హైదరాబాద్: వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే గుడివాడ వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఆయనను పరామర్శించేందుకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి బయలుదేరారు.
మంగళవారం రాత్రి ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు కొన్ని పరీక్షలు పూర్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్లర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశముంది. గత రెండు రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు కిడ్నీ సమస్య ఉన్నట్లు సమాచారం.
కాగా రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో కొన్నాళ్లుగా కొడాలి నాని యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు ముందుడే ఆయన.. సరిగా కనిపించడంలేదు. ఇక సోషల్ మీడియాలో ఆయన అనారోగ్య కారణలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు హార్ట్ఎటాక్ రావడం అటు పార్టీ శ్రేణుల్లో.. ఇటు కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంది. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన కొడాలి నాని.. రెండేళ్ల కిందటే అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు.
ఆ తరువాత కోలుకున్నారు. జగన్ వద్ద సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని తన వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారారు. టీడీపీ, చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలతో ఆయన తీరు వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొడాలి నాని పైన చర్యలు తీసుకోవాలని టీడీపీ మద్దతు దారులు డిమాండ్ చేసారు. కొడాలి నాని అనుచరుల పైన కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ ఇప్పటికే జైలులో ఉన్నారు.
రాజకీయంగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ క్రమంలో కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావటంతో ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. గ్యాస్ సంబంధిత సమస్యలని చెబుతున్నా.. పూర్తి పరీక్షల తరువాత నిర్దారిస్తామని చెబుతున్న వైద్యులు.. పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు.