Suryaa.co.in

Editorial

అవును.. మోదీని జగనన్న నిలదీసిండు!

( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రధాని మోదీ-ఏపీ సీఎం జగన్ భేటీలో ఏం జరిగింది? సీఎం జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడిండా? లేదా? చెప్పాలన్నది టీడీపీ ఎంపీ కమ్ లాయర్‌సాబ్ కనకమేడల రవీంద్ర డిమాండ్. ఒక్క రవీంద్రన్నే
kanakamedala-ravindra-mp కాదు, చాలామంది తెలుగు తమ్ముళ్లు, కాంగ్రెస్-కమ్యూనిస్టులూ ఇదే పాట పాడుతున్నారు.

ఈ డిమాండ్లు వింటుంటే వైసీపేయులు, జగనన్న వీరాభిమానుల రక్తం సలసల కరిగిపోతాంది. అసలు జగనన్న గురించి ఏం తెలుసని మండిపడుతున్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం తెలియని జగనన్న ప్రధానికి భయపడతారా ఏంటని గుడ్లురుముతున్నారు.

యస్.. ఢిల్లీ వెళ్లిన జగనన్న, మోదీని నిలదీసిండు. అట్లిట్ల కాదు. మా ప్రత్యేక హోదా సంగతి ఏం చేసినారు? వచ్చినప్పుడల్లా చెప్తా ఉండా. ఇంకయినా చేచ్చావా.. లేదా? ఆ పొద్దు మీరు తిరుపతిలో మాటిచ్చినరా లేదా? అని కళెర్ర చేసిండు. మా సీమజనమయితే మాట తప్పం, మడమ తిప్పమప్పా. హోదా ఇవ్వకుండా లెక్క ఇస్తే ఏం సరిపోతాదీ? అది హోదాకు సమానమా ఏంది సామి? ఆ యప్ప.. అదే ఆ చంద్రబాబు, వాళ్ల ఎంపీలు నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా హోదా సంగతేందని చతుర్లాడుతున్నారప్పా. వాళ్లు కుషాల్ చేచ్చా ఉంటే నాకు రక్తం మరుగుతాంది సామీ అని జగనన్న మోదీ భయ్యాపై ఫైరయిండు.

ఇట్లకాదు. హోదా ఇచ్చావా? లేదా? నాకు ఇప్పుడే తెలియాల. ప్యాకేజీలు అవన్నీ నాకు తెల్దు. హోదా సంగతి తేలా దాకా ఢిల్లీకి చమటలు పట్టిచ్చా చూడు. అది ఇచ్చే వరకూ మా సీమజనమంతా ఈడ్నే ఉంటారు. ఆ తర్వాత మీ ఇష్టం సామీ. మీరు అడక్కుండనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతునిచ్చినా. లోక్‌సభ-రాజ్యసభలో అన్నింటికీ మద్దతునిస్తూనే ఉండ్న. మీరు ఏది కావాలంటే అన్నీ ఇస్తూనే ఉండ్న. కానీ ఈ పొద్దు మాత్రం హోదాను తేల్చాల్సిందే.

అంతేనా. ఆ విశాఖ స్టీల్‌ప్లాంట్ సంగతేదో తేల్చాలి. వైజాగ్ పోవాలంటేనే అదో మాదిరిగా ఉంది. మీ పార్టీని సపోర్టు చేసే ఆ పవన్ కల్యాణ్ మమ్మల్ని బద్నామ్ చేస్తున్నాడు. ఇంకా.. ఆ విభజన హామీలేవీ మీరింకా తేల్చలేదు. అది కూడా ఈ పొద్దు తేల్చాల్సిందే. ఇంక ఆ రఘురామకృష్ణంరాజుకు మీరు, మీ మంత్రులు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్‌మెంట్లు ఇస్తుండం ఏం బాగోలేదు సామీ. ఆయనపై మా వాళ్లు ఇచ్చిన పిటిషన్ సంగతి కూడా తేల్చాలి సామీ. ఆయన మీ పార్టీలో చేరతానంటే మీరెట్లా చేర్చుకుంటారూ అంట? మీరేమైనా చేయండి సామీ. నాకీ పొద్దు అన్నీ తేల్చాల్సిందేనని జగన్ అనర్గళంగా, ఆవేశంగా మోదీపై ఆగ్రహావేశం వ్యక్తం చేశారు. లేకపోతే చూసుకుందాము నీ పెతాపమూ.. నా పెతాపమూ!

