Suryaa.co.in

Andhra Pradesh

సెంట్రల్ లో ఘనంగా `వైఎస్ఆర్ ఆసరా’ సంబరాలు

మహిళ పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
మహిళ సాధికారత దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. సెంట్రల్ లో నియోజకవర్గంలో `వైయ‌స్సార్ ఆసరా’ సంబరాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. 1, 26 డివిజన్ లకు సంబంధించి గుణ‌ద‌లలో జ‌రిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయ‌ర్ అవుతు శ్రీశైల‌జారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీత సురేష్ తో కలిసి ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్రహానికి పూల‌మాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంత‌రం సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లాది విష్ణు  మాట్లాడుతూ.. మహిళ సంఘాల అభ్యున్నతికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు పరుస్తోందన్నారు. టీడీపీ హయాంలో మహిళ సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కూడా ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయన్నారు.
2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ భేషరతుగా మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. మహిళలను నిండా మోసగించారని గుర్తు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రధాన ధ్యేయంగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళ సంఘాలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను దశలవారీగా చెల్లిస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 3,415 గ్రూపులకు రూ. 29 కోట్ల 52 లక్షల 7వేల 991 రూపాయలు అందించినట్లు వివరించారు. ఒకటవ డివిజన్ కు సంబంధించి 228 డ్వాక్రా గ్రూపులకు గాను 1 కోటి 66 లక్షల 32వేల 876 రూపాయలు, 26వ డివిజన్ కు సంబంధించి 91 గ్రూపులకు గాను రూ. 70 లక్షల 27 వేల 732 రూపాయలు పొదుపు సంఘాల మహిళలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు.

మహిళల అభ్యున్నతికి పెద్దపీట

మహిళా పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  దేశానికే ఆదర్శంగా నిలిచారని మల్లాది విష్ణు  అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు పెద్దపీట వేశారన్నారు. అమ్మఒడి పథకం నుంచి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల పేరిటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తూ.. ఇటీవల పోషకాహార మాసోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. మరోవైపు నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకే దక్కేలా ఏకంగా చట్టం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన పొదుపు సంఘాల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తూ.. డ్వాక్రా రుణాల మంజూరు, సున్నావడ్డీ, చేతి వృత్తులకు సంబంధించి రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రతి అక్కచెల్లెమ్మ వారి కాళ్లపై వారు నిలబడేలా ఐటీసీ, రిలయన్స్, అమూల్‌ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేస్తూ వ్యాపార మార్గాలను చూపించడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ జీవనోపాధులు పెంపొందించుకోవాలని డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సూచించారు.

పది రోజుల పాటు పంపిణీ

సెంట్రల్ నియోజకవర్గంలోని 34,150 మంది మహిళలకు రూ.29.52 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చే ఇంత పెద్ద కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ప్రతి డివిజన్ లోనూ రోజుకు కొన్ని గ్రూపుల చొప్పున పది రోజుల పాటు నిర్వహించే సంబరాలపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పొదుపు సంఘాల మహిళలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరీముఖ్యంగా ఆర్.పి.లపై ఉందన్నారు.
డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని గత తెలుగుదేశం ప్రభుత్వం మహిళలను మోసగించిందని మండిపడ్డారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పసుపు – కుంకుమ కార్యక్రమాల పేరిట మహిళలను మభ్యపెట్టే కార్యక్రమాలను చేపట్టారన్నారు. చివరకు పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద కూడా రుణాలను ఇవ్వడాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తుచేశారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికి రెండు విడతలుగా రుణాలను మాఫీ చేయడం జరిగిందని అవుతు శైలజారెడ్డి అన్నారు.
స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీత మాట్లాడుతూ.. మ‌హిళ‌ల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి మ‌హిళ సెల్‌ఫోన్‌లో దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని.. ఆ విధంగా మ‌హిళా పోలీసులు యాప్ పై విస్తృత ప్రచారం నిర్వహించాల‌ని కోరారు. అనంతరం 3,110 స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన 27 కోట్ల 96 లక్షల 82 వేల 329 రూపాయల మెగా చెక్కును ఎమ్మెల్యే  మహిళలకు అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ న‌గ‌ర అధ్యక్షులు బొప్పన భ‌వ‌కుమార్, కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, ఉమ్మడి రమాదేవి, కొంగితల లక్ష్మీపతి, జానారెడ్డి, కో-ఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిల్లి క్రిష్ణవేణి, వైఎస్సార్ సీపీ నాయకులు అంగిరేకుల గొల్లభామ, గుండె సుందర్ పాల్, ఉమ్మడి వెంకట్రావు, అలంపూర్ విజయ్, కొండా మహేశ్వరరెడ్డి, బండి వేణు, కనకారావు, ఎల్.ఐ.సి. శివ, ఝాన్సీ, వీఎంసీ అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE