సెంట్రల్ లో రూ. 80 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగనన్న పాలన: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పాలన సాగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో శుక్రవారం రూ. 80.15 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కరీమున్సీసా, డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గలతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. తొలుత 61 వ డివిజన్ శాంతినగర్లోని 257 వార్డు సచివాలయ ప్రాంగణంలో రూ. 28.15 లక్షలతో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా ఎక్కడా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించలేదన్నారు. ఒక వైపు సంక్షేమ‌ కార్యక్రమాలు అమలు చేస్తూనే.. మరోవైపు అభివృద్ధిని పరుగులు పెడుతూ పెద్ద‌ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు విజయవాడ నగర అభివృద్ధికి ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచుకుతిన్నారన్నారు. కానీ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణతో పాలనను సులభతరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు సచివాలయ వ్యవస్థను కేంద్ర బిందువుగా మార్చారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, అలంపూర్ విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకులు మోదుగుల గణేష్, భోగాది మురళి, అలంపూర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
పాతపాడులో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
నియోజకవర్గంలోని చిట్టచివరి ప్రాంతం వరకు అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ పాతపాడులో రూ. 15 లక్షలతో కర్మల భవన్, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ. 37 లక్షలతో ఫోన్ లేన్ రోడ్ క్రాసింగ్ బాక్స్ కల్వర్ట్ నిర్మాణానికి ఎమ్మెల్సీ కరీమున్సీసా, డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గలతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పాతపాడు, కుందవారి కండ్రిక, పి.నైనవరం, జక్కంపూడి, అంబాపురం రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చెరువులలో నీరు నింపుకొనుటకు ఈ కల్వర్టు నిర్మాణం దోహదపడుతుందన్నారు. 157.750 కి.మీ. వద్ద పోలవరం ప్రధాన కాలువపై 4 లైన్ కల్వర్టు నిర్మించుట ద్వారా ఆయా గ్రామాలలో 2,450 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. మరోవైపు పాతపాడులో 137 చదరపు గజాల విస్తీర్ణంలో కర్మల భవన నిర్మాణం చేపడుతున్నట్లు మల్లాది విష్ణు  వివరించారు. స్థానిక ప్రజలు సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు, అనంతరం జరిగే పూజ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు యర్రగొర్ర తిరుపతమ్మ శ్రీరాములు, జానారెడ్డి, నాయకులు మోదుగుల గణేష్, భోగాది మురళి, అలంపూర్ విజయ్, జిల్లేల్ల శివ, దేవిరెడ్డి సాంబిరెడ్డి, పిన్నిబోయిన కృష్ణ, పాదం వెంకటేశ్వరరావు, వీరయ్య గౌడ, అధికారులు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply