Suryaa.co.in

Political News

యువగళం-నవశకం

అధైర్యాన్ని పొందడం ధీరుల ల‌క్ష‌ణం కాదు. హృద‌య దౌర్భ‌ల్యం మ‌న శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను స‌న్న‌గిల్లేలా చేస్తుంది. కాబ‌ట్టి దాన్ని వ‌దిలేయాలి .. ఇదే శ్రీకృష్ణ పరమాత్ముని గీతాబోధ. అవహేళనలను ఆత్మ విశ్వాసం గా, దుర్భాషణలను ఆశీస్సులుగా, ఇబ్బందులను ఇష్టాలుగా మలచు కోవడం, కష్టాలను సంకల్ప బలంతో అధిగమించడం ధీరుల లక్షణం.

అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించి, అక్కడే చేస్తున్న సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదలి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ఒక ఆగర్భ శ్రీమంతుడైన, కష్టమంటే ఏమిటో తెలియని యువకుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనలో దగా పడుతున్న ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి భరోసా కలిపించాలనే లక్ష్యంతో “యువ గళం” పాదయాత్ర మొదలు పెట్టినపుడు అధికార పక్షం నుండి ఎదురుక్కున్న హేళనలు అంతా ఇంతా కాదు. స్వపక్షంలో కూడా అనేక మందిలో ప్రశ్నలు, సందేహాలు!

కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ, అవరోధాలను అధిగమిస్తూ, ప్రభుత్వ దాష్టికాలను ధీటుగా ఎదురుక్కుంటూ ఈ ఏడాది జనవరి 27 వ తేదీన కుప్పం శ్రీ వరదరాజ స్వామి ఆశీస్సులతో ప్రారంభమైన ఒక ధీరుని యువ గళం పాదయాత్ర 226 రోజుల పాటు కొనసాగి డిసెంబర్ 18 వ తేదీన 3,132 కి.మీ చేరుకొని విశాఖపట్నం, అగనంపూడి వద్ద శివాజీ నగర్ లో, గతంలో చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం” పాదయాత్ర ముగిసిన ప్రదేశంలో పూర్తి అయ్యింది.

రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు .. మునిసిపాలిటీలు, 2094 గ్రామాల షుమారు కోటిన్నర మంది ప్రజల మంచి చెడులు తెలుసుకుంటూ, వారి ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ, అరాచక పాలనలో సమిధలుగా మారిన ప్రజానీకానికి భవిష్యత్ భరోసా కల్పించగలిగారు లోకేష్. పాదయాత్ర చేపట్టిన ప్రతి వంద కి.మీ మజిలీలో తెలుగుదేశం పార్టీ తరఫున తానిచ్చిన ఒక హామీని పొందుపరచిన ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించి హామీలు నీటి మూటలు కావని, ఇచ్చిన హామీలకు పార్టీ కట్టుబడి ఉంటుందన్న నమ్మకం ప్రజలకు కల్పించడంలో కృతకృత్యులయ్యారు లోకేష్.

ఢీ అంటే ఢీ అన్న యువనేత
లోకేష్ పాదయాత్రపై జగన్మోహన రెడ్డి నాయకత్వంలో వై కా పా నాయకులు పైకి అవహేళనగా మాట్లాడినా, పాదయాత్ర సవ్యంగా జరుగకుండా చేయడానికి చేయని ప్రయత్నం లేదు, అవలంభించని అడ్డదారులు లేవు, కల్పించని అవాంతరాలు లేవు. ఒక్క అడుగు వేయలేడన్నారు, ఒక్క రోజు నడవలేడని ఎగతాళి చేశారు. పాదయాత్ర ప్రారంభ కావడానికి ముందే జీవో నెం,1 తెచ్చి పాదయాత్రను నియంత్రించాలని చూసింది ప్రభుత్వం. పాదయాత్ర ప్రారంభంలో లోకేష్ వాహనం, మైక్, సౌండ్ బాక్స్ ఆఖరుకు ప్రసంగించ డానికి ఎక్కిన స్టూల్ ను సైతం పోలీసులు సీజ్ చేశారు. పాదయాత్ర సమయంలో విద్యుత్ సరఫరా ఆపేసారు.

