Suryaa.co.in

Editorial

దళిత, గిరిజన నియోజకవర్గాలపై కాంగ్రెస్ కన్ను

– 31 నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ కన్ను
– తెలంగాణ-కర్నాటక మంత్రులతో పార్టీ కార్యక్రమాలు
– ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కసరత్తు
– తొలుత దళిత, గిరిజన నియోజకవర్గాలపై దృష్టి
– ఇన్చార్జిల నియామకంపై దృష్టి
– అసెంబ్లీలో అరంగేట్రానికి ఆరాటం
– అధ్యక్షుడు గిడుగు ప్రత్యేక ప్రణాళిక
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ అసెంబ్లీలో అరంగేట్రం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఇప్పటిదాకా ఒక్క సీటు కూడా సాధించని కాంగ్రెస్.. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఆరాటపడుతోంది. ప్రధానంగా వైసీపీ రాకతో కోల్పోయిన దళిత గిరిజన ఓటు బ్యాంకును తిరిగి కైవసం చేసుకుని, వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఆ మేరకు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో హవా సాగించిన కాంగ్రెస్.. వెలుగు…రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా చీకట్లో చిక్కుకుంది. ఇప్పటికీ కాంగ్రెస్ రాజకీయ వైధవ్యం అనుభవిస్తోంది. విభజన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ, కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు. కొద్దిమంది ప్రముఖులు మినహా, మిగిలిన అగ్రనేతలంతా వైసీపీ-టీడీపీ-బీజేపీలో చేరిపోయారు. కెవిపి, రఘువీరారెడ్డి, పల్లంరాజు, తులసీరెడ్డి, బాపిరాజు, కాసు కృష్ణారెడ్డి, శైలజానాధ్, చింతా మోహన్ వంటి కొద్దిమంది ప్రముఖులు మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రంలో కోల్పోయిన ఓటుబ్యాంకును మాత్రం పెంచుకోలేక చతికిలపడిపోయింది.

చివరకు ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితికి దిగజారిన విషాదం. అయితే పక్కనే ఉన్న కర్నాటక-తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏపీ కాంగ్రెస్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆ దన్నుతో ఏపీలో మళ్లీ ఊపిరిపీల్చుకునే ప్రణాళికలకు, పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పదునుపెడుతున్నారు. అందులో భాగంగా తొలుత ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలపై, దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టిసారించడం ద్వారా, పోయిన ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ ఇన్చార్జిలను నియమించడం, ఆ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రముఖులతో సభలు ఏర్పాటుచేయించడం ద్వారా మళ్లీ కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావాలన్నది కాంగ్రెస్ ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థితిలో అన్ని నియోజకవర్గాలపై దృష్టి సారించేంత సమయం – వనరులు- యంత్రాంగం లేకపోవడంతో.. ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాలతోపాటు, మైనారిటీల ప్రభావిత నియోజకవర్గాలపై దృష్టి సారించడం ద్వారా, లక్ష్యం నెరవేర్చుకోవాలన్నద పార్టీ యోచనగా కనిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ రాకతో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కోల్పోయిన ఓటు బ్యాంకును, తిరిగి రాబట్టుకోవాలన్న లక్ష్యం కనిపిస్తోంది. రిజర్వుడు నియోజకవర్గాల్లో కర్నాటక-తెలంగాణ మంత్రులు-ప్రముఖుల పర్యటనలు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఏపీలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్నున్న కాంగ్రెస్లో.. అసలు లక్ష్యం వైసీపీ ఓటుబ్యాంకును ఏకకాలంలో దెబ్బకొట్టే ప్రయత్నంగానే కనిపిస్తోంది.నిజానికి ఏపీలో పదేళ్ల క్రితం వరకూ ఎస్సీ-ఎస్టీ-మైనారిటీలు కాంగ్రెస్ శాశ్వత ఓటుబ్యాంకుగా ఉండేవి. వైసీపీ రాకతో ఆ ఓటు బ్యాంకు చెల్లాచెదురయి, కాంగ్రెస్ ఖాళీ చేతుల్లో నిలబడాల్సి వచ్చింది. వైసీపీ దళిత గిరిజన ఓటు బ్యాంకును దెబ్బకొట్టకపోతే.. కాంగ్రెస్కు రాజకీయ మనుగడ ఉండదన్న అనుభవమే, కాంగ్రెస్ను ఆయా రిజర్వు నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తోంది.

ఆ మేరకు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, పార్టీ సీనియర్లతో వ్యూహరచన చేస్తున్నారు. 31 నియోజకవర్గాలపై సీరియస్ దృష్టి సారించడం, అందులో గెలిచే నియోజకవర్గాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం, అక్కడ తెలంగాణ-కర్నాటక మంత్రులు, ప్రముఖుల పర్యటనలు రూపొందించడం ద్వారా, ఎస్సీ-ఎస్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలన్న వ్యూహంతో ప్రళాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

‘ రాష్ట్రంలో కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవడమే మా లక్ష్యం. గతంలో అవన్నీ మా ఓటు బ్యాంకులే. కాంగ్రెసును జనం ముందు ముద్దాయిగా నిలబెట్టి మోసపూరిత విధానాలు,అబద్ధపు ప్రచారాలతో మా పార్టీ ఓటుబ్యాంకును కొల్లగొట్టిన పార్టీలకు రేపటి ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతాం. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై అసలైన ప్రతిపక్షంగా పోరాడింది మేమే. గతంలో వివిధ కారణాల వల్ల పోగొట్టుకున్న మా ఓటు బ్యాంకును మళ్లీ రాబట్టుకుంటాం. ఆ మేరకు కష్టపడతాం. దళితులు-గిరిజనులు- మైనారిటీలను వైసీపీ ఏవిధంగా మోసం చేసిందో ఆయా వర్గాలు అనుభవంలో తెలుసుకున్నాయి. అందుకే నిజం తెలిసి, మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. అందుకు కర్నాటక-తెలంగాణ ఎన్నికల ఫలితాలే నిదర్శనం” అని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE