నగదులోనే మద్యం అమ్మకాలకు కారణం ఏమిటి?

ఢిల్లీ లో 100 కోట్ల మద్యం కుంభకోణానికే తీవ్రంగా స్పందించిన ప్రధాని…
మరి ఏపీలో వేల కోట్ల మద్యం కుంభకోణానికి ఛాన్స్… విచారణ జరిపిస్తే వెలుగులోకి నిజానిజాలు
పీవీ సునీల్ కుమార్ విచారణ నిర్వహించినప్పుడు అక్బర్, షహెన్ షా గురించి ఆయనకు ఎందుకు చెప్పలేదు?

సాక్షిలో, పార్టీ అధికారిక వెబ్ సైట్ లో క్రైమ్ ఫర్ గేయిన్ అని రాస్తున్నారంటే ఇది ఇంతటితో ఆగదు
గతంలో గుండెపోటుతో మరణించారని చెప్పి, ఇప్పుడు తాను చెప్పలేదనడం అవినాష్ కే చెల్లింది
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నగదులోనే ఎందుకు విక్రయిస్తున్నారు. నువ్వు ఏ తప్పు చేయకపోతే నగదులో అమ్మకాలకు కారణం ఏమిటి?. పోరాటం చేయగా, చేయగా 11 మద్యం దుకాణాలలో డిజిటల్ లావాదేవీలు త్వరలోనే ప్రారంభిస్తున్నామని చెప్పారు. మద్యం ద్వారా తమ జేబుల్లోకి వచ్చే ఒక్కరోజు ఆదాయాన్ని కూడా వదులుకోవడానికి పాలకులు సిద్ధంగా లేరని స్పష్టమవుతొందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఈరోజు ఆర్డర్ పెడితే, రేపు ఉదయానికల్లా 1000 స్వైపింగ్ మిషన్ వస్తాయి. నగదులో కాకుండా డెబిట్, క్రెడిట్ కార్డులు అంగీకరిస్తే, 100కు 100 శాతం డిజిటల్ పేమెంట్స్ జరుగుతాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యాన్ని నగదులోనే అమ్ముతున్నారు . సొంత బ్రాండ్లను సృష్టించారంటే , రాష్ట్రంలో మద్యం కుంభకోణం ఏ స్థాయిలో జరిగి ఉండి ఉంటుందో అంచనా వేయవచ్చునని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.

శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఢిల్లీలో 100 కోట్ల మద్యం కుంభకోణంపై తీవ్రంగా స్పందించిన ప్రధానమంత్రి, రాష్ట్రంలో మద్యం అమ్మకాలలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై కూడా దృష్టి సారించాలని కోరారు. గతంలో ప్రధానికి ఇదే విషయమై లేఖ రాశాను. ఇప్పుడు మళ్ళీ ఒక లేఖ రాస్తాను. రాష్ట్రంలో ఏటా 25 వేల కోట్ల రూపాయల చొప్పున, గత నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయల మద్యం లావాదేవీలు జరిగాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ గా ఉన్న వ్యక్తే , రాష్ట్రంలో ప్రధాన మద్యం సరఫరాదారుడు.

రాష్ట్రంలో పలు పరిశ్రమలను స్థాపిస్తానని చెప్పి సదరు వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు, ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలను కుదుర్చుకోవడమే కాకుండా, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులోనూ ప్రభుత్వంతో కొత్త ఒప్పందాలను కుదుర్చుకున్నాయి . ఇప్పటికే ఒక పోర్ట్ కొనుగోలు చేసి, మరొక పోర్టు నిర్మాణానికి సదరు వ్యక్తి సిద్ధపడుతున్నారు. రాష్ట్ర సంపదను ఒకే వ్యక్తి కొల్లగొడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు డిజిటల్ పద్ధతిలో కాకుండా, నగదు ద్వారానే ఎందుకు జరుగుతున్నాయో విచారణ జరిపిస్తే, పెద్ద కుంభకోణమే వెలుగు చూస్తుందని అని అన్నారు.