రాయలసీమలో కుప్పంలో యువగళం ప్రారంభం అయినప్పటి నుండి తంబళ్లపల్లి వరకు పోలీసులచే 25 కేసులు నమోదు చేయించింది జగన్ ప్రభుత్వం. అయితే ఒక్క విషయం మరచారు భీరువు మాత్రమే అణచివేతకు లొంగుతాడని, ధీరుడెప్పుడు పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో అవరోధాలను అధిగమించి ముళ్లబాటను కూడా పూల బాటగా మలచుకోగలడని. ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా, ఎన్ని అవరోధాలు కలిగించినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగింది లోకేష్ యువగళం. పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ గమనించి ఉలిక్కిపడిన వైసిపి నాయకులు ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రపై రాక్షసంగా దాడులకు తెగబడ్డారు. అయితే ” అనుమతిస్తే పాదయాత్ర .. లేదంటే దండయాత్ర” అంటూ లోకేష్ చేసిన సింహ గర్జన జగన్ ప్రభుత్వ అరాచక, క్రూర పాలనను ధిక్కరించడమే కాకుండా, తెలుగుదేశం శ్రేణులలో, ప్రజాస్వామ్య వాదులలో ఆత్మస్థయిర్యాన్ని నింపింది.

కాలం చెల్లిన వలసవాద చట్టాలను అమలు చేస్తూ, అమానుష చర్యలతో రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చిన జగన్మోహన రెడ్డి అప్రజాస్వామిక విధానాలను ధీటుగా, ధైర్యంగా ఎదుర్కొగలిగిన యువ సంకల్పాన్ని లోకేష్ లో గమనించారు దగాపడ్డ ప్రజలు. అంతే యువ గళం ప్రారంభించిన 45 రోజుల తర్వాత ఇది పీడిత ప్రజలకు భరోసా ఇచ్ఛే జనగళం గా మారింది. ప్రతి అడుగు జన హృదయాలను స్పృశించింది, ప్రతి మాట ప్రజల గుండె చప్పుడయింది, జన ప్రభంజనం వెల్లువెత్తింది.

48 డిగ్రీల మండుటెండలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కి.మీ రాయలసీమలో పాదయాత్ర చేసిన లోకేష్ తనపై ఎంతో అభిమానం చూపిన రాయలసీమ ప్రజల కస్టాలు తీర్చడానికి, ప్రాంతం వెనుకుబాటు తనాన్ని రూపుమాపడానికి కడపలో మేధావులు, ప్రజల సమక్షంలో “మిషన్ రాయలసీమ” ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తరువాత హామీ ఇచ్చిన విధంగా “మిషన్ రాయలసీమ” ద్వారా రాయలసీమను అభివృద్ధి చేస్తామని విస్పష్టమైన ప్రకటన చేశారు. యువనేత వజ్ర సంకల్పానికి ప్రజలు అండగా నిలిచారు. ధీరుడి పోరాటం ముందు ప్రభుత్వం తలవంచింది, ‘యువగళం ప్రజాగళం’ అయ్యింది.

సెల్ఫీ ఛాలెంజ్ తో గుట్టురట్టు
వినూత్న పంధాలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని, జగన్ పాలనలో జరుగుతున్న విధ్వంసాన్ని సెల్ఫీలు తాసి మరీ జగన్మోహన రెడ్డికి, ప్రభుత్వానికి లోకేష్ ఛాలెంజ్ విసిరిన తీరు అద్భుతం. చర్చకు తావు లేకుండా ఫోటోల ద్వారా వాస్తవ స్థితిని ప్రజలకు తెలియ చేస్తూ చేసిన సెల్ఫీ ఛాలెంజ్ లకు బదులు ఇవ్వలేని పరిస్థితిలోకి వైసిపి వారిని నెట్టగలిగారు.

