Suryaa.co.in

Features

సత్పురుషుల వాస్తు

హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వారు హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు.

ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు.
వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడిచెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడేవాడు.

ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని తగినమార్పులు చేయించుకోమని వారికి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు.

వ్యాపారవేత్త వాస్తును పరిశీలించే శాస్త్రిగారిని తీసుకొని కారులో ఇద్దరూ బయలుదేరారు.
కొంత ప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో వ్యాపారవేత్త కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి, వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన శాస్త్రి గారు చిరునవ్వుతో మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు.

దానికి వ్యాపారవేత్త నవ్వుతూ అయ్యా! వారికి ఎదో అత్యవసరపని అయిఉండొచ్చు, అందుకే తొందరగా వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారిఇవ్వడం మన ధర్మం కదండీ! అన్నారు.
అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది.

అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో వ్యాపారవేత్త కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు.

ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన వ్యాపారవేత్త అతడిని తప్పించి తన కారును మరింత నెమ్మదిగా పోనిస్తున్నారు.

అది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది.ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు.ఈసారి ఆశ్చర్యపోవడం శాస్త్రిగారి వంతైంది.
సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడని మీరెలా ఊహించారు అని ప్రశ్నించారు.

దానికి వ్యాపారవేత్త నవ్వుతూ పిల్లలెప్పుడూ అంతేకదండి! ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా? అన్నారు.
కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది.

కారులోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఒక్కసారిగా ఎగిరాయి,అది చూసిన వ్యాపారవేత్త శాస్త్రిగారిని ఆపి, సర్ మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే ఆగి వెళదాం..

అక్కడ వెనక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడిపళ్ళు కొస్తున్నట్లు ఉంది, మనం కనుక హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు.

ఎందుకండీ అనవసరంగా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది అన్నారు.
శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు.ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు.
ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు !
ఈసారి ఆశ్చర్యపోవడం వ్యాపారవేత్త వంతైంది.

ఏమి?ఎందుకండి?

ఏ ప్రదేశం అయినా, మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే, దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు.

ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో,
ఆ ఫలితం లబ్దిపొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది.

అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్నిసమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి, వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మారిపోతాడు. అలాంటి వారికి ఒక వాస్తేకాదు, ఎలాంటి దోషాలూ కూడా దరిచేరవు!

నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!

ధర్మస్య విజయోస్తు
అధర్మస్య నాశోస్తు
ప్రాణిషు సద్భావనాస్తు
విశ్వస్య కళ్యాణమస్తు.

యతోధర్మః తతోజయః

LEAVE A RESPONSE