నెలకు 300 కోట్ల రూపాయలని అనుకున్న, గత నాలుగేళ్లలో వేల కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకునే అవకాశం ఉందనేది రాష్ట్ర ప్రజల భావన. నగదు లోనే మద్యం అమ్మకాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించదలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వండి. ఒకవేళ మద్యం అమ్మకాలు నగదులో విక్రయించడానికి తప్పు పడితే ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

ఢిల్లీలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేస్తే… రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేపట్టింది

ఢిల్లీలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించగా, రాష్ట్రంలో షాపుల ద్వారా మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి పూర్తి భిన్నమైన విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. నూతన మద్యం విధానం వల్ల ఢిల్లీ లో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రానికి లేఖ రాయగా, కేంద్ర ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి శరత్ చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ లోను పెద్ద ఎత్తున మద్యం వ్యాపారం చేయడమే కాకుండా, చిలిపి బ్రాండ్లను సృష్టించారు. ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ అనే మద్యం బ్రాండ్లను సృష్టించి, ప్రభుత్వానికి సరఫరా చేశారు. ప్రభుత్వమే తాను నిర్వహిస్తున్న మద్యం దుకాణాలలో ఈ బ్రాండ్లను విక్రయిస్తోంది. ఎన్నికలకు ముందు మధ్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నాలుగేళ్లలో మద్యనిషేధం అమలు చేయకపోతే మళ్లీ రానున్న ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రజలకు చెప్పింది. అయినా, భవిష్యత్తులో అమ్మబోయే మద్యంపై కూడా ఇప్పటికే 30 వేల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుగా తీసుకుందన్నారు.

ఇక రాష్ట్రంలోని మెజార్టీ డిస్టలరీలను లీజుకు తీసుకున్న శరత్ చంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి 1200 కోట్ల రూపాయల విలువ చేసే మధ్యమును సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 70 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 24 నుంచి 25 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం సరఫరాదారు నుంచి కొనుగోలులో పది నుంచి పదిహేను శాతం మొత్తం పాలకుల జేబుల్లోకి వెళుతున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారు. ఉదాహరణకు సరఫరాదారుని వద్ద నుంచి 20 నుంచి 30 రూపాయలకు సీసా మద్యం కొనుగోలు చేసి, ప్రభుత్వ మద్యం దుకాణాలలో దాన్ని 200 రూపాయలకు విక్రయిస్తున్నారు.

రాష్ట్రంలోని డిస్టలరీల కేవలం ముగ్గురు నలుగురు అస్మదీయుల చేతుల్లోనే ఉన్నాయి. వారికి ప్రభుత్వం పెద్ద రేట్లను ఇచ్చి, మద్యం కొనుగోలు చేస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్లు కేవలం మద్యం దుకాణాలలో ప్రదర్శనకే పరిమితమయ్యాయి. చివరకు తమ పార్టీ ఎంపీ కి చెందిన మద్యం బ్రాండ్ మెక్ డవల్ కూడా రాష్ట్రంలో మద్యపాన ప్రియులకు అందుబాటులో లేదు. చిలిపి బ్రాండ్లను మద్యం తయారీ దారుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, నగదులో విక్రయిస్తుందన్నారు. ఒకవైపు దేశ ప్రధాని డిజిటల్ ఇండియా కు అంకురార్పణ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా డిజిటల్ పేమెంట్లను నిరాకరిస్తోంది.

రాష్ట్రంలోని మూడు వేల మద్యం దుకాణాలలో నగదు ద్వారానే మద్యం విక్రయాలను నిర్వహించడం సిగ్గుచేటు. ప్రముఖ బ్రాండ్లు ఉంటే నాన్ డ్యూటీ పెయిడ్ రాదు. రాష్ట్రానికే చెందిన పరిమితమైన బ్రాండ్ల వల్ల డ్యూటీ పెయిడ్, కొంత నాన్ డ్యూటీ పెయిడ్ కింద తీసుకోవడం వల్ల పాలకుల జేబుల్లోకి పెద్ద మొత్తం నగదు చేరుతోంది. శరత్ చంద్రారెడ్డి నుంచి 30 రూపాయలకు మద్యం సీసాను కొనుగోలు చేసి, 200 రూపాయలకు విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది.

