Suryaa.co.in

Entertainment

సినిమా పాట.. కేరాఫ్ సుబ్రమణ్యం!

బాలూ..
నీ మొదటి పాట మీటిన
కోదండపాణికో దండం..
చిలిపినవ్వుల
నిను చూడగానే అన్న
మా సాలూరు
నీ తొలినాటి రసాలూరు..
దర్మక్షేత్రం కురుక్షేత్రము న
నీ గళమున
కల్యాణవీణ మ్రోగించలేదా మృదుమధురముగ..
శాస్త్రీయసంగీతంలో బాలుకెక్కడిది ప్రవేశం
అని ఆవేశపడిన
విమర్శకులే
అచ్చెరువొంద
అచ్చమైన విద్వాంసుని వోలె
తెలుగునాట రికార్డుల విధ్వంసం నీతో సృష్టింపజేసిన
మామ మహదేవుడు
నీ,మా పాలి మహాదేవుడు..
నీ స్వీయ కల్పనలో
ఇది తొలిపాట అంటూ
నువ్వు పాడిన
సమ్మోహన గీతం
తిరిగిరాని
మా అందమైన
యవ్వన జ్ఞాపకాల గతం..!
దివిలో విరిసిన పారిజాతమును
భువికి దింపిన
నీ ప్రేమగీతం
మృధు మధురమన్నది అక్షర”సత్యం”..
బాలచంద్రుడి
దర్శకత్వ పటిమ
ఎమ్మెస్ విశ్వనాధుని
స్వరమహిమ
నీ పాటల ఝరి..
అదో అంతులేని కథ..
మరోచరిత్ర..
తాలికట్టు శుభవేళ
నువు చేసిన మిమిక్రీ
I don’t know what you say అంటూ ఇంగ్లీషులో
ఎలా పాడావన్నది ఎప్పటికీ అంతుచిక్కని ఓ మిస్టరీ..
ఆ పాటలన్నీ హిస్టరీ…
వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం
స్వరచక్రవర్తి జతగా పూయించావు కదయ్యా
మల్లెపూవు లు
మా మనసు పూదోటల్లో గుబాళించేలా
జీవితాంతం..
నీ మిత్రుడు కోటి..
తండ్రికే సాటి..
మాస్ పాటకు నువ్వే మేస్తిరి
అంటూ మీ చెలిమితో
వెండితెరను శాసిస్తిరి
హిట్టు పాటల రికార్థుల
మోత మోగిస్తిరి..
ఇక అన్నమయ్య..
సంప్రదాయ బాణి..కీరవాణి
గంధర్వులనే
అబ్బురపరచిన
నీ వాణి..
నాడు..నేడు మెరిసిపోలేదా
నీ పాటలతో
ఆకాశవాణి..
నిను గని
మురిసిపోలేదా
బ్రహ్మలోకమున
ఆ వీణాపాణి..
మ్యూజిక్ ఎవరిదైనా
నీ గాత్రమే మాజిక్..
నీ గానమే సినిమాకి ప్రాణం..
పాటకి నువ్వే ప్రమాణం..
అందుకే ఎప్పటికీ ఇంటింటా
నీ పాటల పారాయణం..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE