Home » ఎన్నికల సంఘంపైనా వైసీపీ ఎదురుదాడి

ఎన్నికల సంఘంపైనా వైసీపీ ఎదురుదాడి

– ఈసీపై అభాండాలు వేసిన సీఎం జగన్
– ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదన్న జగన్
– జగన్ వేదనతో చేసిన వీడియోలు వైరల్
– పులి ఏడవకూడదంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
– జగన్‌ను అనుసరిస్తూ ఈసీపై దాడి పెంచిన మంత్రులు, నేతలు
-అధికారులను బదిలీ చేస్తే వారి మనోధైర్యం దెబ్బతింటుందట
– ఎన్నికల సంఘం పక్షపాతంతో పనిచేస్తోందట
– ఈసీ విశ్వసనీయత కోల్పోయిందట
– గతంలో డీజీపీ, ఏడీజీ, సీఎస్, ఎస్పీ, కలెక్టర్లపై ఫిర్యాదు చేసిన వైసీపీ
– వైసీపీ ఫిర్యాదు మేరకే సీఎస్, ఏడీజీ, ఎస్పీ, కలెక్టర్ల బదిలీలు
– అప్పుడు ఒప్పు అయితే.. ఇప్పుడు తప్పెలా అవుతుంది?
– వైసీపీ అభ్యర్ధుల్లో విజయంపై కోల్పోతున్న విశ్వాసం
– ఇక డబ్బు ఖర్చు పెట్టినా వృధా అని అభ్యర్ధుల నిర్ణయం?
– వైసీపీ కొంపముంచుతున్న జగన్ ఆవేదన
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ నాకయితే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదు. ఎన్నికలనేవి బాగా జరుగుతాయన్న నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతా ఉంది. ఇష్టానుసారంగా అధికారులను కూడా మార్చేస్తా ఉన్నారు’’
– ఇది వైనాట్ 175… సింహం సింగిల్‌గానే వస్తుందంటూ, చేతిని ఇచ్చాపురం నుంచి మాచర్ల వరకూ సాగదీస్తూ.. గొంతు వణికిపోతూ, వేదనాభరిత స్వరంతో.. ఏపీ బిడ్డ జగన్ చేసిన ప్రసంగం అంటే నమ్ముతారా? నమ్మితీరాలి మరి. ఎందుకంటే ఆ ప్రసంగం ఆయనదే కాబట్టి! అది ఇప్పుడు సోషల్‌మీడియాలో యమా వైరలవుతోంది కాబట్టి!!

ఎప్పుడూ గంభీరంగా, పెద్ద గొంతుతో దీర్ఘాలు తీస్తూ.. మళ్లీ మనమే వస్తున్నామంటూ పూర్తి ఆత్మస్థైర్యంతో మాట్లాడే వైసీపీ అధినేత జగన్.. తాజాగా చేసిన ప్రసంగంలో , ఎన్నికల ఫలితాలపై భయం, భవిష్యత్తుపై ఆందోళన, ఈసీ చర్యలతో వణికిపోతున్న వైఖరి కొట్టొచ్చినట్లు కనిపించింది. జగన్ ప్రసంగం దాదాపు వేదన చెందుతూ.. వణుకుతున్న స్వరంతో మాట్లాడటాన్ని, సోషల్‌మీడియా సైనికులు యమా ట్రోల్ చేస్తున్నారు. అవి ఇప్పుడు లక్షల సంఖ్యలో జనాల సెల్‌ఫోన్లకు చేరుతున్నాయి.

‘పులి అన్నావ్.. సింహం అన్నావ్.. పులి ఏడవకూడదన్నా’.. ‘సింహం సిక్కయిందేంటన్నా’.. ‘వణికించాల్సిన పులి వణికిపోతుందేంటి?’ ‘పులివెందుల పులి అట్ల ఏడవకూడదన్నా’.. ‘వైనాట్ 175 అన్నావే..ఇప్పుడేందన్నా ఇట్లా మాట్లాడుతున్నావ్’.. అంటూ, జగన్ వణుకున్న స్వరంతో చేసిన ప్రసంగం వీడియో పెట్టి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు.

ప్రత్యర్ధులపై ఎదురుదాడినే అస్త్రంగా నమ్ముకున్న వైసీపీ.. యధాప్రకారం ఇప్పుడు ఎన్నికల సంఘంపైనా, ఎదురుదాడికి దిగడం చర్చనీయాంశమయింది. తనకు అనుకూలంగా వ్యవహరించే డీజీపీ, ఏడీజీ, ఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లు, డీఎస్పీలపై వేటుతో వణికిపోతున్న వైసీపీ.. చివరి అస్త్రంగా ఎన్నికల సంఘంపై, ఎదురుదాడికి దిగడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. ఆ సందర్భంలో ఎన్నికల సంఘం నిర్ణయాలపై మంత్రులు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ప్రధానంగా ఎన్నికల సమయంలో అధికారుల బదిలీలు, పథకాల నిలిపివేతపై జగన్ నుంచి ఎమ్మెల్సీల ఆక్రోశం-గావుకేకలే ప్రజలకు.. కొంత వింతగానూ, మరికొంత విడ్డూరంగానూ అనిపిస్తున్నాయి. అసలు వైసీపీ ఇంతకుముందు ఎప్పుడూ, అధికార పార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనట్లుగా ఉన్న, వారి వేదనాభరిత వ్యాఖ్యలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి.

గత ఎన్నికల ముందు.. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అండ్‌కో నాటి ప్రభుత్వంలోని ఐపిఎస్- ఐఏఎస్- డిఎస్పీలను ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాలని ఈసీకి ఫిర్యాదు చేశాయి. ప్రధానంగా నాటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా, డీజీపీ , ఇంటలిజన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు ఎస్పీ, కలెక్టర్లను మార్చాలని ఫిర్యాదు చేసింది. దానితో వారు ఫిర్యాదు చేసిన ఒక్కరోజులో ఇంటలిజన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసి.. ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్‌ను, మూడురోజుల వ్యవధిలో సీఎస్ పునేఠాపై వేటు వేసి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా నియమించింది.

గత ఎన్నికల సమయంలో తొలివేటు ఎస్పీగా ఉన్న అడ్డాల వెంకటరత్నంపై పడగా, ఆ తర్వాత రాహుల్‌దేవ్, కోయ ప్రవీణ్‌పై పడింది. వీరిలో వివాదరహితుడిగా ఉన్న ప్రవీణ్ బదిలీ, ప్రకాశం జిల్లా వైసీపీ నేతలను సైతం విస్మయపరిచింది. మధ్యలో ఏబీని బదిలీ చేశారు. ఇక చాలామంది డీఎస్పీలను బదిలీ చేశారు. ఇవన్నీ వైసీపీ ఫిర్యాదు ఫలితమేనన్న విషయం, ఆ పార్టీకి తెలియకపోయినా ప్రజలు మర్చిపోరని గుర్తుంచుకోకపోడమే వింత.

‘‘వైసీపీ మర్చిపోయినంత మాత్రాన ప్రజలు మర్చిపోతారనుకుంటే అది భ్రమ. గురివిందగింజ సామెతలా వైసీపీ తాను పులుకడిగిన ముత్యంలా, అసలు త నకు ఫిర్యాదు చేయడమే తెలియదన్నట్లు, రక్తకన్నీరు నాగభూషణం మాదిరిగా నటిస్తే ఎలా? ఇంత సిగ్గుమాలినతనం మరొకటి ఉంటుందా? అప్పుడు వారిపై ఫిర్యాదు చేసినప్పుడు అధికారుల మనోస్థైర్యం దెబ్బతింటుందని ప్రతిపక్షంలో ఉన్న వైసీకి తెలియదా? అప్పుడు అధికారుల మనోస్థైర్యం దెబ్బతినలేదా? మరి ఇప్పుడు ఈసీ దానినే అనుసరించింది. అప్పుడు వైసీపీది ఒప్పయితే, ఇప్పటి ఈసీ నిర్ణయం కూడా ఒప్పేకదా’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు.

గతంలో విపక్షంగా ఉన్నప్పుడు తాను చేసింది ఒప్పని భావిస్తున్న వైసీపీ.. ఇప్పుడు అధికారంరలోకి వచ్చిన తర్వాత, విపక్షం కూడా తననే అనుసరిస్తుంటే మాత్రం దానిని తప్పనడమే వింత. ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని, ఈసీ ఆఫీసు ఎదుట సీఎంగా ఉన్న చంద్రబాబు ధర్నా చేయడం దారుణమని, గతంలో విపక్షంలో ఉన్న ఇదే వైసీపీ విమర్శించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న అదే వైసీపీ.. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఈసీని మాత్రం, బీజేపీ ఆడించే బొమ్మగా విమర్శించడమే ఆశ్చర్యం.

పార్టీ అధినేత జగన్ సైతం.. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకంలేదంటూ చేసిన వ్యాఖ్య, అటు వైసీపీ

అభ్యర్ధుల గుండెల్లో రాయి పడేలా చేసింది. స్వయంగా పార్టీ అధినేత-సీఎం అంతటివాడే.. తాము ఓడిపోతున్నామంటూ పరోక్షంగా ఆందోళనతో మాట్లాడితే, ఇక క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కాడి కిందపడేయడం ఖాయమన్నది వైసీపీ అభ్యర్ధుల అసలు ఆందోళన.

జగన్ వ్యాఖ్యల ఫలితంగా.. ‘ఇక ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం కూడా అనవసరం’ అన్న ఆలోచన అభ్యర్ధుల్లో మొదలయింది. ‘‘ఎలాగూ జగన్ సారే ఎన్నికలు సక్రమంగా జరిగేలా లేవని చెబుతుంటే, ఇక మేం అన్ని కోట్లు ఖర్చు పెట్టి పోరాడటం దండగ కదా? ఈ నాలుగురోజులు డబ్బు ఖర్చుపెట్టకుండా, జనాలకు దణ్ణం పెట్టుకుంటే పోతే సరిపోతుంద’’న్న నిర్ణయానికి వైసీపీ అభ్యర్ధులు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఎన్నికల సంఘంపై, వైసీపీ ఎదురుదాడికి పార్టీ అధినేత-సీఎం జగన్ ఆశీస్సులున్నాయన్నది సుస్పష్టం. చివరకు ప్రధాని మోదీపైనా మంత్రి బొత్స ఎదురుదాడి చేశారంటే.. దానికి జగన్ అనుమతి ఉందనేది సులభంగానే అర్ధమవుతుంది. మంత్రి బొత్స, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నిన్న మాజీ మంత్రి పేర్ని నాని తదితరులంతా, ఈసీ భుజంపై తుపాకి పెట్టి బీజేపీని గురిచూసి పేలుస్తున్న వైనమే కనిపిస్తోంది.

మొత్తంగా పార్టీ అధినేత జగన్.. ఎన్నికలు సక్రమంగా జరగవేమోనంటూ చేసిన నిరాశాపూరిత వ్యాఖ్యలు, వైసీపీ అభ్యర్ధుల మనోస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసినట్లు స్పష్టమవుతోంది. ఆయన వ్యాఖ్యలు ఇకపై డబ్బు ఖర్చు చేయకూడదన్న నిర్ణయానికి దారితీసినట్లు కనిపిస్తోంది. మరోవైపు విపక్షంలో ఉన్నప్పుడు అధికారులపై ఫిర్యాదు చేసి, వారిపై వేటు వేయించిన వైసీపీ.. ఇప్పుడు ఈసీ అదే పనిచేస్తే మాత్రం, గావుకేకలు పెట్టడం వల్ల వైసీపీకి జనంలో ఉన్న కొద్దిపాటి విశ్వసనీయత కూడా పోయినట్టయింది.

Leave a Reply