఇచ్చి తప్పడం నా విధానం కాదు కాబట్టి 2014 ఎన్నికలలో నష్టపోతానని తెలిసినా చేయలేని రైతు రుణమాఫీ హామీ ఇవ్వలేదని పదేపదే 2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాని అదే ఎన్నికల మానిఫెస్టోలో తాను హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, మధ్య నిషేధం. సిపిఎస్ రద్దుపై మాట తప్పారు. ఇవన్నీ కష్టసాధ్యమైన వైతే ఎన్నికల వేళ హామీ ఎందుకు ఇచ్చినట్లు?

ప్రభుత్వమే నాసిరకం మద్యం బ్రాండ్లను అధిక ధరలకు అమ్మడంతో సంపాదన మొత్తం మద్యం దుకాణం పాలై సామాన్యుని ఇల్లు,వళ్ళు కూడా గుల్లయిన పరిస్థితి. రాజధాని అమరావతి విషయంలో కూడా అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నా – చంద్రబాబు కంటే బాగా రాజధానిని అభివృద్ధి చేస్తా అని ఎన్నికల ప్రచారంలో చెప్పడం, అమరావతి అభివృద్ధిపై వైసీపీ బ్లూ ప్రింట్‌ను సాక్షి పేపర్లో రెండు పేజీలు పరచడం నిజం. ఇవన్నీ మాట తప్పడం – మడమ తిప్పడమే కదా.

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం 1,631 రోజులపాటు అక్కడి ప్రజలు, రైతులు చేసిన చారిత్రాత్మక ఉద్యమం వైకాపా ప్రభుత్వానికి ఎనలేని నష్టం కలిగించిందనేది కాదనలేని సత్యం. ఇక వివేకానంద రెడ్డి హత్య విషయంలో నేరస్తులను జగన్మోహన రెడ్డి రక్షిస్తున్నాడంటు సోదరిలు షర్మిల, సునీత చేసిన విమర్శలు బలంగా వెళ్లాయి. అత్యంత ముఖ్యమైన విషయాలలో జగన్మోహన రెడ్డి మాట తప్పడం వలన ప్రజల దృష్టిలో ఆయన ఇమేజి దెబ్బతింది.

పాలనపై ప్రజలలో ప్రతికూలత
ఎవరైనా పరిపాలన నిర్మాణాత్మ కంగా ప్రారంభిస్తారు. కానీ అద్భుతమైన విజయాన్ని అందుకున్న జగన్ మోహనరెడ్డి మొట్టమొదటి ప్రధాన నిర్ణయం ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదికను కూల్చేయడం. ప్రజా వేదిక విధ్వంసంతో మొదలైన పాలన ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం విధ్వంసంతో పరాకాష్టకు చేరింది.

పులిచింతల గేట్లు, అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం, దారుణమైన రహదారులు, పాలనాపరంగా జగన్మోహన రెడ్డి నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వ చేతకాని తనాన్ని తేటతెల్లం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మునిసిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలను సామరస్య పూర్వకంగా పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆయా వర్గాలలో వ్యతిరేకతను తెచ్చింది.

వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం జరిగినా దీనివల్ల అధికార పార్టీకి ప్రజలకు మధ్య ఉండే బంధం తెగిపోయింది, పార్టీ నాయకులు ప్రజలలో పట్టు కోల్పోయారు. ప్రజలు స్వేచ్ఛగా తమ భావాలను వెలిబుచ్చే హక్కును ప్రజా ప్రతినిధులు, స్థానిక వైసిపి నాయకులు వమ్ముచేసారు. ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా తమ రాజకీయ, సామాజిక సంబంధాలు అధికార పక్షానికి తెలుస్తుందేమోననే భయం సామాన్య ప్రజలను వెంటాడింది.

రోత విమర్శలు .. హద్దులు లేని అణచివేత
రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ వైకాపా విషయంలో ఎవరైనా విమర్శ చేస్తే మంత్రుల స్థాయి నుండి సోషల్ మీడియా కార్యకర్తల వరకు దారుణంగా దూషించడం చేశారు. సిఐడి వ్యవస్థను ప్రైవేటు సైన్యంలా వాడుకుని సోషల్ మీడియాలో చిన్న వ్యతిరేక పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేశారు. బయట పడిన కొందరు మంత్రుల సంభాషణలు, ఎంపి గోరంట్ల మాధవ్ వీడియో, వైకాపా ప్రజాప్రతినిధుల భాష, అహంకార ధోరణి ప్రజలకు సహించలేదు.

ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులే లక్ష్యంగా అసహ్యకరమైన దూషణలు చేశారు. తెలుగుదేశం, జనసేన లను లక్ష్యంగా చేసుకుని కొన్ని సామాజికవర్గాలపై చేసిన అనైతిక విమర్శలు ఆయా సామాజిక వర్గాలు ఏకతాటిపై నిలచి తనపై పోరాడే పరిస్థితి తెచ్చుకోవడం జగన్ స్వయంకృతం.

