Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి కాపులకు ఇచ్చిన హామీలు ఆకాశంలో.. అమలు పాతాళంలో

– కాపులకు గత రెండు దశాబ్దాలలో జరగని అన్యాయం వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో జరిగింది
– వైసీపీ పాలనలో కాపులకు ఒనగూరిన ప్రయోజనం శూన్యం
– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్
జగన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో కాపులకు అడుగడునా అన్యాయం, అవమానాలే తప్ప వారికి జరిగిన ప్రయోజనం శూన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు కాపులకు ఏ ప్రభుత్వంలో జరగని అన్యాయం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. టీడీపీ ‍హయాంలో కాపులకు రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాల గౌరవం కల్పిస్తే జగన్ రెడ్డి కాపు సంక్షేమాన్ని గాలికొదిలారు. టీడీపీ హయాంలో కాపులకు అమలు చేసిన సంక్షేమ పధకాలు రద్దు చేయటమమే కాక కార్పోరేషన్ నిర్వీర్యం చేశారు.
నవరత్నాలు అంటూ నలుగురికి అందించిన సంక్షేమ పధకాలే కాపులకు అమలు చేస్తున్నారు తప్ప.. కాపులకు అంటూ ప్రత్యేకంగా అమలు చేసిన పథకాలు శూన్యం. కాపులకు కొత్తగా ఏదైనా పధకం తీసుకురాకపోగా ఉన్న పథకాలు ఊడగొట్టారు. జగన్ రెడ్డి అబద్దపు మాటలు చెబుతూ అవినీతి మూటలు సర్దుకుంటూ కాపులకు మోసం చేస్తున్నారు. కాపులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తెలుగుదేశం కల్పించిన 5శాతం రిజర్వేషన్లను అడ్డగోలుగా రద్దు చేశారు. ఫలితంగా కేవలం సచివాలయ ఉద్యోగాల్లోనే దాదాపు 12వేల మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.
కాపులకు శాశ్వత ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో ఎన్నికల హామీల్లో భాగంగా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. కోట్లు కాపుల సంక్షేమానికి, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో ఎదిగేందుకు ప్రోత్సహించాం. ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పధకం ద్వారా 4,528 మంది కాపు విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున ఆర్ధిక సహాయం చేసి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించాం. ఎన్టీఆర్‌ ఉన్నత విద్యా పధకం ద్వారా రూ.28.26 కోట్లతో 1,413 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూర్చాం.
ప్రతి జిల్లాలో కాపు భవన్‌లను నిర్మించాం. నిర్మాణాల్లో మరి కొన్ని భవనాలు జగన్ రెడ్డి నిలిపివేశారు. మరో వైపు కాపు నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో కాపులకు ఏం చేశారో చర్చకు రాగలరా.? కాపు రిజర్వేషన్లు ఎత్తేశారు. కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. చివరికి కౌలు రైతుల్లో కూడా కులాన్ని తెచ్చి రైతు భరోసా అందకుండా చేశారు. విద్యార్ధులకు విదేశీ విధ్య లేదు. నిరుద్యోగులకు భృతి లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కల్పించిన సదుపాయాలన్నింటినీ రద్దు చేసి.. కాపులను ఉద్దరించాం అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. అసలు కాపులకు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో జరిగినంత మేలు.. ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. ఈ అంశంపై వైసీపీ నేతలు చర్చకు సిద్ధమా.?

LEAVE A RESPONSE