అదే కంపెనీకి చెందిన అదే బ్రాండ్ ను 30 శాతం డ్యూటీ లేకుండా చేయడం వల్ల పాలకులకు అదనంగా లాభం చేకూరుతోంది. మద్యం విక్రయాల ద్వారా రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 70 నుంచి 80 కోట్ల రూపాయలనుకుంటే, అందులో 10 కోట్ల రూపాయలు పాలకుల జేబుల్లోకి వెళ్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

వైఎస్ వివేక హత్య జరిగిన రోజే సూత్రధారుల అరెస్టులు ఉండవచ్చు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మార్చి 15వ తేదీ తెల్లవారుజామున జరిగింది. ఆయన హత్యకు సూత్రధారులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు మార్చి 14వ తేదీ, 15వ తేదీలలో జరిగే అవకాశం ఉంది. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కాబోలని రఘురామకృష్ణం రాజు అన్నారు. మార్చి 12వ తేదీన అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరవుతారా?, హాజరైతే ఆయన్ని అరెస్టు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ ఆయన విచారణకు హాజరు కాకపోతే, ఆ కారణంతో సిబిఐ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. విచారణకు హాజరైన, హాజరు కాకపోయినా అరెస్టు చేస్తారా?, 13వ తేదీ హైకోర్టులో వాదనల అనంతరం అరెస్టు చేస్తామని అంటారా?, హైకోర్టు కేసు విచారణతో భాస్కర్ రెడ్డి కి ఎటువంటి సంబంధం లేదు. సిబిఐ అధికారు అలా అనే అవకాశాలు లేవని రఘురామకృష్ణంరాజు తెలిపారు. సాక్షి దినపత్రికలో మొదటి పేజీ లో పావు పేజీ, ఆఖరు పేజీలో మొత్తం అవినాష్ రెడ్డి చెప్పిన కథనాన్ని ప్రచురించడం హాస్యాస్పదంగా ఉంది. తన లంచ్ మోషన్ పిటిషన్ లో , డాక్టర్ వైఎస్ సునీత ఇంప్లిడ్ కావడం పట్ల, వైఎస్ అవినాష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాను లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసిన విషయం ఆమెకి ఎలా తెలిసిందని అవినాష్ రెడ్డి ప్రశ్నించడం పట్ల రఘురామకృష్ణం రాజు విస్మయం వ్యక్తం చేశారు.

కోర్టులో ఎవరైనా పిటిషన్ మూవ్ చేస్తే, అది పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. అయినా, తన లాయర్ల ద్వారా కూడా ఆమె సమాచారం సేకరించి ఉంటారు. దానికి నిజాయితీపరుడైన సిబిఐ అధికారి రామ్ సింగ్ పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సూట్ కేసుల యుద్ధానికి ఎదురొడ్డి నిలబడ్డ రామ్ సింగ్ మీరిచ్చిన సొమ్ములు తీసుకుంటే పారదర్శకంగా వ్యవహరించినట్లు, లేకపోతే పారదర్శకంగా వ్యవహరించ నట్లా అని ప్రశ్నించారు.

అదే సిబిఐ గత నాలుగేళ్లుగా కోర్టుకు హాజరు కాకపోయినా జగన్మోహన్ రెడ్డిని హాజరు కావలసిన అవసరం లేదని చెప్పింది. కోర్టు కు హాజరు నుంచి మినహాయింపు నివ్వాలని కోరుతూ 1171 సార్లు పిటిషన్లు దాఖలు చేస్తే సిబిఐ అధికారులు అంగీకరించడంతో, కోర్టు కూడా సరేనని అంగీకరించింది. హైకోర్టు నుంచి రెండు సంవత్సరాలు నిజంగా హాజరు కాకపోయినా పర్వాలేదని స్టే తెచ్చుకుంటే, రెండేళ్లు స్టే లేకపోయినా సిబిఐ అధికారులు, కోర్టు ప్రశ్నించలేదని గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సిబిఐ అధికారులు మీ ఇష్టం అని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని చెప్పారన్నారు. సిబిఐ విచారణలో లేని వీడియో కెమెరాలను తెచ్చి తమ విచారణను చిత్రీకరించాలని కోరారు. కానీ తన ను, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని సిఐడి విచారించినప్పుడు ఉన్న సిసి కెమెరాలను తొలగించారు. న్యాయవాదుల సమక్షంలోని తమని విచారించాలని కోరుతున్న వారు, గతంలో దెబ్బలు తిని ఆస్పత్రిలో ఉన్న తన వద్దకు 48 గంటలు గడిచిన న్యాయవాది రాకుండా అడ్డుకున్నారు.

సీబీఐ విచారణలో వారికి అన్ని రకాల రక్షణ కావాలట… మీరు చేసిన దరిద్రపు పనులే, సిబిఐ వారు కూడా చేస్తారని భయంతోనే న్యాయవాది సమక్షంలోనే వీడియో చిత్రీకరణ ద్వారా విచారణ కోరుకుంటున్నారని అన్నారు. సిబిఐ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్పు. మిమ్మల్ని అదే సంస్థ విచారిస్తున్నప్పుడు మీకు అనుకూలంగా వ్యవహరిస్తే పారదర్శకత ఉన్నట్లు, నిజాయితీ కలిగిన ఒక అధికారి ఉంటే మీ దృష్టిలో ఆయనకు పారదర్శకత లేనట్లా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. మీ దృష్టిలో పారదర్శకత అంటే డబ్బులు తీసుకొని మీరు చెప్పినట్లు చేయడమా?, ప్రజలు అదే మన విధానం అనుకునే ప్రమాదం లేకపోలేదు.

రాష్ట్రంలో రామ్ సింగ్ పేరు మారు మోగిపోతుంది. ఇంత నిజాయితీపరుడైన అధికారి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నారా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆయనపై నిరాధార ఆరోపణలు చేయడం సరి కాదు. సిబిఐ అధికారులు ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న వారిని విచారించిన సీడీలను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఆ సిడీలను ఎప్పుడు చూస్తుందో… ఎప్పటికీ తీర్పు ఇస్తుందో. తీర్పు ఇవ్వడం అనేది న్యాయమూర్తి విచక్షణ పై ఆధారపడి ఉంటుంది … తాను గతంలో హైకోర్టులో దాఖలు చేసినా బెయిల్ రద్దు పిటిషన్ పై పది నెలల పది రోజుల తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది. వైఎస్ అవినాష్ రెడ్డి విషయములో అదే రోజు అరెస్టు చేస్తామంటారా ?, ఊరుకుంటారా అనేది చూడాలి అన్నారు.

26వ తేదీ అరెస్టు చేయాలని నిర్ణయించామన్న సిబిఐ

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి ని 26వ తేదీ అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, మళ్లీ ఆయనని విచారణకు పిలిచాం. శుక్రవారం అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని సిబిఐ స్పష్టంగా కోర్టుకు తెలియజేసిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వైయస్ అవినాష్ రెడ్డి అరెస్టును ముందుగానే ఊహించి, ఆయన్ని సిబిఐ విచారించడం ఆపాలని కోరుతూ అత్యవసరంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటివరకు మాట్లాడిన తీరుకు భిన్నంగా కొత్త అభియోగాలను వైయస్ వివేకాపై మోపారు. పిచ్చుకలు గూళ్ళు అల్లినట్లుగా సాక్షి దినపత్రిక ద్వారా పిచ్చుక గూళ్లను అల్లారు. శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ ద్వారా రాంసింగ్ వేధిస్తున్నారని ఫిర్యాదు చేయించి, కేసు నమోదు చేసి భయపెట్టాలని చూశారు. అయినా, ఇప్పుడు అరెస్టు తద్యమని తేలడంతో… ఒక మొగల్ స్టోరీ అల్లారు.

తాజ్ అనే వెబ్ సిరీస్ ఆధారంగా ఈ కథ అల్లినట్లుగా ఉంది. వైయస్ వివేకా ఒక ముస్లిం యువతిని వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారని, పెళ్లి కోసం ఆయన తన పేరు అక్బర్ గా మార్చుకున్నట్లు వైయస్ అవినాష్ రెడ్డి చెప్పారు. అక్బర్ కు షేహన్ షా అనే కుమారుడు కూడా ఉన్నట్టు అవినాష్ రెడ్డి చెప్పిన స్టోరీ చిన్న పిల్లల కథలా, మూర్ఖంగా ఉందని, సిల్లీగా ఉందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

వెబ్ సిరీస్ ప్రభావంతో వైయస్ అవినాష్ రెడ్డి , షేహన్ షా ను అక్బర్ తన రాజకీయ వారసుడిగా చూసుకోవాలని అనుకున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ వివేక హత్య నాటికి షేహన్ షా కు ఆయన చెప్పిన కథనం ప్రకారం ఏడేళ్లు ఉంటాయి. ఇదేమైనా రాజుల కాలమా?, రాజకీయాలలో వారసత్వాన్ని ప్రకటించడానికి అని ప్రశ్నించారు. 2007 లోనే వైఎస్ వివేకాతో బలవంతంగా ఆయన పదవికి ఎవరు రాజీనామా చేయించాలని చూశారో అందరికీ తెలుసు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే, తన పదవికి రాజీనామా చేసి అమెరికాలో ఉన్న కూతురు, అల్లుడి వద్దకు ఆయన వెళ్లాలనుకున్నారు.

కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, వైఎస్ వివేక రాజీనామాను ఆమోదించలేదు. 2009లో ఆయన అసలు పోటీనే చేయలేదు. వైఎస్ వివేకాకే రాజకీయం లేనప్పుడు, ఇక వారసత్వం అనే ప్రశ్న ఉత్పన్నం కాదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అక్బర్, షేహన్ షా కు రాజకీయ వారసత్వం ఇవ్వాలనుకున్నాడు… రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలనుకున్నాడని చెప్పి కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు రాజకీయంగా మా పార్టీ కొంపముంచే ప్రమాదం ఉందని గ్రహించి, కొంపకు నిప్పు అంటుకోకుండా మరమ్మతు చర్యలు చేపట్టారు. వైఎస్ వివేక హత్య జరిగిన తర్వాత మొదట ఆయన ఇంటికి వెళ్ళింది తానేనని అవినాష్ రెడ్డి అంగీకరించారు.

సిఐ శంకరయ్య కు ఫోన్ చేసి సెక్యూరిటీగా సిబ్బందిని పంపమన్నారు. వైఎస్ వివేకా రక్తపుమడుగులో పడి ఉండడం చూసి, హత్య జరిగి ఉండి ఉంటుందని కేసు నమోదు చేసేందుకు రావాలని పోలీసులను ఎందుకు కోరలేదన్నది ప్రాథమిక ప్రశ్న అని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శశికళ అనే మహిళతో వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా అవినాష్ రెడ్డి చెప్పారని, ఈ విషయాన్ని శశికళ ద్వారా సిబిఐ అధికారులు ఎప్పుడో రికార్డు చేశారు. గుండె పోటుతో మరణించినట్లుగా గతంలో చెప్పిన అవినాష్ రెడ్డి, తాను అలా చెప్ప లేదనడం హాస్యాస్పదంగా ఉంది.

ఈ విషయంలో శశికళ రివర్స్ అయినప్పటికీ, సాక్షి ఛానల్ లో గుండెపోటుతోనే వైఎస్ వివేకా మరణించారన్న కథనాన్నీ ప్రసారం చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఆ కథనానికి సంబంధించిన ఇమేజ్ మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా రివర్స్ చెబుతూ, వైఎస్ వివేకా దారుణ హత్య గురైతే, గుండెపోటుతో మరణించినట్లుగా తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా విచార వదనం లోటస్ పాండ్ లో చెప్పారు. సాక్షి దినపత్రికలో కూడా అదే కథనాన్ని రాశారు.

వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని అవినాష్ రెడ్డి చెప్పారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పుడు వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తాను చెప్పలేదని పేర్కొనడం, మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నమేనని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. న్యాయమూర్తికి ఒక పర్సెప్షన్ ఉంటుందని ఆయన ఇచ్చిన తీర్పు, పై కోర్టు కొట్టి వేసే వరకు అదే న్యాయమని భావించాలి. భారత న్యాయవ్యవస్థ అదే చెబుతోంది.

రోస్టర్ విధానంలో ఈ కేసు తన బెంచ్ కి రాదని ఒక న్యాయ మూర్తి అసహనం వ్యక్తం చేశారు. అయినా ఇటువంటి కేసులో ఎలా ఇన్వాల్వ్ అవుతానని ప్రశ్నించారు. రోస్టర్ విధానం ఆయన దగ్గర ఉండి ఉంటే తిరస్కరించి ఉండేవారేమో. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను ప్రధాన న్యాయమూర్తి విచారించేవారు. ఆయన బెంచ్ కు వెళ్లలేదు. బహుశా ఆయనే మరొక బెంచ్ కు ఇచ్చి ఉండవచ్చు. కోర్టు ప్రొసీజర్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు మార్చుకోవచ్చు. అయినా వైఎస్ అవినాష్ రెడ్డి అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు అంగీకరించడం పట్ల న్యాయ నిపుణులేనివ్వరపోయారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

మంగళవారం నాడు వైఎస్ అవినాష్ రెడ్డి కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టంగా ప్రకటించింది. సోమవారం సిబిఐ న్యాయవాది తో పాటు, డాక్టర్ వైయస్ సునీత తరపు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించనున్నారు. సోమవారం వాడి వేడి వాదనలు జరుగుతాయి.

హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఈ కేసును విచారణ చేపట్టగా, త్వరితగతిన కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా, దస్తగిరిని మీరు అప్రూవర్ గా ఎలా చేశారని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో వీరే దస్తగిరిని అప్రూవర్ గా చేయడాన్నీ ఖండిస్తే, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ తప్పు పట్టింది. ఒక కోర్టు నిర్ధారించిన దానిని, ఇంకొక కోర్టు వేలు పెట్టడానికి వీలు లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

గతంలోనే రాజశేఖర్ రెడ్డిని విచారించిన సిబిఐ అధికారులు

వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ని గతంలోని సిబిఐ అధికారులు ప్రశ్నించారని రఘు రామ కృష్ణంరాజు గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డిని ఎందుకు విచారించడం లేదని వైయస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. రాజశేఖర్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించిన వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పబ్లిక్ డోమైన్ లో ఉంటే పరిశీలించాను. వైఎస్ వివేకా రాసిన లేఖను మధ్యాహ్నం వరకు ఎందుకు ఇవ్వవద్దని చెప్పారన్న దానికి, ఆయన గతం లోనే స్పష్టంగా సమాధానం చెప్పారు.

వైఎస్ వివేకా ఫోటోలను పరిశీలించిన తర్వాత ఆయన మరణం వెనుక ఏదో కుట్ర దాగి ఉంటుందని భావనతో ఆయన లేఖను అందజేయకుండా అడ్డుకున్నట్లు తెలిపారన్నారు. ఆ లేఖను ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించి అది వైఎస్ వివేక తీవ్రమైన ఒత్తిడితో రాసిన లేఖగానే నివేదిక అందజేశారు. వైఎస్ వివేకా హత్యకు ముందు తర్వాత నిందితులంతా వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారన్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి ని హత్య చేసిన నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సిబిఐ, ఇప్పుడు అసలు సూత్రధారులు ఎవరో వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే త్వరలోనే వైఎస్ వివేక హత్య కుట్ర సూత్రధారుల అరెస్టులు ఉండే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

 

Leave a Reply