నాయకత్వ సంక్షోభంలో అన్నీ తానై ..
తనను కలిసేందుకు వస్తున్న అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ, వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ, సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ జనజీవనం ఇంతగా సంక్షుభితం కావడానికి జగన్ అసమర్ధ, అరాచక పరిపాలనే కారణమని అర్ధవంతంగా ప్రజలకు వివరించడంలో, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచడంలో సఫలీకృతులయ్యారు. అదే సమయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించడం వైసిపి కి అశనిపాతంగా మారింది. ఒక పక్క యువగళం, మరో పక్క చంద్రబాబు భవిష్యత్ భరోసా బస్సు యాత్ర, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ వారాహి యాత్రల ముప్పేట దాడిలో ఉక్కిరిబిక్కిరైన జగన్ ఒక పెద్ద కుట్రకు తెరలేపారు.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా క్షేత్రంలోకి వెళ్లకుండా చేయడం కోసం సెప్టెంబర్ 9వ తేదీన నిరాధారమైన స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఆరోపణలతో నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయించి తెలుగుదేశం పార్టీలో కనీవినీ ఎరుగని అతిపెద్ద నాయకత్వ సంక్షోభాన్ని సృష్టించారు. అటువంటి క్లిష్ట తరుణంలో న్యాయపోరాటం ద్వారా తన నేతకు అండగా నిలవడానికి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి అప్పటికే 208 రోజులుగా చేస్తున్న 2818.4 కిమీ యువ గళం పాదయాత్రకు విరామం ప్రకటించి కార్యక్షేత్రం లోకి దూకారు లోకేష్.

ఆధారాలు లేకుండా, అక్రమంగా జాతీయ స్థాయి కలిగిన చంద్రబాబు లాంటి నాయకుని అక్రమ కేసులతో అరెస్టు చేసిన విధానాన్ని, రాజ్యాంగ హక్కుల హననాన్ని, ప్రభుత్వ టెర్రరిజాన్ని జాతీయ మీడియాకు వివరించిన తీరుతో, అర్నాబ్ గోస్వామి రాజ్దీప్ సర్ధేశాయ్ వంటి ప్రముఖ జర్నలిస్టుల ప్రశ్నలకు నిజాయతీగా, నిక్కచ్చిగా, ఆధార సహితంగా ఇచ్చిన సమాధానాలతో జరిగిన అన్యాయాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రచారం చేయడంలో నిస్సందేహంగా లోకేష్ కృతకృత్యులయ్యారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా తో సహా వివిధ పార్టీల నాయకులను కలసి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి చంద్రబాబుకు అనుకూలంగా వారి మద్దతు సాధించారు. పార్టీ ఎంపీలతో భారత రాష్ట్రపతి గౌరవ శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని సైతం కలసి చంద్రబాబు అక్రమ అరెస్టుపై వివరించారు.

యువగళం-నవశకం
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో 79 రోజుల సుదీర్ఘ విరామానంతరం పునఃప్రారంభమైన యువగళం తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో జనసేనతో కలసి జనసునామీ సృష్టించింది. ప్రజాస్వామ్యంపై అవినీతిపరుని దాడిని, వ్యవస్థలను ధ్వంసం చేసిన విధానాన్ని, ఉపాధి లేక యువత నైరాశ్యాన్ని పాదయాత్రలో కళ్లారా చూసిన నారా లోకేష్ పోలిపల్లిలో అశేష ప్రజానీకం మధ్య జరిగిన బహిరంగ సభలో విస్పష్టంగా వాటి పరిష్కారం కోసం టీడీపి,జనసేన అవలంభించే విధానాలు ప్రకటించి భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన దగా పడిన ప్రజలకు వెన్నుతట్టి స్థైర్యం ఇచ్చారు. ప్రతి జిల్లాలో వివిధ వర్గాలు పడుతున్న కష్టాలను సోదాహరణంగా వివరిస్తూ లోకేష్ చేసిన ప్రసంగం ఒక విధంగా జగన్ పాలనపై ఛార్జ్ షీట్ ఇచ్చినట్లు ఉంది.

పేదలను ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి. బడుగు వర్గాలకు అన్నివిధాలా అండగా నిలిచి, వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుని అడుగుజాడల్లో నడుస్తానన్న లోకేష్ మాటలు ప్రజల హృదయాలను తాకాయి. పార్టీ సంక్షోభ సమయంలో అన్ని తానై నిలచి బలమైన నాయకత్వం ఇవ్వగల భవిష్యత్ నేతగా పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఒక హైటెక్ యువకుని స్థాయి నుండి యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్న నారా లోకేష్ ఒక పరిపూర్ణ రాజకీయ నాయకునిగా, ప్రజలకు అండగా నిలచే సేవకునిగా, సంక్షోభంలో పార్టీని నడిపించే నేతగా పరివర్తన చెందిన తీరు, ఒదిగిన విధానం భవిష్యత్ రాజకీయ చిత్రపటంపై లోకేష్ ప్రభావాన్ని ఆవిష్కరిస్తోంది.

– లింగమనేని శివరామ ప్రసాద్
7981320543

LEAVE A RESPONSE