నాన్‌స్టాప్‌గా ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేయాలని అగ్గిరాముడయిన జగనన్నను చూసి మోదీ భయపడిపోయారు. హోదా ఇవ్వకపోతే ఏం చేస్తాడోనని బెదిరిపోయారు. ఏసీ 16లో పెట్టినా చెమటలు ఆగడం లేదు. మీదకప్పుకున్న శాలువ పక్కనపడేశారు. అక్కడున్న గ్లాసు నీళ్లు తాగేశారు. జగ్గు నీళ్లూ సరిపోలేదు. గటగట తాగేశారు. కొద్దిసేపు మౌనం తర్వాత.. ‘కొద్దిగా టైమివ్వు రెడ్డీ.. అన్నీ చేచ్చా. క్యాబినెట్‌లో ఓ తూరి మాట్లాడి, మంచిసెబ్బర్లు మాట్లాడుకోవాలి కదా’ అని చిన్న గొంతుతో దూరం నుంచే చెప్పే ప్రయత్నం చేశారు.

అంతే.. జగనన్న అగ్గిరాముడయ్యారు. ఇప్పటిదాకా జగన్‌లో మీరంతా మంచినే చూశారు. మూడేళ్లయినాది. ఇక తగ్గేదే లే. కేసీఆర్ ఢిల్లీలో అగ్గిపుట్టిస్తానన్నడు. నేనట్ల కాదు. సీమ సంగతి తెల్సుగా. నా ఎంపీలతో భూకంపం సృష్టిస్తా. సోనియాకే భయపడలేదు. నేనెవరికీ భయపడను. కేసులకు అసలు భయపడను. నా ప్రజల కోసం ఏమైనా చేస్తానంటూ కళ్లెర్ర చేసిన జగన్నను చూసి, మోదీ భయ్యా హడలిపోయారు.

‘చూడప్పా రెడ్డీ. చిన్న వయసులో ఇంత కోపం పనికిరాదు. నేనుండాగా. నే జూచ్చాలే పో. నీ సర్కారు కష్టాల్లో ఉన్నపుడల్లా ఏదో ఒక విధంగా ఖజాన నింపుతున్నానా లేదా? నీ లెక్క నీకు ఆగినాదా ఏమీ? తెలంగాణ కన్నా నీకే ఎక్కువ ఇచ్చా ఉంటినే’ అనడంతో, జగన్ కొంచెం తగ్గాల్సి వచ్చింది. సరే ఎలాగూ వచ్చాము కదా అని వెంకటేశ్వరస్వామి విగ్రహం, శాలువా కప్పి, వెళ్లేముందు.. ‘గుర్తుందిగా సామీ.. మా ఖర్మానికి మీకు ఎవరి సపోర్టు లేకుండానే గెలిచారు. అందుకే హోదా ఇవ్వకపోతే ఇట్లా ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటా. యాదుంచుకోమని’ జగనన్న అక్కడి నుంచి నిష్క్రమించారు.

ఆ తర్వాత నిర్మలాసీతారామన్, గడ్కరీలనూ జగనన్న అదే రేంజ్‌లో నిలదీయడంతో వారందరికీ అంత చలిలోనూ చమటలు పట్టాయి. మరి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి న్యాయం చేయమని నిర్మొహమాటంగా నిలదీసిన జగనన్నను పట్టుకుని.. రాష్ట్రం గురించి ఏమడిగారని విమర్శిస్తారా? మీకెన్ని గుండెలు? అసలు మీది గుండెనా? చెరువా?

LEAVE A RESPONSE