బాడీ షేమింగ్, వ్యక్తిత్వ హననం చాలా సామాన్యమైన విషయాల్లా మార్చేశారు. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే జగన్ తో విబేధించినందుకు ఆయన సొంత చెల్లిని దారుణంగా వేధించారు. అలాంటి మాటలు, పోస్టులను మామూలు జనం కూడా అసహ్యించుకున్నారు.

చంద్రబాబు అరెస్ట్ .. ఆత్మహత్యా సదృశం
ఎన్నికలకు కేవలం 8 నెలల ముందు అంటే.. 2023 సెప్టెంబర్ లో అవినీతి ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం నాటి ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశ్యంగా మారింది. అరెస్టును ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుగానే ప్రజలు పరిగణించారు. అప్పటికప్పుడు ఆయనకు నేరుగా సంఘీభావం ప్రకటించనప్పటికీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అండగా నిలవడం ద్వారా తమ మద్దతు పలికారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు అండగా నిలవడం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబును కలిశాక పవన్ చేసిన ప్రకటన, తరువాత భాజపాని కలుపుకుని ఎన్డీయేలో చేరడంతో రాష్ట్ర ప్రజల అలోచన కూడా పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే స్ధిరమైన కూటమి, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయకత్వం, ప్రజల పక్షాన నిలబడే పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటాయి అనే సంకేతాలు ప్రజల లోకి బలంగా వెళ్ళాయో, ఇక అక్కడ నుంచి ఒక నిశ్శబ్ద ప్రజాస్వామ్యయుత విప్లవ విస్పోటనం జరిగింది.

గట్టెక్కించని వెల్ఫేర్ మోడల్:
రాష్ట్రంలోని 1.65 కోట్ల కుటుంబాల్లో 1.35 కోట్ల కుటుంబాలకు సంక్షేమం అందించాము, వారే మా స్టార్ క్యాంపైనర్లు అన్న వైయస్ జగన్ కేవలం నవరత్న పథకాలను మాత్రమే నమ్ముకొని అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యత సాధించడంలో విఫలమయ్యారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధిపై ఏమాత్రం దృష్టిపెట్ట లేదన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. సంక్షేమ లబ్ధిదారులకు తప్ప మిగిలిన వర్గాలకు ఈ ప్రభుత్వం ఏమి చేసింది అని ప్రశ్నించే అవకాశం ఇచ్చారు.

అదే సమయంలో ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు, మధ్యం ధరల వలన సామాన్యునిపై మోయలేని భారం పడింది. నాడు-నేడు, గ్రామాలలో మౌళిక సదుపాయాల కల్పన, మెడికల్ కాలేజీలు, పోర్టులు నిర్మిస్తున్నా ప్రచారం చేసుకోలేక పోయారు. వృద్ధులకు పెన్షన్ల పంపిణీని స్వాగతించిన యువత అదే సమయంలో తమ ఉద్యోగాలు, భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించుకున్నారు. ఈ విషయంలో కూటమి పార్టీలు న్యాయం చేస్తాయన్న ఉద్దేశంతో ఎన్డీయేకి పట్టంకట్టారు.

ల్యాండ్ టైటిలింగ్ చట్టం:
వైఎస్సార్‌సీపీకి ఎన్నికల్లో బాగా డ్యామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంటుందని ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాయి.

ఎన్నికల సమయంలో సీఎం జగన్ సతీమణి పులివెందులలో ప్రచారం నిర్వహిస్తుండగా స్వంత పార్టీ నాయకుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ గురించి ఆమెను ప్రశ్నించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అయ్యి వైఎస్సార్‌సీపీకి మైనస్ అయ్యింది. కూటమి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలం కాగా, వైఎస్సార్‌సీపీ సరిగా వివరణ కూడా ఇవ్వలేకపోయింది.

విపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వివిధ పర్యటనల ద్వారా ప్రజలతో మమేకం కాగా, ప్రతిపక్షములో ఉన్నప్పుడు నిరంతరం ప్రజలకు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉన్న వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు, పార్టీ నాయకులకు పూర్తిగా దూరం అయ్యారు. వ్యూహకర్తలను, సలహాదారులను, వాలంటీర్ వ్యవస్థను నమ్ముకుని పార్టీ పటిష్టతపై దృష్టి సారించకుండా నిర్వీర్యం చేయడం ఎన్నికల సమయంలో కార్యకర్తల నిర్లిప్త ధోరణికి దోహద పడింది.

ఇన్ని వ్యతిరేకతల మధ్యలో కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.37 శాతం ఓట్లు రావడం గమనార్హం. 2019లో ఓటమి పాలైనప్పుడు కూడా టిడిపి 39.17 శాతం ఓట్లు సాధించింది. అంటే ప్రభుత్వ పనితీరును బట్టి స్పందిస్తున్న షుమారు 15 శాతం మంది తటస్థ ఓటర్లు గెలుపోటములలో కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రజాస్వామ్య పాలన చేయకపోతే గద్దె దింపుతామని హెచ్చరిస్తున్నారు. దీన్ని గమనించుకుని సరిదిద్దుకోవడం విజ్ఞుల లక్షణం.

– లింగమనేని శివరామ ప్రసాద్
7971320543

LEAVE A RESPONSE